e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home జిందగీ ఓవర్‌ ద టాప్‌.. షీరోస్‌!

ఓవర్‌ ద టాప్‌.. షీరోస్‌!

ఓవర్‌ ద టాప్‌.. షీరోస్‌!

ఆమె.. సిసలైన కథానాయికగా మారింది. ఆమెపైనే కథలు పుడుతున్నాయి. ఆమె చుట్టూనే కథనాలు తిరుగుతున్నాయి. బ్యూటీక్వీన్‌ ముద్ర నుంచి బయటపడి, ఓటీటీ మహారాణి అన్న గుర్తింపును పొందుతున్నది. తెరపైనే కాదు, తెర వెనుకా ఎందరో షీరోలు ‘ఓవర్‌ ద టాప్‌’గా నిలుస్తున్నారు.

టన్నుల కొద్దీ హీరోయిజం, పేజీల కొద్దీ డైలాగులు, మూడు ఫైట్లు, ఆరు పాటలు.. దశాబ్దాలుగా వెండితెర సినిమా ఫార్ములా ఇది. అడపాదడపా స్త్రీ ప్రాధాన్య చిత్రాలు వచ్చినా, అదేదో మహిళాలోకాన్ని ఉద్ధరించడానికి నిర్మించినట్టుగా భావించేవారు. ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌) జమానా మొదలయ్యాక, సంప్రదాయ సూత్రాలకు కాలం చెల్లింది. అతివకు అవకాశం ఇస్తే అద్భుతాలు ఆవిష్కారమవుతాయని రుజువైంది. ఓటీటీ యుగం మొదలైన కొన్నాళ్లకే తెరను పంచుకునే స్థాయి నుంచి, తన ప్రాధాన్యాన్ని క్రమంగా పెంచుకున్నది మహిళ. దీంతో ఓటీటీ వేదికపై వస్తున్న వెబ్‌సిరీస్‌లు, చిత్రాల్లో మహిళల ప్రతిభకు పట్టం కడుతున్నారు.

- Advertisement -

అందరూ అతివలే!
ఆ మధ్య వచ్చిన ‘పెంగ్విన్‌’ నుంచి తాజాగా విడుదలైన ‘హసీన్‌ దిల్‌రుబా’ వరకు విమెన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలను, వెబ్‌ సిరీస్‌లను ఓటీటీ ప్రియులు ఆదరిస్తూనే ఉన్నారు. ‘బాంబే బేగమ్స్‌’, ‘ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌’, ‘బుల్‌బుల్‌’, ‘మహారాణి’.. ఇలా విమెన్‌ కంటెంట్‌ ఉన్న వెబ్‌సిరీస్‌లు హిట్‌ ఖాతాలోకి వెళ్తున్నాయి. దీంతో దర్శక, నిర్మాతలు అలాంటి చిత్రాలు నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ‘హుష్‌ హుష్‌’ మరో ప్రత్యేకతను సంతరించుకుంది. స్త్రీల జీవితాలే ఇతివృత్తంగా సిద్ధమవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌కు పనిచేస్తున్న వారంతా మహిళలే. స్త్రీల జీవితాల్లోని సంఘటనలను మేళవించి తెరకెక్కిస్తున్నారు. ‘ఇప్పటికైనా మార్పును స్వాగతిస్తున్నారు. ఇన్నాళ్లూ సినిమాల్లో మహిళలకు రెండో ప్రాధాన్యమే ఉండేది. ఓటీటీతో ప్రేక్షకుల తీరు మారిపోయింది. లీడ్‌ రోల్‌ ఎవరన్నది కాదు. కథా కథనాలు ఎలా ఉన్నాయని చూస్తున్నారు. ఫలితంగా విమెన్‌ ఓరియెంటెడ్‌ కంటెంట్‌ పెరుగుతున్నద’ని చెప్పుకొచ్చింది ‘హుష్‌ హుష్‌’లో నటిస్తున్న కృతికా కామ్రా.

అదే ఒరవడి
విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘షేర్నీ’ ఒక ఆడపులి చుట్టూ తిరిగే కథ. మనుషుల ప్రాణాలు తీస్తున్న ఆ మృగాన్ని ఎలాగైనా ప్రాణాలతో కాపాడాలనుకునే మహిళా ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అందులో నాయిక. ఇంటికి దూరంగా ఎక్కడో అడవిలో విధులు నిర్వర్తించే స్త్రీగా విద్యా
బాలన్‌ నటన ‘షేర్నీ’లో మరో వైవిధ్య కోణం.

