e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home ఆరోగ్యం కాలేయం కాపాడుకుందాం

కాలేయం కాపాడుకుందాం

మానవ శరీరంలో ఐదు వందలకు పైగా జీవక్రియల్లో పాల్గొనే ముఖ్య అవయవం.. కాలేయం! ఈ భాగాన్ని తీవ్ర ఇబ్బంది పెట్టే సమస్య హెపటైటిస్‌. ఇన్‌ఫెక్షన్లు, ఆల్కహాల్‌ వంటి దురలవాట్లు, జన్యుపరమైన లోపాలు, ఔషధాల దుష్ప్రభావాలు.. తదితర కారణాలతో హెపటైటిస్‌ సంక్రమించవచ్చు. తొలిదశలోనే గుర్తిస్తే ఇబ్బంది లేదు. ఆలస్యం అయినకొద్దీ ప్రమాదమే! ఏటా జూలై 28న ‘ప్రపంచ హెపటైటిస్‌ డే’ జరుపుకొంటాం.

ప్రాథమికంగా హెపటైటిస్‌ అన్నది వైరస్‌ వల్ల వచ్చే కాలేయ సంబంధ వ్యాధి. ఈ వైరస్‌లో ఏ,బీ,సీ,డీ,ఈ అనే ఐదు రకాలుఉన్నాయి. ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఏదో ఓ మార్గంలో మనిషి శరీరంలో ప్రవేశించి కాలేయాన్ని చేరుకొంటాయి. క్రమంగా ఆ భాగాన్ని శక్తిహీనం చేస్తాయి. హెపటైటిస్‌-ఎ, హెపటైటిస్‌-ఇ వైరస్‌లు కలుషిత నీరు, కలుషిత ఆహారం ద్వారా సంక్రమిస్తాయి. ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం, తలనొప్పి, నిస్సత్తువ ప్రధాన లక్షణాలు. ఆ తర్వాత, రెండుమూడు రోజుల్లో పచ్చ కామెర్లు బయటపడుతాయి. హెపటైటిస్‌ వైరస్‌వల్ల లివర్‌ కణజాలం దెబ్బతినటంతో సంభవించే పరిణామం ఇది. చాలా సందర్భాల్లో ఎల్‌ఎఫ్‌టీ వంటి రక్త పరీక్షలు, సీరలాజికల్‌ పరీక్షలతో వైరస్‌ను గుర్తించవచ్చు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ద్వారా రుగ్మత అదుపులోకి వస్తుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో హెపటైటిస్‌-ఎ, హెపటైటిస్‌-ఇ వైరస్‌ల కారణంగా కాలేయానికి తీవ్ర ఇబ్బందులు వస్తాయి. దీన్ని ‘ఫల్మనెంట్‌ హెపటైటిస్‌’ అని పిలుస్తారు. ఇటువంటి సందర్భాల్లో వెంటనే రోగిని ఆసుపత్రిలో చేర్చాలి. ఐసీయూ చికిత్స తప్పనిసరి కావచ్చు. రెండో రకం అయిన.. హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి మరింత ప్రమాదకరం. సాధారణంగా శరీర ద్రవాల ద్వారా (లాలాజలం, రక్తం వంటివి) ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. అదే విధంగా ఇన్‌ఫెక్టెడ్‌ సిరంజీలు, నీడిల్స్‌ వంటివాటితోనూ సంక్రమించే ఆస్కారం ఉన్నది. చాలా మందిలో వైరస్‌ వ్యాపించిన తర్వాత కూడా, ఎటువంటి రోగ లక్షణాలూ బయటపడక పోవచ్చు. కొందరిని మాత్రం తీవ్రమైన కడుపు నొప్పి, పచ్చ కామెర్లు వెంటాడుతాయి. అయితే, ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేకపోయినా హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి ఇన్‌ఫెక్షన్లు ఒక్కసారి మొదలైతే మాత్రం.. లివర్‌లోని కణజాలాన్ని క్రమంగా శిథిల పరుస్తాయి. ఫలితంగా కాలేయం పనితీరు దెబ్బతింటుంది. ఇది క్రమంగా లివర్‌ సిర్రోసిస్‌ (అంటే, లివర్‌లోని కొంత కణజాలం నిర్జీవ స్థితికి చేరిపోవడం)కు దారి తీస్తుంది. ఈ పరిస్థితిలో బరువు తగ్గటం, పచ్చ కామెర్లు, కడుపులో నీరు చేరటం, రక్తపు వాంతులు తదితర విపరీత లక్షణాలు కనిపిస్తాయి. డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ రక్త పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. లివర్‌ లోపాలవల్ల కలిగే ఇబ్బందిని గుర్తించేందుకు అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌, సీటీ స్కాన్‌ అవసరం అవుతాయి. ఈ వైరస్‌లను సకాలంలో గుర్తిస్తే మందులతోనే నియంత్రించవచ్చు. ఇతర అనర్థాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

