మనిషి జీవితం లెక్కలతో లెక్కలేనంతగా ముడిపడి ఉంది. ఉదయం లేస్తూనే ప్రతిదీ ఓ లెక్క ప్రకారం జరగాల్సిందే! బియ్యంలో సరిపడా నీళ్లు పోయాలన్నా, పప్పులో ఉప్పు వేయాలన్నా, తేనీరులో చక్కెర కలపాలన్నా.. లెక్క ప్రకారం చేయాల్సిందే. లెక్క తప్పిందా.. చిక్కులు తప్పవు. దైనందిన జీవితంలో ఇంతలా ప్రభావితం చేస్తున్న లెక్కలు ఇప్పుడు నగల్లోనూ నిగనిగలాడుతున్నాయి. ఆభరణాల రూపంలో అలరిస్తున్నాయి. ఎక్కాల చిక్కుల్లేని లెక్కల ధగధగలేంటో చూసేద్దాం.
చాలా ఏండ్ల కిందటే..
ఈ లెక్కల నగలు చాలా ఏండ్ల కిందటే తయారయ్యాయని చారిత్రక సాక్ష్యాల ద్వారా తెలుస్తున్నది. రాతియుగం, లోహయుగంలోనూ రకరకాల ఆకారాల్లో నగలు వాడుకలో ఉన్నట్లు గుర్తించారు. అదే స్ఫూర్తితో అందరినీ ఆకట్టుకునేలా అదిరిపోయే ఆధునిక హంగులద్దుకుని ముస్తాబవుతున్నాయి మ్యాథమెటికల్ నగలు. ఇప్పుడు కూడా చతురస్రం, దీర్ఘ చతురస్రాల ఆకారాల్లో ఉండే గ్రానైట్, మార్బుల్ వంటి ఖరీదైన రాళ్లతో చక్కని నగలు తయారవుతున్నాయి. సంప్రదాయ వస్ర్తాలపైనే కాకుండా ఆధునిక దుస్తులపైనా నప్పుతూ ఇవి అందరినీ ఆకర్షిస్తున్నాయి.
త్రిభుజాలు, చతురస్రాలు, వృత్తాలు, వైశాల్యాలు, చుట్ట్టుకొలతలు.. ఇలా లెక్కలన్నీ రకరకాల ఫార్ములాల చుట్టూ తిరుగుతుంటాయి. ఆ ఆకారాలనే ఫ్యాషన్ ఫార్ములాగా మలిచారు జువెలరీ మేకర్స్. స్తూపాలు, శంఖువులు, ట్రెపీజియం ఆకృతిలో రకరకాల ఆభరణాలనూ తీర్చిదిద్ది అతివలను ఆకర్షిస్తున్నారు. వృత్త పరిధి సూత్రాలు పుట్టకముందే వృత్తాకార ఆభరణాలు పురుడుపోసుకున్నాయి. ఉంగరాలు, గాజులు, కడియాలు, కంటెలుగా వృత్తాలు ప్రాచీనకాలం నుంచే ఆభరణాల్లో కలిసిపోయాయి. చతురస్రాలు, దీర్ఘవృత్తాలూ.. ఉంగరాలుగా, రకరకాల నగల్లో పొదిగే రాళ్ల ఆకారంగా కనువిందు చేస్తాయి. అయితే, ఇప్పుడు నేరుగా ఆ ఆకారాలతో తయారైన నగలే మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇటుక మీద ఇటుక పేర్చినట్టు ఆయా ఆకారాలతో రకరకాల డిజైన్లలో నగలు తయారు చేస్తున్నారు.
చెక్కతో లెక్కలు..
రానురాను బంగారం, వెండి, ప్లాటినం వంటి ఖరీదైన లోహాలతో చేసే నగలకంటే వుడ్, సిల్క్, ఫ్యాబ్రిక్, పేపర్, గ్లాస్.. వంటి ఇతర పదార్థాలతో చేసిన నగలకే ఆదరణ పెరుగుతున్నది. చూసేందుకు చక్కగానూ, ధరలు కూడా అందుబాటులో ఉండటంతో భిన్నాకృతి నగలపై అతివలు మనసు పారేసుకుంటున్నారు. చెక్కతో చేసిన వృత్తాలు, చతురస్రాలను పెండెంట్లుగా, బ్రాస్లెట్లుగా ధరించడం చాలా కాలం నుంచీ వస్తున్న అలవాటే. అయితే ఇప్పడు చెక్కతో చేసిన
ఆకారాలను పొందికగా అమర్చి హారాలు, నెక్లెస్లు కూడా తయారుచేస్తున్నారు. ఈ ఆభరణాల తయారీలో ఎరుపు, నలుపు చెక్కను వాడుతూ పైనుంచి వార్నిష్తో ఫినిషింగ్ ఇవ్వడంతో తళుక్కుమంటూ మగువల మనసు దోచేస్తున్నాయి.
అంకెల గారడి..
నమ్మకాలు, ఆచారాలను అనుసరిస్తూ కూడా లెక్కల నగలను ధరిస్తున్నారు. న్యూమరాలజీ ప్రకారం అదృష్ట సంఖ్యలను, పుట్టినరోజు, పెండ్లిరోజు వంటి ప్రత్యేకమైన సందర్భాలను నగలపై నగిషీలుగా చెక్కిస్తున్నారు. ఆయా తేదీలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంగరాలు, చైన్లు, బ్రేస్లెట్లపై పొందుపరుస్తున్నారు. తయారీలో పూసలు, రాళ్ళు వంటి అదనపు ఆకర్షణలను జోడిస్తున్నప్పుడూ అంకెల లెక్క ఉంటున్నది.
కొత్తగా.. భిన్నంగా
అందరిలోనూ ప్రత్యేకంగా కనపడేందుకు, అందరినీ ఆకర్షించేందుకు ఈ లెక్కల నగలు చక్కగా పనిచేస్తాయి. కొత్తగా, భిన్నంగా కనపడుతూ ఆధునికత ఉట్టిపడేలా ఉండే ఈ లెక్కల నగలు అన్ని దుస్తుల మీదికీ చక్కగా నప్పుతాయి. కాలేజీలు, కార్యాలయాలకు వెళ్ళేవారు రోజువారీ నగలుగా వాడుకునేందుకు బాగుంటాయి. సరైన కొలతలతో ఆభరణాలు ఆకర్షణీయంగా తయారయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడే లెక్కలు కూడా అందమైన నగలుగా మారి అందరికీ దగ్గరవుతున్నాయి.