గృహమే కదా స్వర్గసీమ! ఇంటిని మనకు నచ్చినట్టే కాదు, మనసుకి హాయినిచ్చేట్టుగా ఉంచుకోవాలని ఎవరికుండదు?! సంప్రదాయాలను అనుసరిస్తూ, నేటి సౌకర్యాలను ఇష్టపడేవాళ్లు చూడటానికే కాదు చెప్పుకోడానికీ బాగుండాలి. అలాంటి ఇళ్లలో త్రిష ఇల్లు ఒకటని చెన్నై మీడియా ఇల్లెక్కి చాటింపు వేస్తున్నది. ఇంతకీ ఆ ఇంటిలో అన్ని విశేషాలు ఏమున్నాయో తెలుసా? ఆ ఇంటి ఖరీదు పది కోట్లని ఓ అంచనా. ఇక ఆ ఇంటి అందాలను చూపిస్తూ మురిసిపోయే త్రిష షేర్ చేసిన ఇన్‌స్టా ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఆ ఫొటోల్లో ఉన్న ఇంటి విశేషాలు ఏమిటంటే… ఎండిన అలుకు గోధుమ రంగులో ఇంటికి శోభ తెచ్చేది. మట్టి రంగుల కార్పెట్లతో ఇంటికి కొత్తగా ముస్తాబు చేసుకుంది. ఒక్క కార్పెట్లే కాదు ఇటుకలు పేర్చి, గోడల పక్కన మిద్దెలు కట్టే పాత సంప్రదాయాలను అనుసరిస్తూ డ్రాయింగ్ రూమ్‌ని సుందరంగా తీర్చిదిద్దుకుంది. ఇటుక రంగు సోఫాలతోపాటు మన్ను రంగులోని కర్టెన్లతో ఇంటిని అలంకరించుకుంది.
చెక్కతో చేసిన మెట్లు, జిమ్‌లో ఉడెన్ ఫ్లోరింగ్ వేయించింది. ప్రకృతిలో కనిపించే రకరకాల రాళ్లతో గోడలు, శిల్పాలు, ఆర్చ్‌లు చేయించింది. ఇంత మనసుపెట్టి చేసిన ఇంటిని పూల కుండీలు, ఖరీదైన కార్పెట్లు, ఫ్లోరల్ డిజైన్లతో ఉన్న కర్టెన్లతో ముస్తాబు చేసింది. ఇక గోడలకు సెన్సర్ లైట్లతో ఆధునిక హంగులద్దింది. చూడముచ్చటైన ఇంటి గురించి చెన్నై జనాలు ఇప్పుడు బాగా చెప్పుకొంటున్నారట. త్రిష టేస్ట్ సూపర్బ్ అని కితాబిస్తున్నారట.