ఓ డెబ్బయ్ ఏండ్ల క్రితం.. సినిమా అంటే, కథ సంసారపక్షంగా ఉండాలి.. కథనం సాగదీతగా ఉన్నా.. పద్ధతిగా సాగాలి.. ఏ కొంచెం తేడాగా ఉన్నా.. జనాలు ‘ఛీ’ కొట్టడం ఖాయం. అలాంటి రోజుల్లో.. లివింగ్ రిలేషన్షిప్ బాపతు కథను సిద్ధం చేసుకున్నారు దర్శక, నిర్మాతలు. పాత్రలు ఎంత మర్యాదగా నడుచుకున్నా.. ఎంతటి ఔన్నత్యాన్ని ప్రదర్శించినా.. ‘మిస్సమ్మ’ ఆ కాలానికి, ఆ మాటకొస్తే.. ఆ తర్వాత ఐదు దశాబ్దాల వరకూ.. సాహసమే! ఆ ప్రయోగాత్మక చిత్రం ‘మిస్సమ్మ’ 1955 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. అఖండ విజయాన్ని అందుకుంది. తెలుగు చిత్రసీమ అపురూప చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. 70 వసంతాలు పూర్తి చేసుకున్న ‘మిస్సమ్మ’ ముచ్చట్లు ఇవి..
Missamma | ఎంటీ రావు తెలివైనవాడు. మిస్ మేరీ అందగత్తె, అభిమానవతి. ఓ అనివార్యత ఈ ఇద్దరినీ ఒక్కటి చేస్తుంది. ‘ఉదర నిమిత్తం’ రావు రంగం సిద్ధం చేస్తే.. అప్పు ముప్పు తప్పించుకోవడానికి మేరీ సాహసం చేస్తుంది.. సొంత భార్యాభర్తలు కూడా చనువుగా మాట్లాడుకోవడానికి మొహమాటపడే రోజులవి. ఆ కాలంలో ముఖ పరిచయం మాత్రమే ఉన్న ఆడ-మగ… ఆలుమగలుగా నటించాలని నిర్ణయానికి రావడం అప్పటి సమాజానికి ఆశ్చర్యమే! అదేమోగానీ ఆ ఇద్దరి బంధాన్నీ యాక్సెప్ట్ చేశారు ప్రేక్షకులు. మేరీ బెట్టు చేస్తే.. ముసిముసిగా నవ్వుతూ మురిసిపోయారు. ఆమెను రావు బతిమాలుతుంటే.. అతని వంక జాలిగా చూశారు. ఆమె పేచీ పడినా నవ్వుకున్నారు. ఆల్రెడీ ప్రేమలో పడిందిలే అని తీర్మానించుకున్నారు.
పెండ్లవ్వని ‘రావు-మేరీ’ జంట పాత్రలకు వంతపాడేందుకు విజయవారి కాంపౌండ్‌లో నటులకు కొదువా?! అందుకే ఘనాపాఠీలనే రంగంలోకి దించారు నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి. అప్పాపురం జమీందారు గోపాలం పాత్రకు ఎస్వీఆర్, అతని భార్య పాత్రలో రుష్యేంద్రమణి కుదురుకున్నారు. వారి గారాలపట్టి సీతగా జమున వచ్చింది. మొండిఘటం దేవయ్యగా రేలంగి, మేరీ మీద మనసుపడిన ఇంటి ఓనర్ డేవిడ్‌గా రమణారెడ్డి.. ఇలా జట్టంతా అదిరింది. దర్శకుడు ఎల్వీ ప్రసాద్ ఓకే అన్నాడు. నిర్మాతలు ఫుల్ ఖుషీ.
చిత్రంలో మరో ప్రధాన పాత్ర గురించి చాలారోజులు అన్వేషణ సాగింది. ‘మిస్సమ్మ’ గుట్టు విప్పే డిటెక్టివ్ పాత్ర అది. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉండాలి. తికమకగా కనిపించాలి. చురుకుగా స్పందించాలి. మరదలిపై పొంగుకొచ్చే ప్రేమను పైకి కనిపించనివ్వకూడదు. ఆ మరదలు చనువుగా ఉంటున్న రావుపై మండిపడకూడదు. పంతులమ్మ ఉరఫ్ మేరీ చొరవగా మాట్లాడితే అయిష్టంగానే స్పందించాలి. ఇన్ని పార్శాలున్న పాత్రకు ఎవరు అతికినట్టు సరిపోతారు? జగ్గయ్యను అనుకున్నారు. ఎందుకో కుదర్లేదు. మరెవరినో అనుకుంటున్నారు. విషయం ఏయన్నార్ చెవిలో పడింది. దేవదాసు తర్వాత అక్కినేనికి అన్నీ సీరియస్ కథలే వస్తున్నాయి. ‘మిస్సమ్మ’లో డిటెక్టివ్ రాజు పాత్ర తన కెరీర్‌కు కొత్తదారి చూపిస్తుందని భావించాడు ఏయన్నార్. అదే కారణం చెప్పి నిర్మాతలను కన్విన్స్ చేశాడు. ‘అంతకంటేనా’ అని వాళ్లు ఆమోదించారు. అలా అక్కినేని తెలుగు వెండితెర తొలి డిటెక్టివ్ అయ్యాడు!
