డిజిటల్ లైఫ్‌కి అలవాటుపడిన నేటి సమాజంలో నచ్చిన వ్యక్తిని పట్టుకోవడం కష్టంగానే ఉంటున్నది. అలాంటి వ్యక్తి మనసు గెలుచుకోవడం అంటే కత్తి మీద సామే అవుతున్నది. కట్టుకున్న భర్తను మెప్పించాలన్నా, కాబోయే శ్రీమతి అటెన్షన్ పొందాలన్నా గగనం అయిపోతున్నది!! అయితే, ఈ టిప్స్ పాటిస్తే.. నచ్చిన వ్యక్తికి ఇట్టే దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఆలస్యం ఓ లుక్కేయండి..
ఈ వ్యూహాన్ని ‘మిర్రరింగ్’ అంటారు. అంటే.. ఎదుటి వ్యక్తి ఇష్టాలను మీ ఇష్టాలుగా మార్చుకోవడం. వాళ్ల ప్రవర్తనను వీలైనంత వరకు అనుకరించడం. ఒక రకంగా చెప్పాలంటే.. వారిని మక్కీకి మక్కీ ఫాలో అవ్వడం అన్నమాట. ఎవరైనా సరే… తమలాంటి అభిరుచులు, ఇష్టాలు ఉన్నవాళ్లను ఇట్టే ఇష్టపడతారు. ఇదే విషయాన్ని న్యూయార్క్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 1999లోనే బయటపెట్టారు. ఒకరి ప్రవర్తనను మరొకరు అనుకరించినప్పుడు.. వారిలో ఎదుటివారి పట్ల ఇష్టం ఏర్పడుతుందని వెల్లడించారు.
రహస్యాలను పంచుకోవడం అనేది బంధాలను పెంచుకునే ఉత్తమ మార్గాల్లో ఒకటి. విశ్వసనీయత, నమ్మకం.. ఈ రెండిటికీ చాలామంది అధిక విలువ ఇస్తారు. కాబట్టి, మీ భాగస్వామి దగ్గర ఎలాంటి రహస్యాలు లేకుండా ఉండండి. వారి మనసును గెలుచుకోండి. ఇదే విషయం కాలిఫోర్నియా గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఫ్యామిలీ సైకాలజీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కళాశాల విద్యార్థులను జంటలుగా విభజించి, ఒకరినొకరు తెలుసుకోవాలని చెప్పింది. ఎలాంటి దాపరికాలు లేకుండా.. అన్ని విషయాలనూ పంచుకున్న జంటలు.. వారి చదువులు పూర్తయ్యేదాకా కలిసే ఉన్నారట.
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ సమయాభావ బాధితులే! అయినా.. భాగస్వామికోసం తగినంత సమయం కేటాయించాల్సిందే! ఒకరితో మరొకరు సమయం గడపడం వల్ల.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇందుకోసం ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా షికారుకు వెళ్లాల్సిన అవసరం లేదు. రోజూ కలిసి వాకింగ్‌కి వెళ్లడం, వంట చేయడంలో సహాయం అందించడం, కలిసి భోజనం చేస్తే చాలు. భాగస్వామితో బంధం బలపడుతుంది.