వేల పాటలు పాడిన శ్రేయా ఘోషల్.. ఒక్క పాట విషయంలో మాత్రం బాధపడుతున్నది. ‘ఆ పాట పాడకుండా ఉండాల్సింది!’ అంటూ తెగ ఫీల్ అవుతున్నది. హిందీలోనే కాకుండా.. అన్ని దక్షిణాది భాషల్లోనూ ఎన్నో పాపులర్ పాటలు పాడింది శ్రేయా ఘోషల్. భాషతో సంబంధం లేకుండా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఐటమ్ సాంగ్స్’పై స్పందించింది.
అగ్నిపథ్ చిత్రంలో ‘చికిని చమేలీ’ పాట పాడినందుకు బాధపడుతున్నట్టు వెల్లడించింది. ఈ పాట అర్థం తెలియకుండానే చిన్నపిల్లలు కూడా పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారనీ, అది ఎంతమాత్రం కరెక్ట్ కాదనీ అంటున్నది. ఇలాంటి పాటలు మగవాళ్లే రాస్తారనీ, అందుకే అందులో ఆడవాళ్లను కించపరిచే పదాలు ఎక్కువగా ఉంటాయని శ్రేయా ఘోషల్ చెప్పుకొచ్చింది. ఆడవాళ్లు కూడా పాటలు రాస్తే.. ఇలాంటి పదాలకు బ్రేక్ పడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.
ఇంకా మాట్లాడుతూ.. “శృంగారం, అసభ్యత మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. కానీ, కొన్ని పాటల్లో పూర్తి సారాంశం తెలియకుండానే.. చిన్నారులు ఆ పాటలు పాడుతున్నారు. వాటిని మామూలు పాటల్లాగే భావిస్తున్నారు. డ్యాన్స్ కూడా చేస్తున్నారు. ఇలాంటివి చూసిన తర్వాత.. ఐటమ్ సాంగ్స్ ఎంపికలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా!” అంటూ చెప్పుకొచ్చింది.
వివిధ సందర్భాల్లో శ్రేయను కలిసిన చిన్నారులు.. తన పాటలంటే ఇష్టమనీ, తన ముందు పాడాలని ఉందంటూ.. ఐటమ్ సాంగ్సే ఎక్కువగా పాడుతున్నారట. ఇలాగే ఒకసారి ఓ ఐదేళ్ల పాప శ్రేయను కలిసి ‘చికినీ చమేలీ’ పాట పాడిందట. “అంత చిన్న అమ్మాయి అలాంటి పాట పాడటం నాకు ఏమాత్రం మంచిగా అనిపించలేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి!” అంటూ వెల్లడించింది శ్రేయ. ఇక 2012లో వచ్చిన ‘అగ్నిపథ్’ సినిమా కోసం ‘చికినీ చమేలీ’ పాట పాడింది శ్రేయ. ఆమె గాత్రానికి.. స్టార్ హీరోయిన్ కత్రినా స్టెప్పులు తోడవ్వడంతో సూపర్ హిట్గా నిలిచింది. 12ఏళ్లకే పాటలు పాడటం ప్రారంభించిన శ్రేయ.. దేశంలోని స్టార్ సింగర్లలో ఒకరిగా రాణిస్తున్నది.