నేటితరం.. ఉరుకులు పరుగులతోనే జీవితాన్ని గడిపేస్తున్నది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా.. కాలంతో పరుగులు తీస్తున్నది. ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌కు వెళ్లినా.. వారి పరిస్థితి ఆగమాగమే అవుతున్నది. చివరికి సరదాగా గడపాల్సిన విహారయాత్రల్లోనూ.. ప్రశాంతంగా ఉండలేకపోతున్నది. ఈ పరిస్థితికి ఓ కొత్త ట్రెండ్ పరిష్కారం చూపుతున్నది. ‘సాఫ్ట్ ట్రావెల్’.. విహారయాత్రలను అందంగా, ఆహ్లాదంగా మారుస్తున్నది.
వారం మొత్తం కష్టపడి.. వారాంతంలో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తారు. సరదాగా గడిపొద్దామని బయల్దేరి.. అంతటా హడావుడి పడుతుంటారు. ప్రయాణం మొదలైనప్పటి నుంచి ముగిసేదాకా.. ప్రతి విషయంలోనూ ఆగమాగం అవుతుంటారు. మనసారా సందర్శించాల్సిన ప్రదేశంలో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేరు. స్థానిక వంటకాల్ని ఆస్వాదించలేరు. ఫ్లయిట్ టైమ్ అవుతుందనో.. ట్రెయిన్ బయల్దేరుతుందనో కంగారు పడుతుంటారు. ఆగమేఘాల మీద తిరుగు ప్రయాణం అవుతారు. ఇలాంటి విహారయాత్రలు ఎన్ని చేసినా.. మనసుకు ఏమాత్రం ప్రశాంతంగా అనిపించదని అంటున్నారు నిపుణులు. దీనికి పరిష్కారంగా.. ‘సాఫ్ట్ ట్రావెల్’ చేయాలని సూచిస్తున్నారు.
2025లో అత్యంత ఆసక్తికరమైన, అత్యంత ప్రశాంతమైన ‘ట్రావెల్ ట్రెండ్’గా నిలుస్తున్నది.. సాఫ్ట్ ట్రావెల్! ప్రపంచాన్ని మరింత ప్రశాంతంగా అన్వేషించడానికి ఈ ట్రెండ్ ఎంతో ఉపయోగపడుతున్నది. సమయం మించిపోతున్నదన్న బెంగ లేకుండా, ఎలాంటి తొందరపాటు పడకుండా.. ప్రశాంతంగా, హాయిగా ట్రిప్‌ను ఎంజాయ్ చేయడమే.. సాఫ్ట్ ట్రావెల్! ప్రస్తుతం టూర్ ప్లాన్ చేసుకునే ప్రతి ఐదుగురిలో.. ఒకరి కంటే ఎక్కువమంది తగినంత విశ్రాంతినే కోరుకుంటున్నారు. మానసిక ఆరోగ్యం, తమను తాము తెలుసుకునేందుకు ఏదో ఒక ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ఇలాంటివారంతా ఇప్పుడు ‘సాఫ్ట్ ట్రావెల్’ వైపు మొగ్గుచూపుతున్నారు.
సాఫ్ట్ ట్రావెల్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మానసిక ప్రశాంతతకే తొలి ప్రాధాన్యం. ఉదయం లేవడం.. ఆదరాబాదరాగా తినడం.. సైట్ సీయింగ్‌కు వెళ్లడం సాఫ్ట్ ట్రావెల్లో ఉండదు. మీకు కావాల్సినంత సమయంపాటు పడుకోవచ్చు. ఇందులో భాగంగా ఒకే ప్రాంతంలో వారం, పది రోజులపాటు ఉంటారు. కాబట్టి, అక్కడి సంస్కృతి సంప్రదాయాల గురించి పూర్తిగా అవగాహన ఏర్పడుతుంది. స్థానిక ఆహారాలనూ పరిపూర్ణంగా ఆస్వాదించొచ్చు. ఆ రోజు ఏం చేయాలో.. ఎక్కడెక్కడ తిరగాలో మీరే నిర్ణయించుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఉండొచ్చు. ఇందులో మరో ముఖ్యమైన అంశం.. సాఫ్ట్ అడ్వెంచర్. సుదూర ప్రాంతాలకు హైకింగ్లు, ట్రెక్కింగ్ చేయడం. ఇందులోనూ థ్రిల్ ఉంటుంది. కాకుంటే.. కొంచెం నెమ్మదిగా, సాఫ్ట్‌గా! ఒక్కమాటలో చెప్పాలంటే.. సాఫ్ట్ ట్రావెల్ అంటే, ప్రయాణాన్ని మరింత సౌకర్యంగా, విశ్రాంతి తీసుకుంటున్నట్టుగానే ఆస్వాదించడం. మరెందుకు ఆలస్యం.. ఎలాగూ పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయి. పెట్టేబేడా సర్దుకోండి. మీకు నచ్చిన.. మీరు మెచ్చిన పర్యాటక ప్రదేశాన్ని ఎంచుకోండి. వారం – పది రోజులు కాదు.. అధమపక్షం పక్షం రోజులైనా ప్రశాంతంగా గడిపిరండి. శీఘ్రమేవ సుదీర్ఘయాత్రా ఫలసిద్ధిరస్తు!