పెంపుడు కుక్కలను ప్రాణంగా చూసుకుంటాం. సమయానికి టీకాలు వేయిస్తాం. మంచి ఆహారం పెడతాం. కానీ, మార్కెట్లో నాణ్యత కరువవుతున్నది. ప్రతి వస్తువూ రసాయనమయమే. దానికితోడు కల్తీ ఒకటి. ఆ బాధలన్నీ అనుభవించాకే, ఓ జంతు ప్రేమికురాలిగా ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టింది రాశి నారంగ్.
‘జంతువుల పట్ల మీ ప్రేమ ఎంత స్వచ్ఛమో, జంతువుల కోసం మేం తయారుచేసే వస్తువులూ అంతే స్వచ్ఛం’ అంటున్నది రాశి నారంగ్. ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్’ అనేది మూగజీవాల కోసం పోషకాహారాన్ని సరఫరా చేసే సంస్థ. మొదట ఆన్లైన్ స్టోర్‌గా ప్రారంభమైనా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాభైకిపైగా అవుట్‌లెట్స్ ఉన్నాయి. రాశి చిన్నతనమంతా పెంపుడు జంతువుల మధ్యే గడిచింది. గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ కోసం లండన్ వెళ్లింది. తిరిగొచ్చాక, జీవితం వెలితిగా అనిపించింది. తోడుకోసం ఒక కుక్కపిల్లను తెచ్చుకుంది. సారా అని పేరు పెట్టుకుంది. మార్కెట్లో లభించే ‘పెట్ ఫుడ్’లో నాణ్యత లేదని అప్పుడే అర్థమైంది. అన్నిటిలోనూ రసాయనాలే. దీంతో తనే నాణ్యతతో తయారు చేయాలనుకుంది.
‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’లో పెట్ ఫుడ్, కాలర్స్, క్లాతింగ్, ఫర్నిచర్, గ్రూమింగ్ కిట్స్.. మొదలైనవన్నీ లభిస్తాయి. ఆఫ్లైన్కూ విస్తరించాలనే ఆలోచనతో న్యూఢిల్లీలోని సెలెక్ట్ సిటీలో ఒక షాప్ పెట్టింది. మొదట్లో దుకాణానికి ఓ గదిని అద్దెకు ఇవ్వడానికి కూడా చాలామంది సందేహించారు.
‘ఈ బిజినెస్‌ను నా సేవింగ్స్‌తో మొదలు పెట్టాను. పెంపుడు జంతువుల ఆహారంలో నాణ్యత లోపాలను వివరిస్తూ పెట్స్ యజమానులకు అవగాహన కల్పించాను. ప్రస్తుతం పన్నెండు నగరాల్లో స్టోర్స్ ఉన్నాయి. దాదాపు 30 పెట్ స్పాలు ఏర్పాటుచేశాం’ అని వివరిస్తుంది రాశి. ‘మహిళా ఆంత్రప్రెన్యూర్లకు ప్రోత్సాహం అందించేందుకు మార్కెట్ సిద్ధంగా ఉందనీ, భయపడకుండా ముందడుగు వేయాల్సింది మనమే’ అంటుంది రాశి నారంగ్.