అమ్మాయా? అబ్బాయా?.. తనను చూడగానే కొత్తవాళ్ల మనసులో మెదిలే ప్రశ్న. చెబితే కానీ తెలియదు అమ్మాయని. చూస్తే కానీ అర్థంకాదు అబ్బాయిలకు తీసిపోని ధైర్యవంతురాలని. సినిమాల్లో నటించినా, స్టేజీ ఎక్కి ఆడిపాడినా..తనదైన ముద్ర ఉంటుంది. మల్టీటాలెంటెడ్ గాళ్.. స్నిగ్ధ నయని. జీ తెలుగు రియాల్టీ షో ‘సూపర్ క్వీన్’విజేతగా నిలిచిన స్నిగ్ధ ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..
మాది రాజమండ్రి. నాన్న జగదీశ్. అమ్మ రాజేశ్వరి. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో చదువుకున్నా. చిన్నప్పటినుంచీ ఆర్మీ ఆఫీసర్ కావాలనేది నా కల. అందుకే క్రీడలపై దృష్టి పెట్టేదాన్ని. అప్పటినుంచే షార్ట్స్, ప్యాంట్స్ అలవాటైపోయాయి. స్కూల్, కాలేజ్ రోజుల్లో అయితే నిజంగా అబ్బాయినని పొరబడేవాళ్లు. అమ్మాయిలు ప్రపోజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాన్న డాక్టర్. నన్నెప్పుడూ ఇది చదువు, అది చదువు అని ఒత్తిడి చేయలేదు. నాకిష్టమైన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛనిచ్చారు. ఓ దశలో హెచ్ఆర్ మేనేజర్‌గా స్థిరపడాలనుకున్నా. కాలేజీ రోజులనుంచీ స్టేజ్ షోలలో ఎక్కువగా పాడేదాన్ని.
హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాక ‘ఒక్కరే’, ‘లిటిల్ స్టార్స్’ వంటి సింగింగ్ షోస్ చేశాను.
అలా మొదలైంది..
చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నా. కీరవాణి, మిక్కీ జే మేయర్ దగ్గర బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా సినిమాలకు పాడాను. ప్లేబ్యాక్ సింగర్‌గా ఓ రెండు సినిమాలకు పాడాను. ఓరోజు కల్యాణి మాలిక్గారు ఫోన్ చేసి రమ్మంటే పాటలో ఏవైనా కరెక్షన్స్ చేస్తారేమో అనుకున్నా. కానీ సినిమా క్యారెక్టర్ అని చెప్పారు. సరే ప్రయత్నిద్దామనుకున్నా. నా వేషం మాత్రం మార్చుకోనని ముందే షరతు పెట్టా. నేనెలా ఉంటానో అలా ఉంటే చాలన్నారు. అలా నేను ‘అలా మొదలైంది’లో నటించాను. ఆ చిత్రం కోసం ఓ పాట కూడా పాడాను.
పాటపైనే దృష్టి..
సినిమాల్లో నటించినా, పాటలపైనే ఎక్కువ దృష్టి పెట్టాను. నెలకు పదీ పదిహేను స్టేజ్ షోలు చేస్తుంటా. మిమిక్రీ కూడా చేస్తా. నవ్వించడం అంటే ఇష్టం. నేను సంగీత దర్శకురాలిగా చేసిన ‘బాలరాజు’ సినిమా ఈ నెల 22న విడుదలకానుంది. అమెజాన్ ప్రైమ్ కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఓ వెబ్‌సిరీస్ రూపొందిస్తున్నా. ‘ఆహా’లోనూ పలు షోలు చేశాను. నేను నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అమెరికాలో మూడు రోజుల్లో మూడువేల మైళ్లు చుట్టొచ్చా.
భయపడేలా ఉండాలి
గతంతో పోలిస్తే నేటి మహిళలు చాలా ధైర్యవంతులు. అయినా ఆత్మవిశ్వాసం ఇంకా మెరుగుపడాలి. రోజూ అత్యాచారాలు, కిడ్నాప్ వార్తలు చూస్తుంటే బాధేస్తుంది. సినిమా ఇండస్ట్రీ గురించి కూడా రకరకాల కథనాలు వస్తుంటాయి. మనం స్ట్రాంగ్‌గా ఉంటే ఎవరూ మన జోలికి రారని నమ్ముతాను. ‘స్ఫూర్తి’ అనే ఆర్గనైజేషన్ ద్వారా మోటివేషన్ షోలు చేస్తున్నా. సెల్ఫ్ డిఫెన్స్‌పై కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేశా.
ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. బాగా దగ్గర అంటే.. రాజ్ తరుణ్, నాగశౌర్య, కల్పిక. నందిని రెడ్డితో నా బంధం చాలా ప్రత్యేకమైంది. నా వృత్తిగత, వ్యక్తిగత విషయాల్లో తనే గైడ్. ఏదైనా ఉంటే అమ్మానాన్న కూడా తనకే ఫోన్ చేస్తారు. అందుకే నందిని రెడ్డిని భాయ్ అని పిలుస్తా. తన సినిమాలన్నిటికీ ఏదో ఒకలా పనిచేస్తాను. వెంకీమామ మా ఫ్యామిలీ ఫ్రెండ్. నేను సినిమాల్లోకి వచ్చానని తెలిసి చాలా ఆశ్చర్య పోయారు. నాగ్‌మామ కూడా సన్నిహితుడే.
మరువలేని ప్రయాణం
జీ తెలుగు ‘సూపర్క్వీన్’ నా ఫస్ట్ రియాలిటీ షో. మొదటి షోలోనే టైటిల్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా అదో అద్భుత ప్రయాణం. సూట్ వేసుకుని ‘సూపర్ క్వీన్’ కిరీటం అందుకోవడం థ్రిల్‌గా అనిపించింది. ప్రేమ, పెళ్లి మీద పెద్దగా నమ్మకం లేదు. నేను శివభక్తురాలిని. ఏడాదిలో నాలుగు నెలలు దీక్షలోనే ఉంటా. దైవ పూజలో ఉన్న ప్రశాంతత ఎందులోనూ లేదు. ఈవెంట్లు, సినిమాలు, షూటింగ్‌లతో బిజీబిజీగా నా ఒంటరి జీవితం సాగిపోతున్నది. శివుడిలాంటి వ్యక్తి తారసపడితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా.
-ప్రవళిక వేముల