యాపిల్ ఉత్పత్తి ఏదైనా సరే.. మార్కెట్లోకి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఎందుకంటే వాటిపై ఉన్న మోజు అలాంటిది. ప్రతి ఉత్పత్తిలోనూ తమదైన ముద్ర వేసేలా యాపిల్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఎప్పుడో బుల్లి ట్రాకింగ్ డివైస్ ‘ఎయిర్ ట్యాగ్’ని రిలీజ్ చేసిన యాపిల్ ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘ఎయిర్ ట్యాగ్ 2’ని లాంచ్ చేసేందుకు సిద్ధం అవుతున్నది. రెండో తరం ఎయిర్ ట్యాగ్‌గా దీన్ని యాపిల్ అభివర్ణిస్తున్నది. ఫోన్, పర్సు, మరేదైనా విలువైన వస్తువుల్ని పోగొట్టుకోకుండా ఈ బుల్లి ట్రాకింగ్ ట్యాగ్‌ని వాడొచ్చు. ఈ కొత్త డివైస్‌లో యాపిల్ రెండో తరం Ultra-Wideband (UWB) చిప్ ఉపయోగించింది. ఇది AirTag కంటే మూడు రెట్లు ఎక్కువ ట్రాకింగ్ రేంజ్‌ను అందించనుంది. అంతేకాదు Air Tag 2లో రీడిజైన్ చేసిన బిల్ట్-ఇన్ స్పీకర్ ఉండొచ్చని టెక్నాలజీ విశ్లేషకుల అంచనా. కాబట్టి దీని వాడకం మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని చెబుతున్నారు. ఈ డివైస్‌కు B589 అనే కోడ్‌నేమ్ పెట్టారని, దీన్ని కొత్త స్మార్ట్ హోమ్ డిస్ప్లేతో కలిసి లాంచ్ చేయనున్నట్లు సమాచారం. 2021లో AirTag లాంచ్ అయినప్పటి నుంచి కొన్ని ప్రైవసీ సమస్యలు లేవనెత్తడంతో యాపిల్ విమర్శలను ఎదుర్కొన్నది. కొత్త AirTag 2లో ఎలాంటి ఎర్రర్స్ తలెత్తకుండా దీనిని పకడ్బందీగా రూపొందించిందట యాపిల్ సంస్థ.