అనగనగా ఓ రాకుమారి. సామాన్యుడిని ప్రేమిస్తుంది. అతని కోసం ఏండ్ల తరబడి ఎదురు చూస్తుంది. ఆమె రూపం ఎంత అపురూపమో, మనసూ అంతే సున్నితం. ‘సీతారామం’లో సీత పాత్రలో పరిపూర్ణంగా ఒదిగిపోయింది మృణాల్ ఠాకూర్. అందంలో, అణకువలో అలనాటి తారలను తలపిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న మృణాల్తో మాటా ముచ్చట..
సీత పాత్రలోంచి బయటికి వచ్చేశారా?
నన్ను వ్యక్తిగా, నటిగా అపారంగా ప్రభావితం చేసిన పాత్ర అది. అంత తొందరగా బయటికి వస్తానా? అలాంటి పాత్రలు దశాబ్దానికి ఒకసారి మాత్రమే వస్తుంటాయి. పాత్ర కల్పితం అయితేనేం.. సీత వ్యక్తిత్వం గొప్పది. అరవై ఏండ్ల క్రితం అంత కఠిన నిర్ణయాలు తీసుకోవడం, వాటికి కట్టుబడి ఉండటం సాహసమే. నిజంగా మనకోసం మనం
నిలబడటం అన్నది చాలా గొప్ప విషయం. ఆ మనోబలం ప్రతి మహిళకూ ఉండాలి. ఈ ప్రాజెక్ట్‌లో నాకు హను రాఘవపూడి, దుల్కర్ సల్మాన్, సుమంత్, గౌతమ్ వంటి ప్రతిభావంతులతో పనిచేసే అదృష్టం దక్కింది. సినిమాలో ప్రతీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా కనిపిస్తుంది.
మీరు ఎంచుకున్న చిత్రాలను పరిశీలిస్తే.. సంప్రదాయ సౌందర్యం పుష్కలంగా కనిపిస్తుంది. ఇదంతా భారతీయత పట్ల ప్రేమ అనుకోవాలా?
అవును. నేను సంప్రదాయాన్ని గౌరవిస్తాను. భారతీయత అంటే ఇష్టం. మధుబాల, శ్రీదేవి వెండితెర మీద వెలిగిపోతున్న కాలంలో నన్ను పుట్టించనందుకు దేవుడికి కృతజ్ఞతలు. అంత గొప్ప నాయికలతో పోటీపడలేను కదా! వాళ్లు కాలాతీత వ్యక్తులు, భారతీయ సౌందర్యానికి ప్రతిబింబాలు. ఆ బాటలో నడిచే అవకాశం నాకు వచ్చింది. సంప్రదాయ అలంకరణలో క్లాసిక్స్‌లోని కథానాయికలా రొమాంటిక్‌గా కనిపించానని చాలామంది ప్రశంసించారు.
సీతారామం నేర్పించిన పాఠాలేమిటి?
హను రాఘవపూడి చాలా ఉత్సాహంగా షూటింగ్‌కు వచ్చేవారు. ఏదో సన్నివేశం గురించి తెలుగులో చెప్పేవారు. నాకేమో అర్థమయ్యేది కాదు. ‘సార్! ప్లీజ్ ట్రాన్స్‌లేట్ చేసి చెప్పండి’ అనేదాన్ని (నవ్వుతూ). షూటింగ్ ముగిసేసరికి కాస్త తెలుగు నేర్చుకున్నాను. హను సార్ హిందీలో పర్ఫెక్ట్ అయ్యారు. దుల్కర్‌కు బాలీవుడ్లో మంచి పేరు ఉంది. తెలుగు ప్రేక్షకులను ఇంతగా ప్రభావితం చేశాడని మాత్రం ఇప్పుడే తెలిసింది. మంచి స్క్రిప్ట్‌ను ఎంచుకోవడంలో దుల్కర్‌కు పట్టుంది. పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారిపోవాలో తనను చూసే నేర్చుకున్నాను. ఎమోషనల్‌గా పరిణతి చెందాను. ఫ్లెక్సిబుల్‌గా ఉండటమూ అలవాటైంది.
టాలీవుడ్లో మీ స్థానం?
ఏమో నాకు తెలియదు. కెరీర్లో అగ్రస్థానంలో ఉన్నానని మాత్రం చెప్పగలను. ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ ఎవరూ లేకపోయినా ఇక్కడిదాకా రాగలిగాను. తెలుగు ఇండస్ట్రీలో నా టాలెంట్ నిరూపించుకునేందుకు ‘సీతారామం’ మంచి అవకాశం ఇచ్చింది. నన్ను అభిమానించే వాళ్ల మద్దతుతోనే ఇదంతా సాధ్యమైందని నమ్ముతున్నా.
ఇండస్ట్రీలో మీకు పెద్ద అండ ఎవరు?
అశ్వినీదత్ సార్ అనే చెప్పాలి. 70కి పైగా చిత్రాలు రూపొందించినా.. ఇప్పటికీ సినిమాపై ఆయనకు మక్కువ తగ్గలేదు. నన్ను సొంత కూతురిలా చూసుకుంటారు. పాతతరం కళాకారుల గురించి చెబుతుంటారు. ఒక నటిగా నేను ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగలను. కానీ ఏ పాత్రకు ఓకే చెప్పాలి? ఎలాంటి కథలు ఎంచుకోవాలి? తదితర నిర్ణయాల విషయంలో అశ్వినీదత్ గారి సలహా అడుగుతుంటాను.
నటిగా మీ ఎదుగుదల గురించి?
ప్రతి నిత్యం ఓ పాఠం నేర్చుకుంటా. అన్ని రోజులూ టాప్ పొజిషనే ఉండదు. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు చాలామంది డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. ఆ పరిస్థితి రాకుండా నేను జాగ్రత్తపడతాను. ఉదాహరణకు సీతారామం చిత్రాన్నే తీసుకుందాం. నేను ఫ్రేమ్‌లోకి ప్రవేశించిన ప్రతీసారి ఇతర విషయాల గురించి పూర్తిగా మర్చిపోయే దాన్ని. ఆ క్షణంలో కెమెరా ఒక్కటే నా ప్రపంచం.