‘హ్యూమన్‌ కంప్యూటర్‌’ శకుంతలా దేవి బయోపిక్‌ కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. టైటిల్‌ రోల్‌లో విద్యాబాలన్‌ నటన విమర్శకుల ప్రశంసలనూ అందుకుంది. వెండితెరపై విమెన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు ప్రాణం పోసిన విద్యాబాలన్‌ ఓటీటీలోనూ కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రల్లో మెరుస్తున్నది. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీదేవి జీవిత కథ ఆధారంగా ఓటీటీకెక్కిన ‘మహారాణి’ వెబ్‌సిరీస్‌ సైతం నారీవాణిని వినిపించింది. వారం వారం సరికొత్త కథలతో ఓటీటీలో విడుదలవుతున్న పలు వెబ్‌సిరీస్‌లు స్త్రీ శక్తికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి.

టాలీవుడ్‌ తారకలు
బాలీవుడ్‌లో స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటీమణులు ఓటీటీలో మరింతగా మెరుస్తున్నారు. తెలుగు చిత్రాల్లో చాలావరకు హీరో సరసన ఆడిపాడిన వయ్యారి భామలు, ఓటీటీకి వచ్చేసరికి తమలోని కొత్త కోణాన్ని ప్రదర్శిస్తున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా, పంజాబీ భామ కాజల్‌, కేరళ కుట్టి సమంత ఇప్పుడు వెబ్‌సిరీస్‌లలో కథంతా తమ చుట్టూ తిరిగే పాత్రలను పోషిస్తున్నారు. తమన్నా తొలిసారిగా తాను నటించిన వెబ్‌ సిరీస్‌ ‘లెవన్త్‌ అవర్‌’లో వ్యాపారాన్ని కాపాడుకునే సామ్రాజ్ఞిగా అలరించింది. ‘నవంబర్‌ స్టోరీ’ వెబ్‌సిరీస్‌లోనూ విభిన్నమైన పాత్ర పోషించి హిట్‌ కొట్టింది. తమన్నా నటించిన ఈ రెండు వెబ్‌సిరీస్‌లూ కథానాయిక చుట్టూ తిరిగినవే. ‘లైవ్‌ టెలికాస్ట్‌’తో కాజల్‌ అగర్వాల్‌ ఓటీటీ జర్నీ మొదలైంది. మొదటి ప్రయత్నంలోనే తన ఖాతాలో హిట్‌ వేసుకున్న కాజల్‌, మరికొన్ని విమెన్‌ ఓరియెంటెడ్‌ స్క్రిప్ట్‌లు వింటున్నదట. ‘ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2తో అరంగేట్రం చేసిన సమంత ఒక్కసారిగా ఓటీటీ సూపర్‌స్టార్‌ అయింది. మహిళా విజయానికి ఇదంతా ఆరంభమే.

సబ్జెక్ట్‌ ప్రాణం

అభిమానుల అంచనాలు, బాక్సాఫీస్‌ కొలమానాలు లేకపోవడంతో ఓటీటీపై వచ్చే సినిమాలు, వెబ్‌
సిరీస్‌ల విషయంలో నిర్దేశకులు కొత్త ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. హీరో ఇమేజ్‌ చట్రం నుంచి బయటికొచ్చి కథనే హీరోగా భావిస్తున్నారు. సబ్జెక్ట్‌ను నమ్ముకొని విలక్షణ ప్రయోగాలు చేస్తున్నారు. హిట్‌, ఫ్లాప్‌ల సంగతి అటుంచితే, విభిన్న కథాంశాలతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రూపొందుతుండటం విశేషం. ‘పిట్ట కథలు’, తెలుగులో డబ్‌ అయిన ‘పావ కథైగల్‌’ తదితర చిట్టి ‘చిత్రాల’ కథావస్తువు కూడా మహిళే! ప్రేక్షకులకు ఆనందాన్ని, దర్శకులకు విజయాన్ని, నిర్మాతలకు కాసుల్ని పంచుతున్న విమెన్‌ ఫార్ములా రానున్న రోజుల్లోనూ ‘ఓవర్‌ ద టాప్‌’ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఓవర్‌ ద టాప్‌.. షీరోస్‌!
ఓవర్‌ ద టాప్‌.. షీరోస్‌!
ఓవర్‌ ద టాప్‌.. షీరోస్‌!

ట్రెండింగ్‌

Advertisement