Singer Smitha | ప్రముఖ పాప్ సింగర్.. యాక్టర్.. ఆంత్రప్రెన్యూవర్.. డ్యాన్సర్.. డిజైనర్.. సోషల్ యాక్టివిస్ట్.. అన్నిటికీ మించి ఓ ఆదర్శ గృహిణి.. అయినప్పటికీ దేని సమయం దానికే. ఇన్ని పనులు నిర్వర్తిస్తూనే.. తన పేరును సార్థకం చేసుకుంటూ మోముపై చిరునవ్వును చెదిరిపోనివ్వని మనసున్న మానవతావాది సింగర్ స్మిత. చాలా ఏండ్ల తర్వాత బుల్లితెరపై మళ్లీ చిరునవ్వులు చిందిస్తున్నారు. తన చుట్టుపక్కల వారి కష్టాలు తనవిగా భావించి.. తెలివిగా పరిష్కరిస్తూ తన పంథాతో దూసుకెళ్తున్నారు. తన కొత్త ఆల్బమ్, సరికొత్త టీవీ షో, వ్యాపారం, ఇంటిల్లిపాది ముచ్చట్లను ‘జిందగీ’తో పంచుకున్నారు స్మిత.
ప్రశ్న : పాటల ప్రయాణంలో మీ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారెందుకు?
– (చిరునవ్వుతో..) గ్యాప్ కావాలనే ఇచ్చాను. తెరమీద చానాళ్ల తర్వాత కనిపించినా.. అప్పుడప్పుడూ కొన్ని ఆల్బమ్స్‌తో బిజీగానే ఉన్నాను కానీ, బయటి ప్రపంచానికి కొంచెం దూరంగానే ఉన్నాను. కుటుంబం, వ్యాపారం కోసం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నా అవసరం వాటికి ఉందనిపించింది. ఇప్పుడు ‘జీ తెలుగు సరిగమప’లో కనిపిస్తున్నానంటే కారణం.. నా ఫ్యామిలీ, బిజినెస్, ప్రొఫెషన్‌కు టైమ్ షెడ్యూల్డ్ వేసుకోవడం వల్లనే. నేను ఏదైనా కమిట్ అయితే దానిని తుది వరకూ కొనసాగించాల్సిందే. ఎన్నో సమాలోచనల తర్వాతే న్యాయ నిర్ణేతగా కనిపిస్తున్నాను.
ప్రశ్న : ఒకప్పుడు మీరు సింగర్.. ఇప్పుడు జడ్జి.. కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నారు?
– ఇదొక ఊహించని ప్రయాణం. నేను ‘పాడుతా తీయగా’ రెండో సీజన్లో ఫైనలిస్టుగా ఉన్నాను. ఇప్పుడు ‘జీ తెలుగు సరిగమప’లో జడ్జిగా వారి పాటలు వింటూ.. వారిలో నన్ను నేను చూసుకుంటున్నా. నేను అక్కడ పేరుకు మాత్రమే జడ్జి.. ఓ సింగర్‌గా వారి పాటలు ఆస్వాదిస్తూనే ఉంటా.
ప్రశ్న : మట్టిలో మాణిక్యం పార్వతి.. ఆ అమ్మాయి సొంతూరికి బస్ రావడం వెనుక మీ కృషి ఉంది.. ఆ విశేషాలు చెప్పండి?
– పార్వతిది కర్నూలు జిల్లాలోని మారుమూల పల్లె. మూడు జతల బట్టలతో హైదరాబాద్ వచ్చింది. ఆ అమ్మాయి గాత్రం అమోఘం. జడ్జీలుగా మేం ‘ఏం కావాలో కోరుకో’ అనగానే.. ‘నాకేం వద్దు మేడమ్! మా ఊరికి బస్ వస్తే చాలు’ అని జవాబిచ్చింది. ఆ మాట నా మనసును తాకింది. ‘నువ్ అనుకో.. మీ ఊరికి బస్ వస్తుంది’ అంటూ ప్రోత్సహించా. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. తెల్లవారుజాము నుంచే ఆంధ్రప్రదేశ్‌లో నాకు తెలిసిన అధికారులకు ఫోన్లు చేస్తూనే ఉన్నాను. చివరి ప్రయత్నంగా మంత్రి పేర్ని నాని గారిని సంప్రదించాను. ఆయన ఆ ఊరి వివరాలు తెప్పించుకొని.. ‘బస్ నడిపిస్తాం’ అని షో లైవ్‌లోనే హామీ ఇచ్చారు. తర్వాత వాళ్ల ఊరికి వెళ్తే కలలో కూడా ఊహించని ఘన స్వాగతం లభించింది. పార్వతితోనే బస్ ప్రారంభించి.. అందులోనే ప్రయాణించాం. అదో గొప్ప అనుభూతి.
