కొత్తగా పెండ్లయిన జంటలు ఏకాంతం కోసం హనీమూన్ వెళ్లటం తెలిసిందే. కానీ ఇప్పుడు కొత్తగా తల్లిదండ్రులు కాబోయే జంటలూ విహారయాత్రలకు వెళ్తున్నాయి. ఇటీవల నటి సోనమ్ కపూర్ జంట కూడా పాపాయి పుట్టబోయే ముందు సమయాన్ని సరదాగా గడపాలనుకున్నామంటూ ఇటలీకి వెళ్లొచ్చింది. బేబీమూన్గా పిలుస్తున్న ఈ ట్రెండ్ ఇప్పుడు హైదరాబాద్‌కూ పాకింది.
చంటిబిడ్డ ఇంట్లోకి వస్తున్నదంటే ఇల్లంతా మారిపోవాల్సిందే. వాళ్ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా తల్లిదండ్రులు అంతకు ముందులా స్వేచ్ఛగా నచ్చినట్టు ఉండటానికి, తినడానికి, తిరగడానికి అసలే వీలుపడదు. అయినా సరే ఈ మార్పులన్నీ పాపాయి రాకకోసం ఎదురు చూసేవాళ్లకు సంతోషంగానే ఉంటాయి. అందుకే ఒక జంటగా తమకంటూ ఉన్న వ్యక్తిగత సమయాన్ని.. ఒకరికొకరు దగ్గరగా, ఒకరి సమక్షంలో మరొకరు ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నది నవతరం.
ఆ కారణం వల్లే బేబీమూన్ నయా ట్రెండ్ అవుతున్నది. ఇటీవల నటి సోనమ్ కపూర్ జంట ఇటలీ వెళ్లి రావడం అక్కడ తాము తిలకించిన ప్రదేశాలు, ఆరగించిన ఆహారాల చిత్రాలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో బేబీమూన్ హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్ షగున్ సెగన్ తమ బేబీమూన్ చిత్రాలనూ వీక్షకులతో పంచుకున్నారు. కాబోయే తల్లిదండ్రులుగా తమకు ఉన్న ఒత్తిడి నుంచి బేబీమూన్ కాస్త విశ్రాంతినిచ్చిందని చెబుతారు షగున్. అంతంత దూరం ప్రయాణించడం గర్భిణికి ఇబ్బంది అవుతుందేమో అనిపించినప్పుడు.. అందుబాటులోని స్టార్ హోటల్స్‌లో లేదా రిసార్ట్స్‌లో కాలం గడుపుతున్నారు కొందరు. గర్భధారణ సమయంలో దంపతులు సంతోషంగా గడపడం తల్లీ బిడ్డల ఆరోగ్యం మీద చక్కని ప్రభావం చూపుతుందన్నది మానసిక నిపుణులు కూడా అంగీకరించే మాటే.