మిస్సమ్మ క్యారెక్టర్‌తో సావిత్రికి ఎంత స్టార్డమ్ వచ్చిందో… ఏకే రాజు పాత్రతో ఏయన్నార్కూ అంతే పేరు దక్కింది. దీనికితోడు చక్రపాణి స్క్రిప్ట్ భలేగా పనిచేసింది. ఫుల్‌లెంగ్త్ కామెడీ సినిమాలో ఒక్కరూ తగ్గితే ఒట్టు. అప్పాపురానికి వచ్చిన పంతులు జంటతో రాజు ‘ఐ యామ్ మిస్టర్ ఏకే రాజు ప్రైవేట్ డిటెక్టివ్, ఎక్స్ హెడ్మాస్టర్ అండ్ ప్రజెంట్ సెక్రటరీ ఆఫ్ మహాలక్ష్మి ఎలిమెంటరీ స్కూల్, అప్పాపురం..’ అని ఏకబిగిన చెప్తాడు గర్వంగా పోజిస్తూ! ‘అదేం లేదులేండి.. మా మేనల్లుడే’ అని తుస్సుమని గాలితీస్తాడు గోపాలం. ఇలాంటి సీన్లు ‘మిస్సమ్మ’లో ఎన్నో!!
బెంగాలీ చిత్రం ‘మన్మొయీ గర్ల్స్ స్కూల్’ మన మిస్సమ్మకు మూలాధారం. ఈ బెంగాలీ మాతృక నుంచి మూలకథను మాత్రమే గ్రహించారు. మిగతా సన్నివేశాలన్నిటిలో తెలుగుదనం కొట్టొచ్చేట్టు, హాస్యం అపరిమితంగా పండేటట్టు స్క్రిప్ట్ సిద్ధం చేశారు చక్రపాణి. సినిమా మొదలయ్యాక అరగంటకు అసలు కథ ప్రారంభం అవుతుంది. నిరుద్యోగ పర్వంలో కొట్టుమిట్టాడుతున్న రావు పత్రికలో ఓ ప్రకటన చూస్తాడు. బీఏ పాసైన పంతులు, పంతులమ్మ కావాలని అందులో ఉంటుంది. అది చదివిన ఆనందం నుంచి తేరుకోకముందే.. ఆ ఇద్దరూ భార్యాభర్తలై ఉండాలన్న షరతూ కనిపిస్తుంది. ఇంకేముంది యోగాలు అంత తొందరగా రావు అనుకుంటాడు రావు. పైగా ఎవరు తన పేరు అడిగినా ఎంప్టీ రావు (ఖాళీ రావు) అని చెప్పుకొంటూ ఉంటాడు. ఆ నిరాశలో ఉండగానే మేరీ అక్కడికి వస్తుంది. అంతకుముందే వారికి కాస్త పరిచయం ఉంటుంది! ఆ ప్రకటనను తనకిచ్చి ‘మీకేమైనా ఉపయోగపడుతుందో చూడండి’ అంటాడు. అది చదివి ఆమెకూడా పెదవి విరుస్తుంది. తానింకా మిస్ మేరీనే అని చెబుతుంది. దేవయ్య సావాస దోషం.. రావు ఎంప్టీ బుర్రలో తళుక్కున ఓ ఆలోచన మెదులుతుంది. నసిగీ నసిగీ ‘ఈ ఉద్యోగాల కోసం మనం భార్యాభర్తలుగా నాటకం ఆడితే..’ అని అడిగేస్తాడు. చర్రున లేచి పెట్టాల్సిన నాలుగు చీవాట్లు పెట్టి అక్కణ్నుంచి వెళ్లిపోతుంది మేరీ!
