ఎండలంటే అందరికీ భయమే. కానీ వేడికి జంకితే.. బయటికి వెళ్లలేం. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోలేం. కాబట్టి, వణికించే వడగాలిని మంచుదెబ్బ కొట్టాలి. సెగకు చెమటలు పట్టేలా చేయాలి. సూర్యుడికే సుర్రుమనిపించేలా దూసుకుపోవాలి. ఇవన్నీ ఎలా సాధ్యం అంటారా? బార్లీ నీళ్లు పుచ్చుకోండి. సత్తు షర్బత్, జల్జీరా ఆస్వాదించండి. రండి… ఈ వేసవిని చల్లటి పానీయాలతో అదరగొడదాం! ఠండా పండుగ చేసుకుందాం!
పుచ్చకాయ శరీరంలో నీటిశాతాన్ని నిలిపి ఉంచుతుంది. ఎండవేడిమి నుంచి శరీరాన్ని కాపాడి డీహైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడుతుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచి, పోషకాల సరఫరా సవ్యంగా జరిగేలా చూస్తుంది.
పుచ్చకాయ జ్యూస్‌తో చేసిన ఐస్‌క్యూబ్స్ (పంచదార కలపకుండా ఈ ఐస్ తయారు చేయాలి.): కొన్ని, నిమ్మ చెక్కలు: పది, పంచదార: పావు కిలో, నీళ్లు: లీటరు, పుదీనా ఆకులు: కాసిని, నానబెట్టిన చియా గింజలు: మూడు టీ స్పూన్లు.
ఒక గిన్నెలో నిమ్మరసం పిండుకోవాలి. దానికి పంచదార, నీళ్లు జోడించి బాగా కలపాలి. అందులో పుచ్చకాయ జ్యూస్‌తో చేసిన ఐసు గడ్డలు వేయాలి. నానబెట్టిన చియా గింజల్ని కూడా కలపాలి. ఈ రసాన్ని గ్లాసులో పోసి.. పైన పుదీనా ఆకులు వేసి ఆస్వాదించాలి.
ఇందులో అధిక మోతాదులో ఉండే ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని నిస్సత్తువకు గురికానీయవు. యోగర్ట్‌లోని సుగుణాలు వేడి నుంచి కాపాడతాయి. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, జీర్ణాశయ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
యోగర్ట్: 125 మి.లీ, ఐస్‌కోల్డ్ వాటర్: 200 మి.లీ; ఐస్ క్యూబ్‌లు: 8, తరిగిన మామిడి పండు: 1, పంచదార: ఒక టేబుల్ స్పూను, ఎండిపోయిన పుదీనా: కొద్దిగా.
తయారీ కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నిటినీ బ్లెండర్లో వేసి కలియతిప్పాలి. ఆ తర్వాత, చల్లచల్లగా రుచి చూసేయాలి.
ఎండాకాలపు చలువ పానీయాల వరుసలో బార్లీ నీళ్లు ముందుంటాయి. శరీరాన్ని చల్లబరచి, నీటిశాతాన్ని తగు మోతాదులో ఉంచే స్వభావం వీటికి ఉందని ఆయుర్వేదం చెబుతున్నది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలోనూ సాయపడతాయి. బరువు తగ్గేందుకు ఎంతో కొంత ఉపయోగపడే ఈ పానీయాన్ని పరగడపున తాగితే మరీ మంచిది.
బార్లీ గింజలు: పావు కప్పు, నీళ్లు: నాలుగు కప్పులు, ఉప్పు: కొంచెం, తేనె: కొద్దిగా, నిమ్మకాయ: ఒక ముక్క (చివరి రెండూ ఇష్టాన్ని బట్టి వాడుకోవచ్చు)
బార్లీ గింజలను ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు మరిగేదాకా ఉడికించాలి. తర్వాత ఉప్పు వేసి, మంట తగ్గించి అరగంట సేపు కాగనివ్వాలి. గింజల్ని స్పూను సాయంతో కాస్త మెదపొచ్చు. తర్వాత గ్లాసులోకి ఈ నీళ్లను వడగట్టుకోవాలి. నచ్చితే నిమ్మరసం, తేనెలాంటి వాటిని కలుపుకోవచ్చు. ఫ్రిజ్‌లో ఒక అరగంట ఉంచి తాగితే హాయిగా ఉంటుంది.
ఎండాకాలంలో శరీరం సత్తువను కోల్పోతుంది. దీంతో విపరీతమైన నీరసానికి గురవుతాం. ఇలాంటి సమయంలో సత్తుతో చేసిన షర్బత్ శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. ఇందులో ఐరన్, సోడియం, పీచు పదార్థాలు, మెగ్నీషియంలాంటి పోషకాలు ఉంటాయి. అంతేకాదు, ఒంట్లో ద్రవాల స్థాయిని నిలిపి ఉంచేందుకు కూడా షర్బత్ సాయపడుతుంది.
శనగ సత్తుపిండి: పావుకప్పు, చల్లని నీళ్లు: నాలుగు కప్పులు, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, వేయించిన జీలకర్ర: అర టీస్పూన్, సన్నగా తరిగిన పుదీనా: రెండు టీ స్పూన్లు, నల్ల ఉప్పు: రుచికి తగినంత, సన్నగా తరిగిన పచ్చిమిర్చి: ఒకటి, పచ్చిమామిడి తురుము: 2 టీస్పూన్లు.
