అందం, అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్! డైరెక్టర్ మహేశ్ భట్ కూతురిగా.. ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. తన రెండో చిత్రం ‘హైవే’తోనే అవార్డుల వేట మొదలుపెట్టింది. రోడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో, కిడ్నాప్ బాధితురాలిగా నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. ఈ చిత్రంలో ఆమె నటనకు ‘ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్’ అవార్డునూ గెలుచుకున్నది.
అయితే, ఈ పాత్ర కోసం మొదటగా ఎవరైనా సీనియర్ నటిని ఎంపిక చేయాలని అనుకున్నాడట చిత్ర డైరెక్టర్ ఇంతియాజ్ అలీ. బాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఇంతియాజ్.. పదేళ్ల క్రితం ‘హైవే’ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా, ఓ ఆన్లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమాకు సంబంధించిన ముచ్చట్లను పంచుకున్నాడు. “హైవేలో ఆలియా పోషించిన వీర త్రిపాఠి పాత్ర కోసం 30 ఏళ్లు పైబడిన సీనియర్ నటిని తీసుకోవాలని అనుకున్నాను.
ఎందుకంటే, ఆ పాత్ర ఎంతో పరిణతితో కూడుకున్నది. కాబట్టి, యువ నటీమణులను ఎవ్వరినీ పరిగణనలోకి తీసుకోలేదు. కానీ, అనుకోకుండా ఈ స్క్రిప్ట్ ఆలియా చేతికి వచ్చింది!” అంటూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. నిజానికి ఆలియా మొదటిచిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ కూడా ఇంతియాజ్ చూడలేదట. అయితే, ఆమెను మొదటిసారి ఏదో సందర్భంలో కలిసినప్పుడు.. ఆమెలో నిజమైన నటిని చూశాననీ, అందంతోపాటు ఆమెలోని భావోద్వేగ సామర్థ్యాలు కూడా తనను ఎంతో ఆశ్చర్యపరిచాయని ఇంతియాజ్ చెప్పుకొచ్చాడు. దాంతో, ‘హైవే’ స్క్రిప్ట్‌ను ఆమెకు అందించాడట.
కానీ, ఈ చిత్రం చేయడానికి ఆలియా కూడా సందేహించిందట. సినిమాలోని దాదాపు ప్రతి సన్నివేశంలోనూ కనిపించడం, తనతోనే ఎక్కువ షూటింగ్ ఉండటంతో ఆమె సినిమాను చేయలేనని మొదట చెప్పిందట. కానీ, ఇంతియాజ్ ఆమెను ఒప్పించి.. ఈ పాత్ర చేయించాడట. కట్ చేస్తే.. ‘హైవే’ చిత్రంతోనే ఆలియా కెరీర్ మలుపు తిరిగింది. ఈ చిత్రంలో ఆమె నటన.. విమర్శకుల ప్రశంసలను పొందింది. ఉత్తమ నటి (క్రిటిక్స్)గా ఫిలింఫేర్ అవార్డునూ అందుకున్నది. ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న బాలీవుడ్ బ్యూటీలలో ఒకరిగా దూసుకుపోతున్నది ఆలియా!