ఈ సన్నివేశంలో పింగళి వారి పాళి.. సినిమా ముందుకు సాగేందుకు వారధి నిర్మిస్తుంది. ఆ ఒక్కమాట.. ఆ ఒక్కపాట.. కడలి కన్నా లోతైన అతివ హృదయాన్ని ఆవిష్కరించింది. ‘ఔనంటే కాదనిలే… కాదంటే ఔననిలే.. ఆడువారి మాటలకూ అర్థాలు వేరులే..’ ఈ పాట నిత్య సత్యమై కూర్చుంది. నానుడిగా నేటికీ జనాల నాల్కలపై నానుతున్నది. ‘విసిగిన సిరి కసిరినచో.. విషయమసలు ఇష్టములే..’ ఈ ఒక్క పంక్తి ఈ డెబ్బయ్ ఏండ్లలో ఎన్ని బంధాలకు పురుడు పోసిందో! ఈ ఒక్కపాటతో పింగళి ప్రస్తావన ఆపేస్తే కుదరదు!! ‘బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే..’ ఎవర్గ్రీన్ హిట్. ‘రావోయి చందమామ..’ మిస్సమ్మ కవ్వింత గాథకే కాదు, తర్వాతి కాలంలో జరిగిన ఎన్నెన్నో వింతలకు వంత పాడుకునే మకుటమైంది. ‘ఏమిటో ఈ మాయా..’, ‘కావాలంటే ఇస్తాలే..’ ఇలా ప్రతి పాటా ఆణిముత్యమే! పింగళి సాహిత్యానికి స్వరేశ్వరరావు సాలూరి రాజేశ్వరరావు బాణీలు భలేగా కుదిరాయి. అందుకే ‘మిస్సమ్మ’ పాటలు ఇంకో పాతికేళ్లయినా అంతే ఫ్రెష్‌గా ఉంటాయి. కృత్రిమ మేధ.. ప్లే లిస్ట్‌లోనూ చోటు దక్కించుకుంటాయి.
మళ్లీ కథలోకి వస్తే… అప్పాపురం జమీందారు గోపాలం పెద్దబిడ్డ మహాలక్ష్మి ఎప్పుడో చిన్నప్పుడు మహాలయ పక్షాల్లో కాకినాడ సముద్ర తీరంలో తప్పిపోతుంది. ఆ తప్పిపోయిన చిన్నారి ఓ క్రైస్తవ దంపతుల దగ్గర పెరుగుతుంది. ఆవిడే మేరి. మన మిస్సమ్మ. ఈ మిస్సమ్మే మహాలక్ష్మి అని సినిమా మొదటి రెండు సీన్లలోనే చెప్పేస్తాడు రచయిత చక్రపాణి. సస్పెన్స్, కామెడీ ఒక ఒరలో ఇమడవు అనేవారాయన. అందుకే, మేరీ మరెవరో కాదు మహాలక్ష్మి అని సినిమా మొదట్లోనే ప్రేక్షకులకు హింట్ ఇచ్చాడు. కానీ, ఆ విషయం ఇతర పాత్రలకు తెలియకుండా సస్పెన్స్ క్రియేట్ చేశాడు.
మరోవైపు తప్పిపోయిన కూతురు పేరిటే అప్పాపురంలో పాఠశాల పెడతాడు గోపాలం. విద్యావంతులైన బడిపంతుళ్లు లేక పాఠశాల నిర్వహణ కుంటుపడుతుంది. స్కూలు చూసుకుంటాడనుకున్న మేనల్లుడేమో డిటెక్టివ్ అవతారం ఎత్తుతాడు. ఆ బడిని ఒక బాటలో పెట్టడానికి దంపతులైన టీచర్లు కావాలంటూ ప్రకటన ఇస్తాడు. ఆ యాడ్ ఫలితంగానే రావు, మేరీ దంపతులమంటూ అప్పాపురానికి చేరుకుంటారు. అక్కడ గోపాలం, అతని భార్య చూపే ఆదరం మేరీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. క్రైస్తవురాలైన ఆమెకు ఈ హిందూ ఆచారాలు నచ్చవు. తమ ఇంటి యజమాని అప్పు తీర్చడానికి కొన్నిరోజులు భరిస్తుంది. గోపాలం దంపతుల అత్యుత్సాహాన్ని, మేరీ కోపతాపాలను భరించలేక రావు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారవుతుంది.
ఇక మేనమామ పెద్ద కూతురును కనిపెట్టే క్రతువులో బిజీగా మారిపోతాడు రాజు. దేవయ్య దగ్గర ఆరాలు తీయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో చాలా చమురు వదిలించుకుంటాడు. గోపాలం చిన్న కూతురు సీతది మరో గోల. పాటలు నేర్పమంటూ రావుతో చనువుగా ఉంటుంది. ఇది మేరీకి నచ్చదు. ఈ విపరీతానికి విరుగుడుగా డిటెక్టివ్ రాజుకు సంగీతం నేర్పాలని కంకణం కట్టుకుంటుంది మిస్సమ్మ. ఈ క్రమంలో ‘మాకు మేమే.. మీకు మీరే…’ అంటూ రుసరుస రాగంలో గుసగుస పాట నేర్పే ప్రయత్నం చేస్తుంది. ‘బృందావనమది అందరిదీ..’ అంటూ సీతకు పాట నేర్పుతుంటాడు రావు. ఇలా కథ
రకరకాల మలుపులు తిరుగుతుంది. ప్రతి మలుపులోనూ హాస్యమే గెలుస్తుంది. చివరాఖరికి పంతులమ్మగా వచ్చిన మిస్సమ్మ… చిన్నప్పుడు తప్పిపోయిన మహాలక్ష్మి అని రాజు నిరూపించి.. గోపాలం మామయ్యతో ‘డిటెక్టివ్’ అనిపించుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.
