తను ఒక్క రీల్ చేస్తే.. మిలియన్ల కొద్దీ వ్యూస్. ఒక్క ఫొటో అప్లోడ్ చేస్తే.. లక్షలకొద్దీ లైక్స్. బాల్యం నుంచే హీరోయిన్గా రాణించాలని లక్ష్యంగా పెట్టుకొని.. సోషల్ మీడియా ద్వారా సెలెబ్రిటీ హోదా సంపాదించి.. తన లక్ష్యానికి చేరువైంది అతిథి త్రిపాఠి. ‘స్టార్ మా’లో రేపు ప్రారంభం కానున్న ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సీరియల్ ద్వారా తొలిసారి తెలుగు బుల్లితెరకు పరిచయం అవుతున్నది ఈ గోరఖ్‌పూర్ ముద్దుగుమ్మ. తన తొలి పరిచయపు ముచ్చట్లు..
మాది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. పుట్టింది, పెరిగింది అక్కడే. ప్రస్తుతం బీకామ్ చదువుతున్నా. తొలిసారిగా తెలుగు సీరియల్లో చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచీ హీరోయిన్ అవ్వాలనే కోరిక. అనుకోకుండానే ‘పల్లకిలో పెళ్లి కూతురు’ అవకాశం వచ్చింది. నాన్న కామర్స్లెక్చరర్. అమ్మ గృహిణి. ఒక తమ్ముడు ఉన్నాడు. అమ్మే నాకు తోడుగా ఉంటున్నది. ఈ సీరియల్లో నేను శశిరేఖ క్యారెక్టర్ చేస్తున్నాను. హైదరాబాద్ రాగానే తెలుగు నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా ఓ ట్రాన్స్
లేటర్‌ను కేటాయించారు. నాకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ.. వెంటనే పట్టేస్తున్నాను. రెండుమూడు నెలల్లోనే తెలుగులో అనర్గళంగా మాట్లాడతా.
నాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఇరవైలక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఫొటోలు, వీడియోలతో లక్షల్లో అభిమానులను సంపాదించుకుంటున్నాను. నేను అప్లోడ్ చేసే ప్రతి పోస్టుకు లక్ష లైకులు, వేల కామెంట్లు వస్తాయి. నా రీల్స్‌కు మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉంటాయి. ఇదంతా నేను సొంతంగా క్రియేట్ చేసుకున్న బ్రాండ్. మంచి నటిగా నిరూపించుకోవాలనే తపనతో టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నా. అందుకు ఫాలోవర్స్ రూపంలో అపారమైన అభిమానం సొంతం కావడంతో అనతికాలంలోనే సెలెబ్రిటీ హోదా పొందాను. ఈ సీరియల్‌ను విభిన్న భాషల్లో రూపొందిస్తున్నారు. బెంగాలీ, మలయాళం, మరాఠీ, కన్నడ, తమిళ, హిందీలలో కూడా ప్రసారం
అవుతున్నది. తెలుగులో నేను హీరోయిన్గా చేస్తున్నాను. డిగ్రీ తర్వాత ఏదైనా మంచి అవకాశం వస్తే చాలని అనుకున్న నాకు.. చదువు పూర్త వకుండానే ఇన్ని అవకాశాలు వచ్చాయి. నేను కొంచెం ఫుడ్డీ. చపాతీలోకి చికెన్ ఇష్టంగా తింటాను. మంచి డైట్ ఫాలో అవుతాను. రెగ్యులర్‌గా జిమ్ చేస్తాను. హీరోయిన్గా చాన్స్ వస్తే తప్పకుండా సినిమాల్లోకి వెళ్తాను. అది నా బిగ్గెస్ట్ డ్రీమ్.
నేను కాలేజ్ టాపర్‌ని. అందుకే, షూటింగ్లో గ్యాప్ దొరికితే చాలు పుస్తకం పట్టేస్తున్నాను. వచ్చే నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎలాగైనా ఫస్ట్‌క్లాస్ కొట్టేయాలి. ఇంట్లోవాళ్లకు నామీద చాలా నమ్మకం. కాబట్టే, సీరియల్స్ చేస్తానంటే ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. చదువును నిర్లక్ష్యం చెయ్యొద్దని మాత్రం హెచ్చరించారు. హైదరాబాద్ చాలా సేఫ్ సిటీ. ఇక్కడ నన్ను తమ ఆడబిడ్డలా చూసుకుంటున్నారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ‘పల్లకిలో పెళ్లి కూతురు’ నాకు వచ్చిన మొదటి అవకాశం. మొదటి సీరియల్‌కే ఇంత కేరింగ్.. నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ‘స్టార్ మా’ వాళ్లు నా ఎగ్జామ్స్ కోసమే షెడ్యూల్ మార్చేశారు.
రవికుమార్ తోటపల్లి