ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చాలామంది స్మార్ట్ఫోనే ప్రపంచంగా బతికేస్తున్నారు. ఉదయం లేవగానే.. ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటున్నారు. మంచం మీదినుంచే.. సోషల్ మీడియా మెసేజ్‌లు, తాజా వార్తలను తనిఖీ చేస్తున్నారు. అయితే, ఈ అలవాటు మెదడు పనితీరుపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరో సైంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే ఫోన్లో తలదూర్చడం వల్ల.. ఆలోచనా విధానం, సృజనాత్మక సామర్థ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఉదయం మేల్కొన్న తర్వాతి మొదటి 15-20 నిమిషాలు మెదడుకు చాలా ముఖ్యమైన సమయం.
అప్పుడే మెదడు ‘పీక్ న్యూరోప్లాస్టిక్ మోడ్’లోకి ప్రవేశిస్తుంది. అంటే.. ఏదైనా నేర్చుకోవడానికి, మార్పులను స్వీకరించడానికి మెదడుకు ఉండే సామర్థ్యం. రాత్రంతా నిద్రలో ఉండి.. ఉదయాన్నే మేల్కొన్నప్పుడు ఈ సామర్థ్యం అత్యధిక స్థాయిలో ఉంటుందట. కాబట్టి, ఏదైనా ప్రేరణ కలగడానికి, దృష్టిని మెరుగుపరుచుకోవడానికి, లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, సృజనాత్మకంగా ఉండటానికి.. మెదడుకు ఇదే సరైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, ఆ సమయంలో ఫోన్‌తో గడపడం వల్ల.. మెదడు సృజనాత్మక ఆలోచనలపై ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు.
అంతేకాకుండా.. ఉదయాన్నే ఏదైనా ఇబ్బందికర సమాచారం, వార్తల గురించి విన్నప్పుడు మెదడు ‘హై అలర్ట్’ మోడ్‌లోకి వెళ్తుందట. మంచం మీదినుంచి లేవడానికి ముందే.. మెదడులో ఆందోళన, ఒత్తిడి పెరుగుతుందట. దీనిని నివారించడానికి ‘20 నిమిషాల ట్రిక్’ను అనుసరించాలని చెబుతున్నారు. నిద్ర లేచిన వెంటనే కాకుండా ఫోన్‌ను చూడటాన్ని 20 నిమిషాలు ఆలస్యం చేయాలని చెబుతున్నారు. మొదటి 20 నిమిషాలు ప్రశాంతంగా, సానుకూలంగా ఏదో ఒక పనిచేయాలని సూచిస్తున్నారు. చిన్నపాటి ఎక్సర్సైజ్లు చేయడం, రోజువారీ చేయాల్సిన పనుల లిస్ట్‌ను తయారు చేసుకోవడం, ప్రధాన లక్ష్యాల గురించి ఆలోచించడం చేయాలని అంటున్నారు. ఈ చిన్న మార్పు.. మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుందనీ, ఏకాగ్రత, సంతోషం పెరుగుతాయనీ చెబుతున్నారు.