ఇంట్లో ఒక్కరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నారంటే.. ప్రతినిత్యం టామ్ అండ్ జెర్రీ షోనే! కొట్లాటలు, అలకలు, పేచీలు, ఒకరిపై ఒకరి ఫిర్యాదులు.. ఇవన్నీ కామనే! కాదేదీ గొడవకు అనర్హం అన్నట్లుగా.. బట్టలు మొదలుకొని భోజనం, టీవీ షోలు, రిమోట్లు, బొమ్మలు ఇలా ప్రతీది తగువుకు కారణం అవుతుంటాయి! అయితే, తోబుట్టువులు ఇలా చీటికీమాటికీ గొడవ పడటానికి మరెన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని తెలుసుకొని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. పిల్లల మధ్య ఉద్రిక్తతలను తగ్గించవచ్చని అంటున్నారు.
పిల్లల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజమే! ఎందుకంటే.. ఒక్కొక్కరి ఆలోచనలు, భావాల్లో ఎన్నో తేడాలు కనిపిస్తాయి. వారి అభిరుచులు కూడా వేరువేరుగా ఉంటాయి. అవే.. వారి మధ్య గొడవలకు కారణం అవుతాయి. ఉదాహరణకు ఇంట్లో ఒకే టీవీ ఉన్నప్పుడు.. ఒకరికి కార్టూన్ చూడాలనిపిస్తే.. మరొకరు సినిమా చూడాలని మారాం చేస్తారు. అది ముదిరి గొడవకు కారణం అవుతుంది. అయితే, చిన్నప్పుడు ఎలా ఉన్నా.. పెద్దయ్యాక కూడా వారి ప్రవర్తన అలాగే ఉంటే భవిష్యత్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి, ఇంట్లో పిల్లలు చీటికీమాటికీ గొడవలు పడుతూ ఉంటే.. తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది.
ప్రతి దానికీ గొడవ పడటం, తిట్టుకోవడం లాంటివి కాకుండా.. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా చూడాలి.వారి భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచేలా ప్రోత్సహించాలి. కోపం, బాధ వంటివి కలిగినప్పుడు వాటిని మాటల్లో చెప్పేలా చూడాలి.పిల్లలతో విడివిడిగా సమయం గడపాలి. దీనివల్ల వారిలో భద్రతా భావం పెరుగుతుంది.చిన్నారుల చిన్నచిన్న గొడవలను వారే పరిష్కరించుకునేలా చూడండి. మీరు మధ్యలో తలదూరిస్తే.. మొదటికే మోసం వస్తుంది. అయితే, గొడవ ముదురుతున్నట్లు అనిపిస్తే.. వెంటనే జోక్యం చేసుకొని, సమస్యకు పరిష్కారం చూపండి.
పిల్లల మధ్య సానుకూల సంబంధాన్ని పెంపొందించండి. ఇద్దరూ కలిసి ఆడుకునేలా, ఒకరికొకరు సహాయం చేసుకునేలా ప్రోత్సహించండి.
ఎవరో ఒకరు కాదు.. ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పేలా చూడండి. ఏదైనా మంచి పని చేసినప్పుడు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలని చెప్పాలి. దీని వల్ల వారిద్దరి మధ్య మంచి పాజిటివిటీ ఉంటుంది.