ప్రపంచంలో అందరినీ వేధించే సమస్య తలనొప్పి. తరచూ పలకరించే ఈ సమస్య ఒక్కోసారి తీవ్రంగా ఇబ్బందిపెడుతుంది. సాధారణంగా మనకు అన్ని తలనొప్పులూ ఒకేలా అనిపిస్తాయి. కానీ వీటిలో దాదాపు 200 పైగా రకాలు ఉన్నాయి. చిన్నపాటి తలనొప్పి వచ్చినా మనం ఏ పనీ సరిగా చేయలేం. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా మెదడుతో ఆలోచించే చేస్తాం. ఆ మెదడు ఉన్న తలే అనారోగ్యంగా ఉంటే ఏం చేయగలం? అసలు ఈ తలనొప్పులలో తీవ్రమైనవి ఎన్ని, వాటి లక్షణాలు ఏంటి, తలపోటు రావడానికి గల కారణాలు, వాటిని నిర్ధారించే పద్ధతులు,అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
తలనొప్పులను ప్రధానంగా మూడు రకాలుగా విభజించారు. ఒకటి ప్రైమరీ హెడేక్, రెండోది సెకండరీ హెడేక్, మూడోది క్రేనియల్
న్యూరాల్జియా లేదా ఫేషియల్ పెయిన్స్
ప్రైమరీ తలనొప్పి
మెదడులోని రసాయనాలలో సమతుల్యం లోపించడం వల్ల ఏర్పడే తలనొప్పులను ప్రాథమిక లేదా ప్రైమరీ హెడేక్ అంటారు. ప్రాథమిక తలనొప్పి నేరుగా తలలోనే ఏర్పడుతుంది. దీనికి కారణం కూడా తలలోనే ఉంటుంది.
సెకండరీ తలనొప్పి
ఈ తరహా తలనొప్పి బయటి కారణాలతో వస్తుంటుంది. అంటే తలలో గడ్డలు ఏర్పడటం లేదా తలకు గాయం కావడం, పక్షవాతం రావడం తదితర కారణాల వల్ల తలనొప్పి పుడుతుంది.
క్రేనియల్ న్యూరాల్జియా
తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైనప్పుడు వచ్చే తలనొప్పిని క్రేనియల్ న్యూరాల్జియా లేదా ఫేషియల్ పెయిన్స్ అంటారు. ఈ రకమైన తలనొప్పి వచ్చినప్పుడు శరీరంలోని ఇతర భాగాలలో కూడా నొప్పి వస్తుంది.

ప్రైమరీ తలనొప్పులు
మైగ్రేన్: తలనొప్పి రకాలలో మైగ్రేన్ చాలా సాధారణమైనది. ఇది టీనేజీ పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. యువకుల్లో కంటే యువతుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. సాధారణంగా మైగ్రేన్ అనేది ఒక వయసు వచ్చాక దానంతట అదే తగ్గిపోయే అవకాశం ఉన్నా.. అది వచ్చినప్పుడు మాత్రం నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకే వైపు వస్తుంటుంది. కొన్నిసార్లు ఇరుపక్కలా కనిపిస్తుంది. మైగ్రేన్ తలెత్తినప్పుడు నాలుగు గంటల నుంచి మొదలుకొని కొన్ని సందర్భాల్లో 72 గంటల వరకు వేధిస్తుంది. తలనొప్పితోపాటు వికారం, వాంతులు; కాంతిని చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి పెరగడం, నిద్రపడితే తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో కళ్లకు చిత్ర విచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు, మెరుపులూ (ఫ్లాషింగ్ లైట్స్) కనిపిస్తాయి.
కారణాలు
నిర్ధారణ పద్దతులు
మైగ్రేన్‌ను నిర్ధారించేందుకు నిర్దిష్టమైన పరీక్షలేమీ లేవు. పైన పేర్కొన్న లక్షణాలు, మాటిమాటికీ తలనొప్పి తిరగబెడుతుండటం వంటి లక్షణాల ఆధారంగా దీన్ని నిర్ధారణ చేస్తారు. మైగ్రేన్‌కు రెండు రకాల చికిత్స ఉన్నది. మొదట తీవ్రమైన తలనొప్పిని తక్షణం తగ్గించడానికి చేసే చికిత్స. రెండోది తలనొప్పి మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి చేసే దీర్ఘకాలిక చికిత్స.
చికిత్స: మైగ్రేన్ సమస్యను మందులతోపాటు యోగా, ధ్యానం (మెడిటేషన్) వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్‌తో కూడా చాలావరకు నయం చేయవచ్చు. మందులతో తగ్గని కొన్ని మైగ్రేన్లకు ఇటీవల బొటాక్స్ ఇంజెక్షన్‌ను ఉపయోగించి చికిత్స చేస్తున్నారు.
