జీవితం సంతోషంగా సాగిపోవాలన్నది అందరి కోరిక. ఆ ముచ్చట తీర్చే ముచ్చటైన ఉపాయం నచ్చిన పనిచేయడం. నచ్చినట్టుగా బతకడం. అధిక వేతనం తప్ప ఆనందాలు లేని సాఫ్ట్వేర్ కొలువుని వదులుకుని సివిల్స్ సాధించాలని బయల్దేరింది కన్నం హరిణి. అందరి కోసం నలుగురితో కలిసి పనిచేయాలన్న పట్టుదలతో గ్రూప్ వన్‌లో విజేతగా నలిచింది. డిప్యూటీ కలెక్టర్ కొలువులో చేరిన ఆమె కోరుకున్నట్టే ప్రజల కోసం ప్రజల మధ్య ఉంటానంటున్నది.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అనంతపల్లి మా స్వస్థలం. అమ్మ కళాప్రపూర్ణ జ్యోతి, నాన్న కన్నం రమేశ్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. నాన్న ఇంగ్లిష్ టీచర్. అయినా మాతృభాషంటే మక్కువ. నన్ను తెలుగు మీడియం పాఠశాలలో చదివించారు. వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ చదివాను. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జాబ్ వచ్చింది. హైదరాబాద్ యూనిట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరాను.
సంతోషం కోసం..
బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్నప్పుడు ప్రజల్లో ఉండి పనిచేయాలన్న ఆలోచన వచ్చింది. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు ఇన్నోవేషన్ ఆంత్రప్రెన్యూర్ క్లబ్‌కి కార్యదర్శిగా పనిచేశాను. విద్యార్థులందరితో సమన్వయం చేయడం, వారి సమస్యల పరిష్కారం కోసం పని చేసే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో నలుగురితో కలిసి పది మంది కోసం పనిచేయడం అలవడింది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరిస్తే కలిగే ఆనందం మరెందులోనూ లేదని అనిపించింది. డెస్క్‌కే అంకితమయ్యే సాఫ్ట్వేర్ కొలువులో ఏ ఆనందమూ లేదనీ తెలిసింది. ఐటీ కొలువులో సాంకేతిక నైపుణ్యంతో ఎంత ప్రతిభ కనబరిచినా ప్రజలతో ఎటువంటి సంబంధాలూ పెరగవు. అదే సివిల్ సర్వీసెస్‌లో ఉంటే ప్రజల కోసం పనిచేయవచ్చు. ప్రజల మధ్య ఉండి పనిచేయవచ్చని అటుగా అడుగులు వేయాలనుకున్నా! ఇదే విషయం ఇంట్లో చెబితే అమ్మానాన్న కాదనలేదు.
సివిల్సే లక్ష్యం
సివిల్స్ కోసం ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నా. యూపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలు రాశాను. రెండుసార్లూ క్లియర్ చేయలేకపోయా. ఇంతలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్‌కు సిద్ధమయ్యాను. సివిల్స్ కోసం మూడేళ్లు ప్రిపేర్ అయ్యాను. అందువల్ల గ్రూప్ వన్ పరీక్ష తేలిగ్గానే రాశాను. గ్రూప్-1 సర్వీస్‌కి ఎంపికయ్యాను. జగిత్యాల డిప్యూటీ కలెక్టర్‌గా (ట్రైనీ)గా బాధ్యతలు స్వీకరించాను. ఎంతో కష్టంతో, ప్రజలకు ఏదైనా చేయాలనే లక్ష్యంతో ఈ ఉద్యోగంలో చేరాను. ప్రజా సంక్షేమం కోసం ఒక అధికారిగా నా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తాను. సివిల్స్ కచ్చితంగా సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండే అధికారిగా పేరు తెచ్చుకోవాలన్నది నా లక్ష్యం….?
-కొత్తూరి మహేశ్ కుమార్, వూటూరి నవీన్ కుమార్