ఆఫీస్ పని.. ఇంటి పని.. అవి చాలవన్నట్టు జూమ్ మీటింగ్‌లు, గ్రూపు కాల్స్. ఎంత మల్టీ టాస్కింగ్ చేసినా.. కొన్ని తెమలవు! ఇంకొన్ని మర్చిపోవడం కామన్. మరైతే, ఏం చేయాలి? ఎవరి హెల్ఫ్ తీసుకోవాలి? అనుకుంటున్న తరుణంలో ‘ఏఐ’ పుట్టుకొచ్చింది. ఫోన్లో సిరి.. ఇంట్లో అలెక్సా అసిస్టెంట్.. ఇలా చెప్పగానే అలా పనుల్ని చక్కబెట్టేస్తున్నాయి. వంటింట్లో రెసిపీల దగ్గర్నుంచి.. ఆన్లైన్ ఆర్డర్ల వరకూ అన్నిటినీ చకచకా ఏఐతో మేనేజ్ చేస్తున్నారు. అయితే, ఎంత ఏఐ అయినా.. మనం కమాండ్ ఇస్తేనే పనికి ఉపక్రమిస్తుంది. లేదంటే.. ఊలుకూ పలుకూ లేకుండా గమ్మునుంటుంది. ఈ క్రమంలో మన డిజిటల్ జీవితాన్ని మరింత ఆటోమేట్ చేయడానికి గూగుల్ ఓ వినూత్న ‘ప్రాజెక్టు’తో ముందుకొస్తున్నది. అదే ప్రాజెక్ట్ జార్విస్. ఇదో వెబ్ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యవస్థ. ఇదేం చేస్తుందంటే.. మనం చేసే రోజువారీ వెబ్ ఆధారిత పనుల్ని సులభతరం చేస్తుంది.
అదెలాగంటే.. ముందు ప్రాజెక్ట్ జార్విస్ యూజర్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అర్థం చేసుకుంటుంది. మనం రాస్తున్న ఈవెంట్స్, చాటింగ్, ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు.. ఇలా మొత్తం డిజిటల్ యాక్టివిటీల్ని పరిశీలిస్తుంది. అన్నిటినీ ప్రాసెస్ చేసి.. మనకంటే ఓ అడుగు ముందుంటుంది. వ్యక్తిగత సేవకుడిలా పని ప్రారంభిస్తుంది. అంటే.. మర్నాడు ఏమేం చేయాలో ఈ రాత్రే షెడ్యూల్ చేసేస్తుంది. ఉదయం లేవగానే చేయాల్సిన పనులు అన్నిటినీ రిమైండర్లుగా గుర్తు చేస్తుంది. ప్రయాణానికి సంబంధించిన రిజర్వేషన్లను సూచిస్తుంది. క్యాలెండర్లో ముఖ్యమైన డేట్స్‌ని బ్లాక్ చేసి ముందే మనకు గుర్తు చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. గూగుల్ జెమినీకి ఇది అడ్వాన్స్ వెర్షన్ అన్నమాట. ముఖ్యంగా ఇది క్రోమ్ బ్రౌజర్‌తో జతకట్టి పని చేస్తుంది. రానున్న డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్ జార్విస్‌ను అధికారికంగా యూజర్ల ముందుకు తెచ్చేందుకు గూగుల్ ప్లాన్ చేస్తున్నది. సో.. ఇక మన వెబ్ విహారాన్ని జార్విస్తో జాలీగా చేయొచ్చు!