ఆ ఇద్దరూ జిగిరీ దోస్తులు. శ్వేత సుబ్బయ్య ఫిట్నెస్ కోచ్ అయితే, తన్వి హన్స్ ఫుట్బాల్ క్రీడాకారిణి. ఏడెనిమిదేండ్ల క్రితం ఎవరో తన్విని.. మూడుపదుల వయసు మహిళల కోసం ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించమని అడిగారు. ఆమె కూడా అంగీకరించారు. మనసులో ఓ మూలన మాత్రం ‘ఆడవాళ్లు ఉత్సాహంగా పాల్గొంటారా?’ అనే అనుమానం. మొత్తానికి పదిహేడు మంది లెక్క తేలారు. కానీ, మ్యాచ్ గురించి తెలుసుకోవడానికి చాలామందే ఆసక్తి చూపారు. ఓ సురక్షితమైన చోటు దొరికితే.. మనసారా ఆడుకోవడానికి, కొవ్వు కరిగేలా కసరత్తు చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని స్పష్టమైపోయింది.
మహిళల ఫిట్నెస్ మార్కెట్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉన్న విషయం కూడా వారికి అప్పుడే అర్థమైంది. అలా ఆరేండ్ల క్రితం.. ‘సిస్టర్స్ ఇన్ స్వెట్’ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఇప్పటివరకూ ఓ మూడువేల మంది నడివయసు మహిళలకు ఫుట్బాల్, రగ్బీ, క్రికెట్ మ్యాచులు నిర్వహించి ఉంటారు. ‘ఇప్పటికే స్నేహితులుగా బ్యాలెన్స్ సాధించాం. వ్యాపార భాగస్వాములుగా సమతౌల్యం సాధించడానికి కొంత సమయం పడుతుంది’ అంటున్నారు ఇద్దరూ. ‘మహిళ గడపదాటి మైదానంలోకి రాగలిగితే.. దవాఖాన వరకూ వెళ్లాల్సిన అవసరమే ఉండదు’ అని సలహా ఇస్తారు శ్వేత, తన్వి.