నటిగా రాణించాలని అనుకున్నదే ఆలస్యం అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మాతృభాష అయిన కన్నడను వదిలి తెలుగు బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొదటి సీరియల్ తోనే లక్షలాది అభిమానులను సంపాదించుకుని తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న నటి కృతికా ఉమాశంకర్. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె బుల్లితెరపైనా తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నది. ‘స్టార్ మా’లో ప్రసారమవుతున్న ‘మగువ ఓ మగువ’ సీరియల్లో సింధూరగా అలరిస్తున్న కృతికా ఉమాశంకర్ జిందగీతో పంచుకున్న కబుర్లు..
నేను పుట్టింది, పెరిగింది బెంగళూర్లోనే. చిన్నప్పటి నుంచీ బాగా చదువుకుని అబ్రాడ్‌లో మాస్టర్స్ చేయాలని కలలు కనేదాన్ని. స్కూల్లో, కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. దీంతో నా ఫ్రెండ్స్ నన్ను మోడలింగ్‌లో ట్రై చేయమని సలహా ఇచ్చారు. వారి ప్రోత్సాహంతో కాలేజీ రోజుల్లోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించా. మూడేండ్లపాటు మోడల్‌గా చేస్తూనే సీరియల్స్, సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్నించా. అనుకోకుండా ఒకరోజు తెలుగు సీరియల్‌కి ఆడిషన్స్ జరుగుతున్నాయని ఓ ఫ్రెండ్ చెప్పడంతో వెళ్లాను. ఆడిషన్ ఏజెంట్‌కి కౌంట్ సరిపోయేందుకు నన్ను డమ్మీ ఆడిషన్ చేశారు. ఆ సీరియల్లో అవకాశం నాకు వస్తుందని అనుకోలేదు. కానీ, నెల రోజుల తర్వాత ప్రొడక్షన్ టీమ్ నుంచి ఫోన్ వచ్చింది. నాకు ఏమాత్రం తెలియని భాష, ఊరు.. ఇబ్బందిపడటం ఎందుకని భయమేసి నేను చేయనని చెప్పాను. కానీ, వాళ్లు అమ్మానాన్నతో మాట్లాడి ఒప్పించడంతో ఓసారి ట్రై చేద్దామని హైదరాబాద్ వచ్చేశా. ఆ నిర్ణయమే నా జీవితాన్ని మలుపుతిప్పింది.
సపోర్ట్ లేకుండా పరిశ్రమలో రాణించడం చాలా కష్టం. నేను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చాలామంది హేళన చేశారు. కానీ, ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ఆదరణ వల్ల నేనేంటో నిరూపించుకోగలిగాను. నటిగా నాకు స్టార్ మా మంచి గుర్తింపు ఇచ్చింది. నేను మొదటగా చేసిన ‘మగువ ఓ మగువ’ సీరియల్లో సింధూరగా మంచి పాత్ర దక్కింది. నా కోస్టార్ శ్రవణ్ కుమార్ చాలా సపోర్ట్ చేశారు. మొదట్లో తెలుగు అర్థంకాక చాలా ఇబ్బందిపడేదాన్ని! కానీ, డైరెక్షన్ టీమ్ నా బాధని అర్థం చేసుకుని ప్రతి విషయాన్ని నాకు కన్నడ, ఇంగ్లిష్‌లో విడమర్చి చెప్పేవారు. ఇప్పుడు తెలుగు అర్థం చేసుకోవడమే కాదు చక్కగా మాట్లాడుతున్నా! చాలా సీరియల్స్‌లో అవకాశాలు వస్తున్నాయి. కానీ, నాకు కుటుంబానికి సమయం లేకుండా బిజీగా గడపడం ఇష్టం లేదు. అందుకే మరే ప్రాజెక్ట్‌ని ఒప్పుకోవట్లేదు. మంచి కథతో కూడిన సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్ర వస్తే తప్పకుండా సినిమాల్లో నటిస్తాను. ఈరోజు నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానంటే మా అమ్మానాన్నల ప్రోత్సాహమే కారణం. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను.
హైదరాబాద్ రెండో ఇల్లు.. నాకు ఏ మాత్రం ఖాళీ దొరికినా ఇంట్లో ఉండి కుటుంబంతో గడపడానికే ఇష్టపడతాను. ట్రావెలింగ్ అంతగా ఇష్టం ఉండదు. మొదట్లో అమ్మ నాతోపాటు షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేది. బెంగళూరు తర్వాత నాకు బాగా నచ్చిన సిటీ ఇదే!
ఇక్కడి మనుషులు చాలా ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు, కన్నడలో వచ్చే అన్ని సినిమాలు చూస్తాను. ఒక్కో యాక్టర్దీ ఒక్కో ైస్టెల్. ఇటీవల వచ్చిన ‘సప్తసాగర దాచే యెల్లో’ సినిమాలో రుక్మిణీ వసంత్ నటన బాగా నచ్చింది. అలాంటి సహజమైన పాత్రల్లో నటించాలని ఉంది.