‘దానం నామ న్యాయార్జిత ధన ధాన్యాదేః శ్రద్ధయా అర్థిభ్యః ప్రదానమ్’ అని చెబుతుంది ‘శాండిల్యోపనిషత్తు’. దానమంటే న్యాయంగా సంపాదించిన ధనధాన్యాదులను శ్రద్ధతో అర్థిజనులకు ఒసగడం… అని భావం. దానం ఎటువంటిది ఇవ్వాలంటే న్యాయంగా సంపాదించిందని, ఎలా ఇవ్వాలంటే కసురుకోకుండా శ్రద్ధతో ప్రేమతో ఇవ్వాలని పై శ్లోక తాత్పర్యం. ఈ ఉపనిషత్ వాక్యానికి అద్దం పట్టే ఒక మహాత్ముని దయార్ద్ర హృదయాన్ని పరిశీలిద్దాం.
పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం ‘కాశీ’లో చాలా సంవత్సరాల కిందట ఒక నేతపనివాడు ఉండేవాడు. అతను ఏరోజు నేసిన దుస్తులను ఆ రోజే అమ్మి, ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. దుస్తులు అమ్ముడుపోని రోజు ఆ కుటుంబం పస్తుండేది. ఒకరోజు మామూలుగా దుస్తులు తీసుకొని బజారుకు బయల్దేరాడు ఆ నేతగాడు. ‘ఏమండీ! ఇవాళ్లయినా డబ్బులు తెస్తారా! పిల్లలు నిన్నటినుంచీ ఆకలితో అలమటిస్తున్నారు’ అన్నది ఆ ఇంటి ఇల్లాలు.
ఆయన ‘అలాగే!’ అని బయల్దేరాడు. వీధులన్నీ తిరిగినా వస్ర్తాలను ఎవరూ కొన్న పాపాన పోలేదు. అయినా విసుక్కోకుండా వీధుల్లో తిరుగుతూనే ఉన్నాడు. ఇంతలో ఒంటిపై సరిగ్గా దుస్తులు కూడా లేని ఒక బీద బ్రాహ్మణుడు అతనికి తారసిల్లాడు. నేతపనివాడి చేతిలోని వస్ర్తాన్ని చూసి, దానిని తనకు ‘దానం ఇవ్వ’మన్నాడు. ఆ బీదవాణ్ని చూసి నేతగాడు జాలిపడ్డాడు. తన ఇంటి పరిస్థితి మరచిపోయి వస్ర్తాన్ని అతనికి దానం చేస్తాడు. పేద బ్రాహ్మణుడు ఆ నేతగాణ్ని మనసారా దీవించి వెళ్లిపోయాడు. నేతగాడు ఖాళీ చేతులతో ఇంటికి బయల్దేరబోయాడు. అంతలో అతనికి తన కుటుంబ పరిస్థితి గుర్తుకువచ్చింది.
ఇంట్లోవారికి ముఖం చూపించలేక వీధుల్లో తిరుగుతూ ఉండిపోయాడు. తోటివారి దైన్యాన్ని గుర్తించి, తన పరిస్థితిని కూడా మర్చిపోయిన మహాదాత మరెవరో కాదు మహాత్ముడైన ‘కబీరుదాసు’. దరిద్ర నారాయణ సేవ అంటే ఇదే! హిందీలో ఆయన రచించిన దోహాలు లోక ప్రసిద్ధి చెందాయి. ‘సోదరా! ఇద్దరు జగదీశ్వరులు ఎక్కడినుంచి వచ్చారు? ఒక ఈశ్వరుడే ‘రాముడు, రహీము’ మొదలైన పేర్లు ధరించాడు’ అని ఏకతాభావాన్ని ప్రకటించాడు. మతసహనాన్ని చాటి చెప్పాడు.
– డా॥ వెలుదండ సత్యనారాయణ