ఆహా: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం : రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాదమ, ఆనీ, సాయి రామ్, అనిరుధ్ భాస్కర్ తదితరులు, దర్శకత్వం: పల్లె శ్రీకాంత్ రెడ్డి
90వ దశకం నేపథ్యంలో తెరకెక్కే కథలు.. మనసుకు దగ్గరవుతాయి. ఈ నోస్టాలజీకి తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్ కూడా తోడైతే.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. అలాంటి కథే.. హోమ్ టౌన్! రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో, ఐదు ఎపిసోడ్స్‌తో వచ్చిన ఈ తెలుగు వెబ్ సిరీస్.. హిట్‌టాక్ సొంతం చేసుకున్నది.
2003లో తెలంగాణలోని పల్లెటూరిలో సాగే కథ ఇది. హన్మంతుల గూడెంలో ఉండే ప్రసాద్ (రాజీవ్ కనకాల)ది మధ్యతరగతి కుటుంబం. భార్య (ఝాన్సీ), పిల్లలు శ్రీకాంత్ (ప్రజ్వల్ యద్మ), జ్యోతి (ఆనీ).. వీళ్లే అతని ప్రపంచం. గ్రామంలోనే ఓ ఫొటో స్టూడియోను నిర్వహిస్తూ.. దానిపై వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. అతని ఆదాయం తక్కువైనా.. ఆలోచనలు మాత్రం ఉన్నతంగా ఉంటాయి. ఎలాగైనా సరే.. కొడుకును పెద్దచదువుల కోసం అమెరికా పంపించాలని అనుకుంటాడు. అందుకోసం చిన్నప్పటినుంచే పాలసీ కడుతుంటాడు. కానీ, కొడుక్కు మాత్రం చదువు బుర్రకెక్కదు. స్కూల్ నుంచి కాలేజీ వరకు అత్తెసరు మార్కులతోనే నెట్టుకొస్తుంటాడు. ఇంజినీరింగ్ పూర్తయ్యేసరికి తన ఆలోచనలను సినిమారంగంవైపు మళ్లిస్తాడు. మరి.. కొడుకును విదేశాలకు పంపించాలనుకున్న ప్రసాద్ కల నెరవేరుతుందా? సినిమారంగంలోకి రావాలనుకున్న శ్రీకాంత్ ఆశ తీరుతుందా? అనేది మిగతా కథ. మధ్యతరగతి జీవితాల నడుమ సాగే ఈ డ్రామా.. అందరికీ కనెక్ట్ అవుతుంది. కొన్ని సన్నివేశాలు, ఎమోషన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి.