అదృష్టం కోసమని కొందరు, అలంకరణలో భాగంగా ఇంకొందరు ‘లక్కీ’ మొక్కల్ని పెంచుకుంటున్నారు. చిన్నసైజు వెదురు వనంలా కనిపించే ఈ మొక్కల్ని.. ‘లక్కీ బాంబూ’ అని పిలుస్తారు. అయితే, వీటి సంరక్షణ కాస్త భిన్నంగా ఉంటుంది. చాలామందికి అవగాహన లేక.. ఈ మొక్కలు కొద్దిరోజులకే ఎండిపోతున్నాయి. లక్కీ బాంబూ మొక్కలు చాలా సున్నితమైనవి. చిన్నపాటి రసాయనాలు కలిసిన నీరు పోసినా ఎండిపోతాయి. క్లోరిన్, ఫ్లోరైడ్‌తో కలిసే సాధారణ కుళాయి నీరు కూడా వీటికి ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది.
నీటిలో క్లోరిన్ ఉన్నట్లయితే.. ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. కాబట్టి, ఈ మొక్కలకు ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే పోయాలి. ఆర్వో నీళ్లు కూడా పోయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కకు పరోక్ష సూర్యకాంతి అవసరం. రోజుకు 4 నుంచి 6 గంటలపాటు ఆరుబయట, నీడ పట్టున ఉంచాలి. నేరుగా సూర్యకాంతిలో పెట్టినా ఈ మొక్క ఎండిపోతుంది. లక్కీ బాంబూను ఎక్కువగా నీటిలోనే పెంచుతుంటారు. కాబట్టి, ప్రతి 7 నుంచి 10 రోజులకు నీటిని తప్పకుండా మార్చాలి.
నేలలో పెంచుతున్నట్లయితే.. కుండీలోని మట్టి తేమగా ఉండేలా చూసుకోవాలి. మట్టి పూర్తిగా మునిగేలా నీళ్లు పోయెద్దు. గది ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు లేకుండా చూసుకోవాలి. ఎయిర్ కండిషనర్లు, హీటర్లు మొక్కపై ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి, గది ఉష్ణోగ్రతలు 18 నుంచి 35 డిగ్రీల మధ్యలోనే ఉండాలి. వాడిపోయిన, పసుపు రంగులోకి మారిన ఆకులు కత్తిరించడం వల్ల.. కొత్త చిగుళ్లు వస్తాయి. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.