చిన్నపిల్లల పెంపకం ఓ కళ. దానిని మనసారా ఆస్వాదించాలంటే పెద్దల సలహాలు పాటించడం తప్పనిసరి. నెలల వయసున్న పిల్లల స్నానానికి ముందు నూనెతో ఒళ్లంతా మర్దనా చేయడం చూస్తుంటాం. అలా మసాజ్ చేయడం వల్ల.. పిల్లల కండరాలు బలంగా తయారవుతాయి. చక్కగా మర్దనా చేసి, గోరువెచ్చని నీటితో స్నానం చేయగానే బుజ్జాయిలు బుద్ధిగా బజ్జుంటారు. కంటి నిండా నిద్ర.. చంటిపాపలకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. వాళ్లు చక్కగా ఎదగడానికి దోహదం చేస్తుంది.
మసాజ్ చేయడం అంటే… ఏదో నూనె రాసేశాం, నీళ్లు పోసేశాం అన్నట్టు ఉండొద్దు. పిల్లలు నిద్రమత్తులో జోగేలా ఈ వ్యవహారం నడిపించాలి. వెచ్చని వాతావరణం ఉండేలా చూసుకోవాలి. మర్దనా చేసేది అమ్మ అయితే.. బిడ్డకు గాజులు తగలకుండా చూసుకోవాలి. ఈ కార్యాన్ని నాన్న చేసే పనైతే… ఉన్న బలాన్నంతా ప్రయోగించకుండా సున్నితంగా డీల్ చేయాలి. అంతేకాదు పిల్లల ఒళ్లంతా నూనె రాసినప్పుడు వాళ్లు కాళ్ల నుంచి జారిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా.. కాళ్లపై దళసరి వస్త్రం పరిచి మసాజ్‌కు శ్రీకారం చుట్టాలి.
స్నానానికి ముందు మసాజ్ చేయడం మంచిది. శరీరంలోని ప్రతి భాగానికి నూనె లేదా ఏదైనా మాయిశ్చరైజర్ అప్లయ్ చేసి మృదువుగా మర్దనా చేయాలి. తల, మెడ, భుజాలు, తొడలు, కాళ్లకు మసాజ్ చేస్తే పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. నెమ్మదిగా మర్దనా చేయడం వల్ల పిల్లల్లో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. శ్వాసక్రియ మెరుగవుతుంది. జీవక్రియలు నిరాటంకంగా సాగుతాయి. చక్కని నిద్ర పడుతుంది. పొట్ట పైభాగంలో మృదువుగా మర్దనా చేస్తే గ్యాస్, అజీర్తి సంబంధిత సమస్యలు దరిచేరవు.