PCOS | పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్).. ఇది హార్మోన్లకు సంబంధించిన ఓ వ్యాధి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి.. ఆడవాళ్లను ఈ వ్యాధిబారిన పడేస్తున్నది. అండాశయాల పనితీరుకు అంతరాయం కలిగిస్తూ.. వారిలో పునరుత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం నుంచి 13శాతం మంది మహిళలను పీసీఓఎస్ ప్రభావితం చేస్తున్నది. ఇది మహిళల్లో వంధ్యత్వానికి దారి తీస్తున్నది. వారి సాధారణ జీవక్రియలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నది. ఇటీవలి కాలంలో యుక్త వయసులోనే పీసీఓఎస్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే.. వంధ్యత్వం, టైప్ 2 మధుమేహంతోపాటు హృదయ సంబంధ సమస్యలకూ దారి తీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. ముఖ్యంగా యువతుల్లో పీసీఓఎస్‌ను ముందుగానే గుర్తించడం ద్వారా.. దాని తీవ్రమైన దుష్ప్రభావాలను నివారించడంతోపాటు భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చని చెబుతున్నది.
నెలసరి సమస్యలు : పీసీఓఎస్ ఉన్నట్టు సూచించే సాధారణ సంకేతాలలో ఒకటి.. క్రమరహిత నెలసరి. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. పీరియడ్స్ మధ్య వ్యత్యాసం తగ్గుతుంది లేదా పెరుగుతుంది. రక్తస్రావం ఎక్కువగా కావడం కూడా పీసీఓఎస్ లక్షణమే!
అవాంఛిత రోమాలు : పీసీఓఎస్ సమస్య ఉన్నవారి శరీరంలో ఆండ్రోజెన్ స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా వారి ముఖంపై అవాంఛిత రోమాలు అధికం అవుతాయి.
మొటిమలు : హార్మోన్ల అసమతుల్యత.. మొటిమల సమస్యను కలిగిస్తుంది. దీని ఫలితంగా ముఖం, ఛాతీ పైభాగంలో మొటిమలు ఎక్కువగా కనిపిస్తాయి.
బరువు : పీసీఓఎస్ ఉన్న మహిళలు.. పొత్తికడుపు చుట్టూ బరువు పెరుగుతారు. తిండి ఎంత కంట్రోల్ చేసినా.. బరువు తగ్గడం మాత్రం వారికి సవాల్‌గానే మారుతుంది.
చర్మం నల్లబడటం : చర్మ ఆరోగ్యంపైనా పీసీఓఎస్ ప్రభావం చూపుతుంది. ఈ సమస్యతో బాధపడే మహిళల్లో మెడ, గజ్జలు ఇతర ప్రాంతాల్లో చర్మం నల్లగా మారుతుంది. కొందరిలో తల వెంట్రుకలు కూడా రాలిపోతాయి.
పీసీఓఎస్ సమస్యను ముందుగా గుర్తించడం.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. వంధ్యత్వాన్ని నివారించడంతోపాటు మధుమేహ సమస్యలు, గుండె జబ్బుల ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు. ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఊబకాయ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఫలితంగా.. మానసిక ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చు.