హాల్లో స్మార్ట్ టీవీ, చేతిలో స్మార్ట్‌ఫోన్, గదిలో స్మార్ట్ ఫ్యాన్.. ఇల్లంతా స్మార్టే! మరి వంటిల్లు మాత్రం స్మార్ట్‌గా ఎందుకు ఉండకూడదు. కిచెన్‌లో ఏ వస్తువు తక్కువైనా లోటుగానే అనిపిస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో అన్ని వస్తువులు అందుబాటులో ఉంటే చకచకా పనులు చేసుకోవచ్చు. ఇది జరగాలంటే కిచెన్‌లో స్మార్ట్ వస్తువులు తప్పక అందుబాటులో ఉండాలి. అలాంటి వాటిలో కొన్ని ఇవి..
కూరలు తరగడానికి కత్తి లేదా కత్తిపీట వాడుతారు. కొన్నాళ్లు వాడిన తర్వాత క్రమంగా వాటి పదును తగ్గుతుంది. ఫలితంగా కూరలు కట్ చేయడానికి ఇబ్బంది ఎదురవుతుంది. ఈ సమస్యకు 3 స్టేజ్ షార్ప్‌నర్‌తో చెక్ పెట్టవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్, ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారయ్యే ఈ 3 స్టేజ్ షార్ప్‌నర్ వాడకం చాలా తేలిక. దీనిని ఉపయోగించి కత్తి, కత్తిపీటను ఇట్టే సానబెట్టుకోవచ్చు.
మైక్రోవేవ్ ఓవెన్లో మన పాత్రలతో వండుతామంటే కుదరదు. ఓవెన్‌లోంచి పాత్రను బయటికి తీసే క్రమంలో చేతులు కాలుతాయి. ప్లాస్టిక్ లేదా ఇతర లోహాలతో చేసినవి వాడతామంటే పదార్థం పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఓవెన్లో పదార్థాల తయారీకి మైక్రోవేవ్ బౌల్ హగ్గర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగిస్తే పదార్థం వేడెక్కుతుందే కానీ, పాత్రలు సుర్రుమనిపించవు.
కిచెన్‌లో మిక్సీ, గ్రైండర్ వినియోగం విపరీతంగా ఉంటుంది. ఇందులో కొత్తరకం ఫుడ్ ప్రాసెసర్. సుగంధ ద్రవ్యాల గ్రైండింగ్, పిండి కలపడానికి, కూరగాయలు కట్ చేయడానికి, జ్యూస్ తయారీకి ఫుడ్ ప్రాసెసర్ చక్కని ఎంపిక. దీనిని అనేక రకాలుగా వినియోగించుకోవచ్చు. వాడకం కూడా చాలా తేలిక!