క్లస్టర్ హెడేక్: ఇది అరుదుగా తలెత్తే తలనొప్పి. కంటి పాపల వెనక బాగా తీవ్రమైన నొప్పితో వస్తుంది. రెండు మూడు గంటల పాటు బాధిస్తుంది. ఒక్కోసారి ఇది మాటిమాటికీ తిరగబెడుతూ కొద్దిరోజుల పాటు వస్తుంటుంది. రోజూ ఒకేవేళకు కనిపిస్తూ ఉంటుంది. ఏడాదిలో 8-10 వారాల పాటు రావచ్చు. ఒకసారి అలా వచ్చాక మళ్లీ ఏడాది పాటు రాకపోవచ్చు. కానీ, ఆ మరుసటి ఏడాది కూడా మొదటిసారి వచ్చినట్లే మళ్లీ 8-10 వారాలపాటు అదే వేళకు వచ్చే అవకాశం ఉంటుంది.
చికిత్స: క్లస్టర్ తలనొప్పికి తక్షణ చికిత్సగా ఆక్సిజన్‌ను అందిస్తారు. లేదా ట్రిప్టాన్ మందులను ముక్కుద్వారా పీల్చేలా చేస్తారు. దీనితో మొదట వచ్చే నొప్పిని తగ్గిస్తారు. ఇక దీర్ఘకాలికంగా ఈ తరహా తలనొప్పిని రాకుండా చేయడానికి చికిత్స అందించాల్సి ఉంటుంది.
టెన్షన్ హెడేక్: తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారికి విపరీతమైన తలనొప్పి రావడం చాలామందికి అనుభవమే. ఈ నొప్పి తలకు ఇరువైపులా లేదా అన్నివైపులా ఉంటుంది. కొన్నిసార్లు దీర్ఘకాలం వేధిస్తుంది. ఒత్తిడి తీవ్రత ఆధారంగా తలనొప్పి కూడా పెరుగుతుంది. ఒక్కోసారి రోజులు, నెలల తరబడి కనిపిస్తుంది. మార్కెట్లో దొరికే సాధారణ తలనొప్పి మందులతో దీన్ని తగ్గించుకోవచ్చు.
క్రానిక్ డైలీ హెడేక్: దీర్ఘకాలం పాటు రోజూ వచ్చే మైగ్రేన్, టెన్షన్ తల నొప్పులను తగ్గించుకోడానికి తరచూ నొప్పి నివారణ మందులు వాడటం వల్ల ఈ తరహా తలనొప్పి వస్తుంటుంది. వీళ్లకు ఎర్గాటమైన్స్, ఆన్లైన్ సెట్రాన్ వంటి మందులు ఇచ్చి చికిత్స చేయాల్సి ఉంటుంది.
ప్రైమరీ కాఫ్ హెడేక్: తీవ్రంగా దగ్గడం లేదా చాలాసేపు గట్టిగా నవ్వడం, గట్టిగా తుమ్మడం వంటి చర్యల వల్ల అకస్మాత్తుగా వచ్చే తలనొప్పిని ప్రైమరీ కాఫ్ హెడేక్ అంటారు. ఇది అరుదుగా వస్తుంది.
ప్రైమరీ స్టాబింగ్ హెడేక్: తలలో కత్తితో పొడిచినట్లుగా ఈ నొప్పి ఉంటుంది. అందుకే దీనిని ప్రైమరీ స్టాబింగ్ హెడేక్ అంటారు. సెక్సువల్ ఇంటర్ కోర్స్‌తో ఇది లింకై ఉంటుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు భావప్రాప్తి పొందే సమయంలో అకస్మాత్తుగా వస్తుంది. సెక్స్ ముగిశాక వచ్చే ఈ తలనొప్పి పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎర్గాటమైన్ లేదా ఇండోమెథాసిన్ వంటి మందులను సెక్స్‌కు ముందుగా వాడటం ద్వారా ఈ తరహా తలనొప్పిని నివారించవచ్చు. ఇక దీర్ఘకాలం పాటు ఈ నొప్పి రాకుండా ఉండటానికి ప్రత్యేకమైన మందులను వైద్యులు సూచిస్తారు.
హిప్నిక్ హెడేక్: హిప్నిక్ హెడేక్ నిద్రలో మొదలై నిద్రలేచిన తరువాత కూడా దాదాపు 15-30 నిమిషాలపాటు ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారిలో, ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగడం లేదా లిథియమ్ మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్స.