జాబితాలోని పదార్థాలన్నిటినీ పెద్ద గిన్నెలో పోసి బాగా కలపాలి. తర్వాత గ్లాసులో పోసి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. అలంకారంగా కొన్ని పుదీనా ఆకులు విదిలిస్తే.. అదిరిపోతుంది.
ఈ చల్లచల్లని పానీయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని వివిధ దినుసులు శరీరంలోని వేడిని తక్షణం తగ్గించడంతోపాటు, రోగ నిరోధక శక్తిని వృద్ధిచేస్తాయి. దాహార్తి తీర్చే పానీయంగానూ దీనికి మంచి పేరుంది.
చింతపండు గుజ్జు: 125 గ్రా., పుదీనా ఆకులు: 3 టీ స్పూన్లు, జీలకర్ర పొడి: అర టీస్పూను, వేయించిన జీలకర్రపొడి: ముప్పావు టీస్పూను, బెల్లం తురుము : 50 గ్రా., నల్ల ఉప్పు: నాలుగు టీస్పూన్లు, జింజర్ సాల్ట్: ఒక టీస్పూను, నిమ్మరసం: మూడు నాలుగు టీస్పూన్లు, కశ్మీరీ లాల్ మిర్చి పొడి: కొద్దిగా, గరం మసాలా: అరటీస్పూను, నీళ్లు: అర లీటరు.
పై పదార్థాలన్నిటినీ ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. అంటే మిక్సీ పట్టినట్టు అన్నమాట. తర్వాత వడగట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. నలుగురికీ అందించే ముందు గ్లాసుపై కాస్త బూందీ చల్లితే, జీరా రుచి నాలుకను జిల్లుమనిపిస్తుంది.
పచ్చిమామిడితో చేసే ఆమ్పన్నాలోని సుగుణాలు వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుతాయి. ఈ చలువ పానీయం శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. లవణాలను బయటికి పోనీయకుండా అడ్డుకుని.. దేహాన్ని చల్లగా ఉంచుతుంది.
పచ్చి మామిడి: అరకిలో, పంచదార: అరకప్పు, ఉప్పు: 2 టీస్పూన్లు, నల్ల ఉప్పు: 2 టీస్పూన్లు, వేయించిన జీలకర్రపొడి: 2 టీస్పూన్లు, సన్నగా తరిగిన పుదీనా: 2 టీస్పూన్లు, నీళ్లు: 2 కప్పులు, ఐస్‌క్యూబ్స్: కొన్ని.
ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో మామిడికాయలు వేసి, గుజ్జు మెత్తబడేదాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చెక్కు తీసి.. గుజ్జు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మిగతా పదార్థాలన్నిటినీ బాగా కలిపి, నీళ్లు కూడా జతచేయాలి. గ్లాసులో ఐస్ వేసి, దాని మీద ఈ ఆమ్ పన్నాను పోస్తే,
గ్రేట్ టేస్ట్.. పల్పీ గ్రేప్ జ్యూస్ ఎండాకాలం సూర్యుడి అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించేందుకు ద్రాక్షరసం ఉపయోగపడుతుంది. మెదడుకు రక్త సరఫరా మెరుగ్గా జరిగేందుకూ ఇది తోడ్పడుతుంది. అంతేకాదు, శరీరాన్ని రోజంతా చురుగ్గా ఉంచుతుంది.
నల్లద్రాక్ష: అర కేజీ, నీళ్లు: లీటరు, పంచదార: ఒక కప్పు, నానబెట్టిన చియా గింజలు: ఒక టీస్పూను, ఐస్ క్యూబ్స్: కొన్ని.
పొయ్యి మీద నీళ్లు పెట్టి.. అందులో ద్రాక్షపండ్లు వేయాలి. చెక్కు నుంచి విడిపోయేదాకా ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆపేసి.. నీళ్లు చల్లారాక, ద్రాక్ష పండ్ల చెక్కు, గింజలు తీసేయాలి. కొన్ని పండ్ల గుజ్జును పక్కన పెట్టుకుని, మిగతా గుజ్జును ఇందాకటి నీళ్లలో వేసి మళ్లీ మరిగించాలి. తర్వాత, పంచదార వేసి 10 నిమిషాలు చిన్న మంట మీద మరగనివ్వాలి. ఆపైన మరో గిన్నెలోకి ఈ నీళ్లను వడకట్టుకోవాలి. ఇందాక తీసి పెట్టుకున్న ద్రాక్ష పండ్ల గుజ్జును స్పూన్‌తో గ్లాసులో వేసి.. వడకట్టిన రసాన్ని పోసి.. నానబెట్టిన చియా గింజలు, ఐస్‌క్యూబ్స్ వేస్తే చాలు.
మరీ చల్లని పానీయాలు తాగడం ఏమంత మంచిది కాదు. మరింత తీపి కోసం చక్కెరకు బదులుగా తేనె ఉత్తమం. పరిశుభ్రమైన నీటినే వాడాలి. కొందరిని కొన్ని పదార్థాలు అలర్జీకి గురిచేస్తాయి. అలాంటివారు నిపుణులను సంప్రదించాకే.. వేసవి పానీయాల జోలికి వెళ్లాలి.