ప్రశ్న : త్వరలోనే ఓ కొత్త ప్రాజెక్టుకు చేపట్టనున్నట్లు ప్రకటించారు.. ఆ వివరాలు చెప్తారా?
– ఒక నేషనల్ డిజిటల్ మీడియా వేదికగా సామాజిక అంశాల కలబోతతో ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. దానికి నేను హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాను. అతి త్వరలోనే అది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కొన్ని పరిమితుల కారణంగా దాని గురించి పూర్తి వివరాలు చెప్పడం లేదు క్షమించాలి.
ప్రశ్న : మీ అభిమానుల కోసం కొత్త ఆల్బమ్స్ చేసే ఆలోచన ఏమైనా ఉందా?
– కచ్చితంగా ఉంది. నేనూ అదే ఆలోచిస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కూడా. కొన్ని కాన్సెప్ట్‌లు సిద్ధంగానే ఉన్నాయి. పాటలు, కంపోజింగ్ సిద్ధం చేసుకొని ఆల్బమ్స్ చేయడమే తరువాయి. ఆ విషయాన్ని ఇంకొద్ది రోజుల్లోనే అధికారికంగా వెల్లడిస్తాను. ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి.
ప్రశ్న : అవునా.. మాతో ఆ విషయాలు పూర్తిగా పంచుకోకపోయినా పర్లేదు.. కనీసం మీ అభిమానుల కోసమైనా హింట్ ఇవ్వండి!
– (బిగ్గరగా నవ్వుతూ) అయ్య బాబోయ్.. మీరు వదిలేలా లేరు. వాటిని ఇప్పుడే రివిల్ చెయ్యొద్దని అనుకుంటున్నా (నవ్వుతూ) మన్నించాలి. అభిమానుల కోసం అంటే.. (ఆలోచిస్తూ) ఇప్పుడు జీ సరిగమప షో చేస్తున్నాం కదా. నా దృష్టిలో ఇక్కడ పాడేవారంతా సూపర్‌స్టార్స్. కానీ ఒక్కరు మాత్రమే గెలుస్తారు. ఇక్కడ ఎలిమినేట్ ప్రక్రియ చాలా బాధగా ఉంటుంది. కానీ, తప్పదు. అయితే, ఎలిమినేట్ అయిన వారితో ప్రత్యేకంగా ఓ షో చేద్దామనే ఆలోచన ఉంది. వారికి ఏడాది పొడవునా అవకాశాలు ఇప్పించే వినూత్న కార్యక్రమం. అంతకు మించి ఇంకా చెప్పలేను ప్లీజ్. ఎందుకంటే వాళ్లు ఎలిమినేట్ అవుతుంటే.. నేనే బయటికి వెళ్తున్నంత బాధగా ఉంది. అందుకోసమే..!!
ప్రశ్న : ఊరికి బస్సులు రప్పిస్తున్నారు.. తాకట్టు పెట్టిన పట్టీలు విడిపిస్తున్నారు.. చీర, సారెలు పెడుతున్నారు.. సంగీత శిక్షణకు రిఫర్ చేస్తున్నారు.. ఎందుకు?
– ఏమోనండి.. వాళ్ల గాథలు వింటుంటే నా హృదయం అల్లాడిపోతున్నది. పార్వతి ఊరికి బస్సు వచ్చిన తర్వాత.. ఆ షోలో ఉన్నవారంతా నా కుటుంబం అనే ఫీలింగ్ వచ్చేసింది. రసూల్ భార్య పట్టీలు తాకట్టు పెట్టి భర్తను షోకు పంపింది. వారి ప్రేమగాథ విన్నతర్వాత మా టీమ్ ద్వారా ఆ పట్టీలు విడిపించి, షోలో అతని ద్వారానే ఆమెకు తొడిగించాం. కొందరికి చీరె, సారెలు పెట్టాం. సాయి శాన్విద్ ఫిమేల్ వాయిస్ సింగర్. అతను రామాచారి గారి దగ్గర సంగీతం నేర్చుకోవాలని అన్నాడు. అక్కడ చిన్నపిల్లలకే నేర్పుతారు. మేము మాట్లాడేసరికి కొన్ని నిబంధనలు సడలించి సంగీత శిక్షణ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. నా వంతుగా వారి కష్టాలు తీర్చడం మనసుకు తృప్తినిచ్చే విషయం (చెమ్మగిల్లిన హృదయంతో).