ఇతర తలనొప్పులు
ఇవే కాకుండా న్యూ డైలీ పర్సిస్టింగ్ హెడేక్ (ఎన్డీపీహెచ్), ప్రైమరీ థండర్ క్లాప్ హెడేక్, క్లస్టర్ హెడేక్స్ ఇలా చాలా రకాల తలనొప్పులు ఉన్నాయి. కొన్నిసార్లు పంటినొప్పి, చెవినొప్పి, గొంతునొప్పి, కళ్ల నొప్పులు కూడా తలపోటుకు దారితీస్తాయి. తలనొప్పి వచ్చినప్పుడు అంతగా ఆందోళన పడకూడదు. అయితే మాటిమాటికీ తలనొప్పి వస్తుంటే మాత్రం డాక్టర్‌ను కలిసి, కారణాలను తెలుసుకుని, తగిన చికిత్స తీసుకోవాలి.
సెకండరీ తలనొప్పులు
మెనింజైటిస్: ఇది మెదడు పొరల్లోని ఒక పొరకు వచ్చే ఇన్ఫెక్షన్. ఇందులో తలనొప్పితో పాటు జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోయి ఉండటం, వెలుగు చూడటానికి ఇబ్బంది పడటం, శబ్దాలు వినలేపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మెనింజైటిస్ సమస్యను సీఎస్ఎఫ్ (మెదడులోని ద్రవం – సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్)ని పరీక్షించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు.
బ్రెయిన్ ట్యూమర్: మెదడులో గడ్డలు ఏర్పడటం వల్ల తలనొప్పి వస్తుంది. గడ్డ పరిమాణం పెరుగుతున్న కొద్దీ నొప్పికూడా పెరుగుతూ పోతుంది. వారాల తరబడి కొనసాగుతుంది. నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పితోపాటు వాంతులు ఉంటాయి. ఒక్కోసారి ఫిట్స్ కూడా రావచ్చు. ముందుకు ఒంగినప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు అధికమవుతుంది.
ఇంట్రాక్రేనియల్ హేమరేజ్ తలనొప్పి: తల (పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం చూడొచ్చు. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సీటీ స్కాన్ పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు.
టెంపోరల్ ఆర్థరైటిస్: ఇది 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతల వద్ద నొక్కినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండటం వంటివి ఈ టెంపోరల్ అర్థరైటిస్ లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్ఆర్ చాలా ఎక్కువగా ఉండటాన్ని చూసి దీన్ని నిర్ధారణ చేస్తారు.
గ్లకోమా హెడేక్: కంటిగుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల ఈ రకమైన తలనొప్పి వస్తుంది. ఇందులో తలనొప్పితోపాటు వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది నెమ్మదిగా చూపును హరించి వేస్తుంది. అందుకని తలనొప్పి కనిపించగానే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. కాగా.. సర్వైకల్ నర్వ్స్ ఒత్తిడికి లోనైనప్పుడు, పక్క మీద తలగడ సరిగా లేనప్పుడు కూడా తలనొప్పి వస్తుంటుంది.

క్రేనియల్ న్యూరాల్జియా రకం తలనొప్పులు
మన తలలోని పుర్రెను వైద్య పరిభాషలో క్రేనియమ్ అంటారు. ఇందులో కీలకమైన 12 నరాలు ఉంటాయి. వీటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఉద్వేగానికి లేదా ఉద్రిక్తతకు లోను కావడం వల్ల వచ్చే తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియా అంటారు. న్యూరా.. అంటే నరం అని అర్థం. అలాగే ఆల్జియా అంటే నొప్పి. అందుకని ఈ తరహా తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియాగా వ్యవహరిస్తుంటారు.
ఆక్సిపెటల్ న్యూరాల్జియా: ఎక్కువ తీక్షణమైన కాంతిని చూసినప్పుడు తలలోని ఆక్సిపెటల్ అనే ప్రాంతంలో ఉండే నరాలు ఉద్రిక్తతకు గురై తలనొప్పి రావచ్చు. ఇలా వచ్చే తలనొప్పిని ఆక్సిపెటల్ న్యూరాల్జియా అంటారు.
ట్రెజెమినల్ న్యూరాల్జియా: దవడ వరకు వెళ్లే తల నరాలలో ప్రధానమైనది ఈ ట్రైజెమినల్ నర్వ్. ఇది తీవ్రంగా ఉద్రిక్తం చెందినప్పుడు ఏ పదార్థాన్ని కూడా తినలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంది. కనీసం గుడ్డులోని మెత్తటి పదార్థాన్ని నమిలినా భరించలేనంత తీవ్రంగా తలనొప్పి వస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గతంలో ఈ నొప్పితో బాధపడ్డారు. ఒక చిన్న శస్త్రచికిత్సతో ఈ నొప్పిని తగ్గించవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డాక్టర్ బి.చంద్రశేఖర్ రెడ్డి
చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్
బంజారాహిల్స్, హైదరాబాద్…?
-మహేశ్వర్‌రావు బండారి