మణిపూర్ వాసులు చాలా ఇష్టపడే ఆట ఫుట్‌బాల్. ఈ గేమ్‌లో సరికొత్త ప్లేయర్లు రంగంలో దిగారు. మణిపూర్, ఇంఫాల్‌లో ఎక్కడ ఫుట్‌బాల్ టోర్నీలు జరిగినా.. కప్పు తమదేనంటున్నారు. ఆ దూకుడు చూసేందుకు జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారు. ఆ థర్డ్ జెండర్ క్రీడాకారులు ప్రత్యర్థుల నుంచి బంతిని చాకచక్యంగా అందుకునే టెక్నిక్‌లో ఆరితేరారు. ఎల్జీబీటీక్యూ+ సమాజంలోని అత్యుత్తమ క్రీడాకారులను గుర్తించి, ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తూ.. పరోక్షంగా వారి సాధికారతకు కృషిచేస్తున్నది ‘యా-ఆల్’ అనే ఎన్జీఓ.
యా-ఆల్ అంటే స్థానిక భాషలో విప్లవం. దీని వ్యవస్థాపకుడు సదమ్ హాంజాబమ్. తన ఎన్జీఓ ద్వారా 14మంది మెరికలను తయారు చేశాడు సదమ్. స్థానిక టోర్నమెంట్లలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తే.. దుమ్ము దులిపేస్తారు వారు. ఇవ్వకపోయినా.. తమలో తామే పోటీలు పెట్టుకుంటారు. పురుషుల నుంచి స్త్రీలుగా మారిన జట్టు ఒక వైపు, స్త్రీల నుంచి పురుషులుగా మారిన జట్టు మరోవైపు. ఆ ఉత్కంఠ భరితపోరు చూడాల్సిందే. యా-ఆల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ టీమ్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నది. మొట్టమొదటి ఆల్ ట్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుగా చరిత్రకెక్కింది. మనం హోలీ జరుపుకొన్నట్లే.. మణిపూర్‌లో ‘యేవ్‌శాంగ్’ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఇది వసంతం రాకకు చిహ్నం. ఐదురోజుల పాటు వివిధ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. వాటిలో యా-ఆల్ ట్రాన్స్జెండర్ల జట్టుకు ప్రాతినిధ్యం ఉంటుంది. ‘నా ఆశయం కొంతమేర నెరవేరింది. కానీ సాధించాల్సింది చాలా ఉంది’ అంటాడు సదమ్. నిజమే, మార్పు దిశగా ఇది తొలి అడుగే.