ప్రశ్న : సినిమాల్లో అడుగుపెడుతున్నారని తెలిసింది.. ఎంత వరకు నిజం?
– సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టే ఉద్దేశం ఇప్పుడే లేదు. భవిష్యత్‌లో అవకాశం వస్తే ఆలోచిస్తా. ఎందుకంటే నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. నా మనసుకు నచ్చితే వెనకాడను.
ప్రశ్న : చిన్నవయసులోనే బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఎలా ఉంది బిజినెస్? ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు?
– (నవ్వుతూ) అవును.. అప్పటికి నాకు 21 ఏండ్లే. ఆ వయసులోనే ‘బబుల్స్’ పేరిట సెలూన్ బిజినెస్‌లోకి అడుపెట్టాను. ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా బ్రాంచ్‌లు ఉన్నాయి. వాటి ద్వారా 400 మందికి పైగా ఉపాధి దొరుకుతున్నది. ఇంకా ఫుడ్, హ్యాండ్లూమ్స్, బ్యూటీ స్పా వంటి కొన్ని బిజినెస్‌లు ఉన్నాయి. మరో వారం రోజుల్లో ఇంకొక కొత్త బిజినెస్ ప్రారంభిస్తున్నాం. ఆ విశేషాలు కూడా త్వరలోనే పంచుకుంటా.
ప్రశ్న : మీది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా? వారి సపోర్ట్ ఎలా ఉంది?
-(నవ్వుతూ) మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్లకు కూడా ఇబ్బందేమీ పెట్టలేదు. అంతా సాఫీగా సాగిపోయింది. బావ (శశాంక్) తన వ్యాపారాలతో పాటుగా, నా బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటారు. నేను ప్లానింగ్ ఇస్తే.. ఆయన అమలు చేస్తుంటారు (నవ్వుతూ). ఇద్దరిమధ్య అవగాహనతో అలా ముందుకు వెళ్తుంటాం. ఏదైనా సమస్య వస్తే.. ట్రబుల్ షూటర్‌గా నన్నే పంపిస్తారు.
ప్రశ్న : కూతురు శివి అల్లరి, మీపై చూపించే ప్రేమ గురించి..?
– తను (శివి) నాకు మరో అమ్మ. నాపై తను చూపించే ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. కూతురు అనే కంటే నా తల్లి అనడం బెటర్. చైల్డ్ ఆర్టిస్టుగా మహానటి సినిమాలో మెప్పించింది. సంస్కృతంలో పద్యాలు చెబుతుంది. ఈ ట్రెండ్ పాడే పాటలన్నీ పాడుతుంది. నాకు నేర్పిస్తుంది. తనకు పియానో అంటే చాలా ఇష్టం. సంగీతం, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నది. ‘బహా కిలికి’ పాట పాడింది శివి.. దానికి 23 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ప్రశ్న : మీరు పాప్ సింగింగ్ వైపు వెళ్లడానికి ప్రధాన కారణం.. మీలో ఎవరైనా స్ఫూర్తి నింపారా?
– అప్పటి నాకు 16 ఏండ్లు. పాడుతా తియ్యగా పాడిన తర్వాత పాప్ సింగింగ్వైపు అమ్మా, నాన్న ప్రోత్సహించారు. ఆ తర్వాత హిందీలోనే ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ చేశా. దాన్ని తెలుగులోకి డబ్ చేశాం. ఆ తర్వాత అమ్మ పాత పాటల్ని రీమిక్స్ చేసి పాడమని సలహా ఇవ్వడంతో తెలుగులోని పాత పాటల్నీ సరికొత్తగా పాడాను. అవి నాకు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాయి. కొత్తగా ఇండస్ట్రీ వైపు రావాలనుకునే వారికి నేనిచ్చే సలహా.. ఏదైనా సాధించాలనుకుంటే దానిపై పట్టుదొరికే వరకూ వందశాతం కృషి చేయాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. ఇక నా ప్రయాణంలో తల్లిదండ్రులు, భర్త, కుటుంబం సపోర్ట్ మర్చిపోలేనిది. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వారి ప్రోత్సాహం.
ప్రశ్న : మీది ‘లక్కీ డిసెంబర్’ అంటుంటారు నిజమేనా?
