అటవీ పరిసరాల్లోనే కాదు.. పల్లెలు, పట్టణాల్లోనూ పాముల బెడద పెరుగుతున్నది. పాముకాటు బాధితులూ పెరుగుతున్నారు. ముఖ్యంగా, వ్యవసాయ పొలాలతోపాటు ఇంటి పెరటి తోటల్లోనూ విషసర్పాలు దర్శనమిస్తుంటాయి. వీటివల్ల భయంతోపాటు ప్రాణాపాయం కూడా ఉంటుంది. అందుకే, తోటల్లో కొన్ని మొక్కలు పెంచడం వల్ల.. సహజసిద్ధమైన పద్ధతులతో పాములను దూరంగా పెట్టొచ్చు. ఆ మొక్కలు ఏంటంటే..
సర్పగంధ : మన దగ్గర అత్యంత ప్రాచుర్యం పొందిన మొక్క. దీని వేర్ల నుంచి వచ్చే ఘాటైన వాసనలు.. పాములను దూరం తరిమేస్తాయి. అందుకే, అటవీ పరిసర ప్రాంతాల్లోని చాలామంది వారి తోటల చుట్టూ రక్షణగా ఈ సర్పగంధ మొక్కలను పెంచుతుంటారు.
లెమన్ గ్రాస్ : పాములను భయపెట్టే మరో గడ్డి మొక్క.. లెమన్ గ్రాస్. దీనినుంచి వచ్చే బలమైన నిమ్మ వాసనలు పాములకు పడదు. ఈ మొక్కల్లో ఉండే ‘సిట్రోనెల్లా’ అనే పదార్థం.. పాములతోపాటు దోమలను, ఇతర కీటకాలను కూడా దూరం కొడుతుంది.
బంతి మొక్కలు : బంతి మొక్కల వేర్లు మట్టిలోకి ఒక రకమైన ఘాటైన వాసనను విడుదల చేస్తాయి. ఈ వాసన పాములతోపాటు నేల లోపల ఉండే ఎలుకలు, కప్పలకూ పడదు. తమకు ఆహారమైన ఎలుకలు, కప్పలు రాకపోతే.. పాములు కూడా రావడం తగ్గుతుంది.
వెల్లుల్లి: ఉల్లి, వెల్లుల్లి మొక్కల నుంచి ఘాటైన సల్ఫర్ వాసన వస్తుంది. అది పాములకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే, పాములు వెల్లుల్లి మొక్కల దగ్గరికి రావడానికి ఇష్టపడవు. కొన్నిచోట్ల పాములను పారద్రోలడానికి వెల్లుల్లి రెబ్బలను నూరి, నీళ్లలో కలిపి పెరటి తోటల్లో చల్లుతుంటారు కూడా.