కాసులపేరు పాత ముచ్చట కానేకాదు. కాసులనేవి మాలకే పరిమితం కాలేదు. నెక్లెస్, దుద్దులు, ఉంగరాలు.. ఇలా కొత్తకొత్త రూపాల్లో మెరుస్తున్నాయి. అయినా సరే వీటిలో మరింత వైవిధ్యాన్ని కోరుకునే వారికోసం పెద్ద కాసులతో గొలుసులు తయారు చేస్తున్నారు డిజైనర్లు. బోల్డ్‌గా కనిపించే స్టేట్మెంట్ నగల్ని ఇష్టపడేవాళ్లు, ఇందులోనూ ైస్టెల్ స్టేట్మెంట్ చూపించాలని తహతహలాడుతున్నారు.పాత కొత్తల మేళవింపు.. ఫ్యాషన్ జువెలరీ. పాతొక వింత ఇప్పుడు.
పాతనే మరింత అందంగా, ఇంకాస్త కొత్తగా చూపించడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు సృజనకారులు. ఇందులో భాగంగా నగల ప్రపంచంలోకి అడుగుపెట్టినవే పెద్ద కాసుల గొలుసులు. చిట్టి కాసులు, మామూలు లక్ష్మీ కాసులకు మూడింతలు ఉంటుంది వీటి పరిమాణం. సాదాగా సాధారణ కాసు నమూనాలోనే కాదు, చుట్టూ నగిషీలు చెక్కినవీ ఈ తరహాలో వస్తున్నాయి. తళుకులీనే బంగారు వన్నెతో పాటు, యాంటిక్ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. అదనంగా రాళ్లను కూడా జోడిస్తున్నారు.
ఈ పెద్ద కాసులతో హారాలు, బీడెడ్ గొలుసులు, నెక్లెస్‌లు.. ఇలా రకరకాల కంఠాభరణాలు రూపొందిస్తున్నారు. తయారీలో నెమళ్లు, మామిడి పిందెలు, పువ్వుల డిజైన్లను వాడుతున్నారు. మొత్తంగా మెడలో పెట్టుకుంటే ఎంతో విభిన్నంగా, మరింత ప్రత్యేకంగా కనిపించేలా రూపు దిద్దుతున్నారు. కాసును చూడగానే సంప్రదాయంగా అనిపించినా, చూడ్డానికి స్టేట్మెంట్ నగల్లా కనిపిస్తూ ట్రెండీ జువెలరీతో పోటీ పడుతున్నాయి. అందుకే ఈ పెద్ద కాసుల పేర్లను కాంతమ్మగారే కాదు.. కాంతలంతా వేసుకుంటున్నారు!