– (నవ్వుతూ) నేను మొదలుపెట్టిన మేజర్ ప్రాజెక్టులన్నీ డిసెంబర్లోనే ఉన్నాయి. అవి పాటలైనా, ఆల్బమ్స్ అయినా, వ్యాపారాలైనా. అవి నా జీవితంలో మర్చిపోలేని మైలురాళ్లు. బబుల్స్ సెలూన్, మసక మసక చీకటిలో పాట, బహా కిలికి పాటలు డిసెంబర్లోనే వచ్చాయి. అవి బిగ్ హిట్ ఇచ్చాయి. నా కెరీర్ పరంగా డిసెంబర్ నా లక్కీమంత్ అనుకోవచ్చు.
ప్రశ్న : యాక్టర్ నాని, నరేశ్‌లు మీ ఫ్యామిలీతో చాలా క్లోజ్‌గా ఉంటారు.. మీ కుటుంబీకులా?
– వాళ్లిద్దరూ మా కుటుంబానికి చాలా దగ్గర. మొదట స్నేహితులమే. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ప్రతీది షేర్ చేసుకుంటాం. పండగలు కూడా కలిసే జరుపుకుంటాం. వాళ్ల పిల్లలు, మా పాప కూడా మాలాగే బెస్ట్ ఫ్రెండ్స్‌గా కలిసిపోయారు. బంధువులం అయ్యాము.
ప్రశ్న : కరోనా సమయంలో విస్తృత సేవ చేశారు.. ఎలా గడిచింది లాక్డౌన్?
– మొదటి లాక్డౌన్ అంతా సేవ చేయడంలోనే గడిచిపోయింది. ఆ సమయంలో దాదాపు 5వేల మందికి ప్రతిరోజూ భోజనాలు అందించాం. అప్పటి సీపీ సజ్జనార్ సార్, తెలంగాణ పోలీసుల సహకారంతో కొన్ని ఎన్జీఓలను సమన్వయం చేసుకుంటూ భోజనాలు అందించాం. ఒక్కోరోజు 50వేలకు పైగా భోజనాలు వండిన సందర్భాలూ ఉన్నాయి. ఆ సేవ గురించి చెప్పుకోవడం ఇప్పటికీ ఇష్టం లేదు ప్లీజ్..
ప్రశ్న : రాజకీయాల్లోకి వచ్చి.. అమ్మమ్మ, మాజీ ఎంపీ లక్ష్మికాంతమ్మ వారసత్వాన్ని కొనసాగిస్తారా?
– (దీర్గంగా ఆలోచిస్తూ…) కచ్చితంగా లేదే. తను రాజకీయాల్లోకి రావొద్దని ఎప్పుడో మమ్మల్ని హెచ్చరించారు. ఆవిడ మీద గౌరవంతో మా ఫ్యామిలీ మొత్తం రాజకీయాలకు దూరంగానే ఉన్నాం. ఎందుకంటే, అప్పటి రాజకీయాలు, ఇప్పటి రాజకీయాలు వేరు. కాంగ్రెస్‌లోనే ఉంటూ ఇందిరాగాంధీతో విభేదించిన ‘ఫైర్ బ్రాండ్’ మా అమ్మమ్మ. నాపై ఆమె ప్రభావం ఎక్కువ. ఆమె నుంచి నేను నేర్చుకున్నదేంటంటే.. ‘ఎవరో ఏదో అనుకుంటారని, ఏదో అవుతుందని భయపడకుండా మనం చేయాల్సిన పనిని మొదలు పెట్టడమే’. ఈ సూత్రాన్ని నేను ఇప్పటికీ పాటిస్తున్నాను. అందుకే, ఆమె భౌతికంగా లేకపోయినా, ఆత్మీయంగా నాతోనే ఉన్నట్లు ఫీలవుతుంటాను.
నాకు కొంచెం సమయం ఇవ్వండి..
నేను మళ్లీ సేవ చేస్తున్నానని తెలియగానే చాలామంది మెయిల్స్, కాల్స్ చేస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు పది వరకు మెయిల్స్ వస్తున్నాయి. నాకు అందరికీ సాయం చేయాలనే ఉద్దేశం ఉంది. అందుకోసం నా టీమ్ ప్రత్యక్షంగా కాల్స్ చేస్తూ వివరాలు తెలుసుకుంటున్నాం. సాయం అందేందుకు కొద్ది సమయం పట్టొచ్చు. ఒకే మెయిల్‌ను పదే పదే పంపుతున్నారు. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే, నాకు కుటుంబం, వ్యాపారం, ఇండస్ట్రీ కెరీర్ ఉన్నాయి. వాటిల్లో నేను బిజీగానే ఉన్నా.. వీలు చూసుకొని సాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటా. అందుకే నాకు కొంచెం సమయం ఇవ్వండి. మీరు కొంచెం ఓర్పుతో ఉండండి.
– డప్పు రవి