వంట చేయడం ఒకెత్తు! వండే క్రమంలో గోడలపై పడే నూనె మరకలను తొలగించడం మరో ఎత్తు! ఈ నూనె మరకలు ఓ పట్టాన వదలవు. అయితే, ఇంట్లో దొరికేవాటితోనే ఈ మరకలను సులభంగా తొలగించ వచ్చంటున్నారు నిపుణులు.
బేకింగ్ సోడా: గోడలపై నూనె మరకలను తొలగించడంలో ‘బేకింగ్ సోడా’ బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని.. దానికి కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. దీన్ని మరకలు పడ్డ ప్రదేశంలో రుద్ది.. 20 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రమైన గుడ్డను నీటిలో ముంచి.. మరకలున్న ప్రదేశంలో తుడిచేస్తే సరిపోతుంది.
వెనిగర్: వంటల్లో వాడే వెనిగర్.. గోడలపై నూనె మరకలను తొలగించడంలో సాయపడుతుంది. ఒక గ్లాసులో వెనిగర్, నీళ్లు సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఒక స్పాంజ్ సాయంతో.. మరకలున్న చోట ఈ వెనిగర్ మిశ్రమాన్ని అప్లయి చేయాలి. ఇరవై నిమిషాలు ఆగి.. మెత్తని వస్త్రంతో తుడిస్తే మరకలన్నీ మాయమైపోతాయి.
లిక్విడ్ డిష్ వాషర్: ఒక స్ప్రే బాటిల్లో కొద్దిగా లిక్విడ్ డిష్‌వాషర్‌ను తీసుకొని.. గోడలపై మరకలున్న చోట పిచికారీ చేయాలి. ఓ గంటపాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత వేడినీటితో కడిగి.. మెత్తని గుడ్డతో శుభ్రం చేస్తే సరి.
ఉప్పు: గ్లాసు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి, బాగా కలపాలి. ఈ నీటితో కడిగితే.. నూనె మరకలు ఇట్టే వదిలిపోతాయి.