తన తల్లి, అలనాటి అందాల నటి.. షర్మిలా ఠాగూర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నది బాలీవుడ్ భామ సోహా అలీఖాన్. హీరోయిన్గా అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నప్పుడే.. వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలని చెప్పుకొచ్చింది. అది ‘ప్రొఫెషనల్ సూసైడ్’ అంటూ అందరూ హెచ్చరించినా.. అమ్మ వెనక్కి తగ్గలేదని అంటున్నది.
తాజాగా, ఓ జాతీయ మీడియాతో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది సోహా అలీఖాన్. ఈ సందర్భంగా తన తల్లి షర్మిలా ఠాగూర్ జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నది. “మా అమ్మ 13 ఏళ్ల వయసు నుంచే పనిచేయడం మొదలుపెట్టింది. చాలా చిన్నతనంలోనే సొంతంగా డబ్బు సంపాదించేది. ఆ రోజుల్లో సినిమాల్లో పనిచేయడాన్ని చాలామంది వ్యతిరేకించేవారు. హీరోయిన్గా చేస్తున్నవారిని చిన్నచూపు చూసేవారు. మా అమ్మకూ అలాంటి అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. అన్నిటినీ భరించింది. బాలీవుడ్లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది” అంటూ తన తల్లిని ఆకాశానికి ఎత్తింది.