- Advertisement -

లివర్‌ క్యాన్సర్‌?
హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఉత్పన్నం అయ్యే మరో ప్రమాదకర పరిస్థితి.. లివర్‌ క్యాన్సర్‌. అంటే, లివర్‌లో అవాంఛిత కణజాలం పేరుకుపోయి కణితులుగా మారతాయి. సాధారణ కాలేయ క్యాన్సర్‌ను ‘హెపటో సెల్యులార్‌ క్యాన్సర్‌’ అంటారు. దీర్ఘకాలికంగా ఆల్కహాల్‌ తీసుకొనే వారిలో ఇది ఏర్పడుతుంది. హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌-సి ఇన్‌ఫెక్షన్‌తోనూ రావచ్చు. కడుపు పై భాగంలో నొప్పితో పాటు బరువు తగ్గటం వంటి లక్షణాలను ఈ రోగుల్లో గమనించవచ్చు. పసిరికలు, నీళ్ల విరేచనాలు ఇబ్బంది పెడతాయి. ప్రాథమికంగా రక్త పరీక్ష (ఎఎఫ్‌మా), అల్ట్రా సౌండ్‌ పరీక్షలతో తీవ్రతను గుర్తించవచ్చు. అవసరాన్ని బట్టి సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ, బయాప్సీ చేయించాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే కనుక.. క్యాన్సర్‌ సోకిన కణజాలాన్ని ఆపరేషన్‌ ద్వారా మొత్తంగా తొలగించవచ్చు. ఆపరేషన్‌ చేయలేని పరిస్థితులు ఉంటే.. రోగి శస్త్రచికిత్స తీవ్రతను తట్టుకోలేకపోతే.. టేస్‌, అబ్లేషన్‌ విధానాలు అవలంబించాల్సి ఉంటుంది. వీటిలో మైక్రోవేవ్‌ అబ్లేషన్‌ అన్నది చాలా మెరుగైన చికిత్స. సమస్య తీవ్రతను బట్టి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాల్సి వస్తుంది.

అవగాహనముఖ్యం
ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు, నిర్లక్ష్యం చేయకుండా ఆధునిక టెక్నాలజీ, నిపుణులైన వైద్య బృందం అందుబాటులో ఉన్న దవాఖానలను సంప్రదించటం మేలు. ప్రస్తుత పరిస్థితులలో ఎంత త్వరగా సమస్యను గుర్తిస్తే ,అంత త్వరగా చికిత్సలు ప్రారంభం అవుతాయి. హెపటైటిస్‌ మహమ్మారిని తరిమికొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. వ్యక్తిగత శుభ్రతను పాటించటం, కలుషిత నీటికి, కలుషిత ఆహారానికి దూరంగా ఉండటం ఉత్తమ మార్గాలు. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. వీటి నుంచి రక్షణ పొందేందుకు టీకాలూ లభిస్తున్నాయి. హెపటైటిస్‌ పట్ల అవగాహన, అప్రమత్తత ఉంటే.. సమస్యకు సగం పరిష్కారం లభించినట్లే.

డాక్టర్‌ ఆర్‌ వి రాఘవేంద్రరావు
సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌
రెనోవా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్‌, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana