50 ఏండ్ల వయసులో వ్యాపారం ప్రారంభించిన ఆమె, అరవయ్యో పడిలోకి వచ్చే సరికి భారతదేశంలో స్వయంకృషితో కోటీశ్వరురాలు అయినవారి జాబితాలో చేరిపోయింది. ఫ్యాషన్ అంటేనే యూత్, టీనేజర్ల రాజ్యం అనుకుంటాం. అలాంటిది మధ్య వయసులో ఫ్యాషన్ ప్రపంచాన్ని స్థాపించిందామె. అంతేకాదు, భారతదేశంలోనే యూనికార్న్ సంస్థను స్థాపించిన తొట్టతొలి మహిళగా ఘనతకెక్కింది. ఆమెనే నైకా అధినాయిక ఫల్గుణి నాయర్. ఇటీవల హురూన్ ఇండియా, ఐడీఎఫ్సీ సంయుక్తంగా ప్రకటించిన 200 మంది సెల్ఫ్‌మేడ్ ఆంత్రప్రెన్యూర్ల జాబితాలో టాప్ 10లో నిలిచి మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె స్థాపించిన కంపెనీ నైకా విలువ రూ.56,600 కోట్లు.
సొంతంగా వ్యాపారం చేయడం అన్నది ఎంతో మంది కల. ఆకర్షణీయంగా కనిపించే లాభాలు ఒక ఎత్తయితే, సొంత కాళ్ల మీద నిలబడగలిగి మరికొందరి జీవితాలకూ ఆలంబన కాగలమన్న ఆశ మరోవైపు ఉంటుందిక్కడ. అలాగని కాలేజీ నుంచి అడుగు బయట పెడుతూనే సీఈఓ సీట్లో కూర్చోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. చదువైన నాలుగేండ్లలోనే అటో ఇటో తేలిపోవాలి అనుకుంటే అయ్యే పనీ కాదు.
పరిస్థితులను బట్టి ముందుకు వెళుతూ, మన లక్ష్యాలకు బాటలు వేసుకుంటే వయసుతో, చేసే పనితో సంబంధం లేకుండానే సరికొత్త ఆంత్రప్రెన్యూర్లుగా మారొచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఫల్గుణి నాయర్. పాతికేండ్లకు పైగా వివిధ స్థాయుల్లో ఉద్యోగ జీవితాన్ని గడిపిందామె. ఆ తర్వాతే నైకా అనే సౌందర్యోత్పత్తుల సంస్థను స్థాపించింది. పేరున్న రకరకాల కాస్మెటిక్స్ అన్నీ ఒకే చోట దొరికితే బాగుంటుంది అన్న ఆలోచనే నైకా స్థాపనకు దారి తీసింది. నైకాకు నేడు దేశవ్యాప్తంగా 200లకు పైగా స్టోర్లున్నాయి. ఒక చిన్న షాప్‌గా మొదలైన ఈ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఎన్నో ఒడుదొడుకులతో సాగిన ఈ ప్రయాణం ఆమెను సొంత కాళ్ల మీద నిలబడ్డ కోటీశ్వరుల (బిలియనీర్ల) జాబితాలోకి చేర్చింది.
అప్పట్లో.. ఏ పని చేసినా అందులో అత్యుత్తమంగా నిలవాలన్న తపన ఫల్గుణి నాయర్లో కనిపిస్తుంది. అది ఉద్యోగమైనా వ్యాపారమైనా. మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పని చేసినా, కొటాక్ మహీంద్రా క్యాపిటల్ (బ్యాంకు) మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించినా ఆమెది అదే ైస్టెల్. ఫల్గుణిది గుజరాతీ వ్యాపార కుటుంబం. ముంబయిలో పుట్టి పెరిగింది. అక్కడి సిండెన్హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనమిక్స్ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ నుంచి మాస్టర్స్ పూర్తిచేసింది. తర్వాత ఒక పేరున్న అకౌంటింగ్ సంస్థలో కన్సల్టెంట్‌గా చేరింది. కొన్నాళ్లు పనిచేశాక మహీంద్రా గ్రూప్‌లో వ్యాపార విస్తరణ విభాగాధిపతిగా చేరింది.
లండన్, న్యూయార్క్ నగరాల్లోనూ వివిధ హోదాల్లో పనిచేసి సంస్థ అభివృద్ధిలో భాగమైంది. ఆ తర్వాత భారత్‌కి వచ్చాక మహీంద్రా క్యాపిటల్‌కు (ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్) మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టింది. 18 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాక, సొంతంగా ఒక సంస్థను ప్రారంభించాలనుకుందామె. తాను నిత్య జీవితంలో వాడే రకరకాల సౌందర్య ఉత్పత్తులు భారత్‌లో సరిగ్గా దొరక్కపోవడం, ముంబయిలాంటి మహా నగరాల్లోనూ అవి ఒకే చోట లభ్యం కాకపోవడంతో… అలాంటి వాటిని ఒకచోట అందించేలా ఓ కంపెనీ ప్రారంభించాలన్న ఆలోచన చేసింది. అలా 2012లో పుట్టిందే నైకా సంస్థ.
నైకాను ప్రారంభించేటప్పటికి ఫల్గుణిది అయిదు పదుల వయసు. అప్పటిదాకా తాను సంపాదించుకున్న వాటితోపాటు బయటి నుంచి కొంత జోడించి సుమారు రూ.14 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సంస్థను ప్రారంభించింది. ఫల్గుణి తండ్రి ఒక బేరింగ్స్ కంపెనీని నడిపేవారు. తొలుత ఆయన దగ్గరున్న ముగ్గురు ఉద్యోగులను నియమించుకుని, ఆయన ఆఫీసులోనే ఓ ఏరియాలో సౌందర్య ఉత్పత్తుల సంస్థను ప్రారంభించింది. లగ్జరీ బ్రాండ్లకు ఉన్న గిరాకీని అర్థం చేసుకుని తొలిసారి ఆన్లైన్లో లగ్జరీ కాస్మెటిక్స్‌ని అందుబాటులో ఉంచింది. సౌందర్య సాధనాలు, ఆరోగ్య ఉత్పత్తులు, ఫ్యాషన్ వస్తువులు… ఉండేలా చూసుకుంది. తొలుత రోజుకు అరవై ఆర్డర్లు వచ్చేవి. తర్వాత ఆఫ్‌లైన్ సర్వీసునూ మొదలుపెట్టింది. అలా ప్రారంభించిన 18 నెలల్లోనే అది ఇలాంటి ఉత్పత్తులు అమ్మే నెంబర్ 1 బ్రాండ్‌గా ఎదిగింది.
దశాబ్దకాలంలోనే ఆమె ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఆన్లైన్లో అమ్మకాలు జరుపుతూనే బయట దేశవ్యాప్తంగా బ్రాండ్ స్టోర్లనూ తెరిచింది నాయర్. అయితే కొవిడ్ సమయంలో భారీ నష్టాలను చవిచూసినా వెనకడుగు వేయలేదామె. ఉద్యోగులను తొలగించే చర్యలకు పోకుండా, మార్కెటింగ్ వ్యయాన్ని బాగా తగ్గించి సంస్థను నిలబడేలా చేసింది. ప్రస్తుతం నైకా సంస్థ 500 బ్రాండ్లకు సంబంధించిన వస్తువులను అమ్ముతున్నది. నెలకు 50 లక్షల మందికి పైగా యూజర్లున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ రంగంలో నైకా అంటే తెలియని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదు. అసలైన స్త్రీశక్తికి నిలువెత్తు నిదర్శనం కదూ ఈ నైకా అధినాయిక!