ఆద్యంతం హాస్య భరితంగా రూపుదిద్దుకున్న మిస్సమ్మ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ‘లేచింది నిద్ర లేచింది మహిళా లోకం..’ అని ‘గుండమ్మకథ’ పిలుపునిచ్చింది 1962లో! కానీ, అంతకు ఏడేండ్ల కిందటే వచ్చిన ‘మిస్సమ్మ’ స్త్రీ సాధికారతను గొప్పగా నిరూపించింది.
‘మిస్సమ్మ’ చిత్రానికి మూలం బెంగాలీ సినిమా ‘మన్మొయీ గర్ల్స్ స్కూల్’. చిత్రంగా రాకముందు నాటకంగానూ ప్రసిద్ధి చెందింది. దీన్నే 1942లో ‘ఉదర నిమిత్తం’ నాటకంగా తెలుగులో అనువదించారు చక్రపాణి. 1954లో విడుదలైన విజయా ప్రొడక్షన్స్ ‘చంద్రహారం’ భారీ పరాజయం మూటగట్టుకుంది. దీంతో పూర్తి హాస్య చిత్రం తీయాలని భావించారు నాగిరెడ్డి-చక్రపాణి. ఆ సమయంలో చక్రపాణికి ‘ఉదర నిమిత్తం’ గుర్తొచ్చింది. అయితే, ఆ నాటకాన్ని సినిమా తీస్తే నిడివి సరిపోదు అనిపించింది. దీంతో ఆయనే రాసిన మరో నాటకం ‘డిటెక్టివ్’లో నుంచి కూడా కొంత భాగం తీసుకొని.. రెండిటినీ కలిపేసి ‘మిస్సమ్మ’ కథ సిద్ధం చేశారు.
‘మిస్సమ్మ’లో మేరీ పాత్రకు మొదట భానుమతిని అనుకున్నారు. సీతగా సావిత్రిని ఎంపిక చేశారు. నాలుగు రీళ్ల వరకూ షూటింగ్ కూడా చేశారు. అయితే, వరలక్ష్మి వ్రతం కారణంగా భానుమతి ఓ రోజు సెట్‌కు ఆలస్యంగా వచ్చింది. ముందురోజు తాను ఆలస్యంగా వస్తానని అసిస్టెంట్స్‌కు చెప్పిందట కూడా! అయితే, ఆ సంగతి చక్రపాణి చెవిన పడలేదు. భానుమతి ఆలస్యంగా రావడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. మిస్సమ్మ కన్నా అభిమానవతి అయిన భానుమతీ అదే రేంజ్లో ప్రతి స్పందించింది. దీంతో ఆమెను తప్పించి ఆ పాత్ర సావిత్రికి ఇచ్చారట. సీత పాత్రకు జమునను ఎంపిక చేశారు.
గాన గంధర్వుడు ఘంటసాల అంటే విజయవారికి ప్రత్యేక అభిమానం. మిస్సమ్మ సినిమాకు ఆయనతో సంగీత దర్శకత్వం చేయించాలని భావించారు నాగిరెడ్డి-చక్రపాణి. సినిమా స్క్రిప్ట్ కూడా సిద్ధం కాకముందే.. ‘తర్వాతి సినిమాలో కాస్త క్రైస్తవానికి దగ్గరగా ఉండే ట్యూన్స్ అవసరం పడతాయి.. సిద్ధంగా ఉండండి’ అని కూడా అన్నారట. కానీ, డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా సాలూరి రాజేశ్వరరావును ఎంచుకొన్నాడు. దీంతో ‘మిస్సమ్మ’ ఘంటసాలకు మిస్ అయింది. సినిమా పాటలు పాడమంటే మాస్టారు ఏమనుకుంటారో అని.. నేపథ్య గాయకుడిగా ఏఎమ్ రాజాకు మొగ్గు చూపారు. అలా ‘మిస్సమ్మ’ పాటల్లోనూ ఘంటసాల గాత్రం మిస్సయ్యాం.
– కణ్వస