అక్కడ అయ్యవారు- శ్రీ జంబుకేశ్వరుడు!
అమ్మవారు- శ్రీ అఖిలాండేశ్వరీ దేవి!
వీరు కొలువు దీరిన క్షేత్రం – ‘జంబుకేశ్వరం’. పంచభూత క్షేత్రాలుగా పిలిచే ఐదు శైవ క్షేత్రాల్లో జంబుకేశ్వరం ఒకటి. జలలింగ క్షేత్రమైన దీనికే – ‘తిరువనైకాయ్’, ‘తిరువనైకావల్’ అని పేర్లు. తమిళనాడు రాష్ట్రంలో శ్రీరంగానికి కేవలం మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామివారికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయంలో స్వయంగా అమ్మవారు పూజలు చేయడం విశేషం. ప్రతిరోజూ మధ్యాహ్న సమయంలో ఆలయంలోని అర్చకుల్లో ఒకరు స్త్రీ దుస్తులను ధరించి, స్త్రీ రూపంలో వెళ్లి స్వామివారికి పూజలను నిర్వహిస్తారు. ఈ పూజలను భక్తులు కూడా దర్శించవచ్చు. అనంతరం అదే అర్చకుడు గోవును పూజిస్తారు. ఈ పూజ ముగించిన అనంతరం ఏనుగు గర్భాలయంలోకి ప్రవేశించి జంబుకేశ్వర స్వామివారిని అభిషేకించి, పూలమాలను సమర్పిస్తుంది. ఈ ఆచారం వెనుక ఒక పురాణగాథ ప్రచారంలో ఉంది.
పూర్వం లోకక్షేమాన్ని కోరి పార్వతీదేవి పరమేశ్వరుణ్ని గురించి కైలాసంలో తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు భూలోకానికి వెళ్లి తపస్సు చేయమని పార్వతికి సూచించాడు. దీనితో పార్వతీదేవి భూలోకానికి వచ్చి.. అఖిలాండేశ్వరి పేరుతో కావేరి నదీ తీరానికి చేరుకుంది. కావేరి నది నీటితో శివలింగాన్ని తయారు చేసుకుని స్వయంగా పూజించడం ప్రారంభించింది. కొంతకాలానికి శివుడు అఖిలాండేశ్వరి తపస్సును మెచ్చి జలలింగ రూపంలో కొలువుదీరినట్లు కథనం. అలాగే పూర్వం ఒక ఏనుగు కూడా స్వామి వారిని అర్చించి ముక్తి పొందినట్లు కథనం. ఈ గాథకు నిదర్శనంగా నేటికీ ఈ క్షేత్రంలో శ్రీ జంబుకేశ్వర స్వామికి అర్చకులు స్త్రీ రూపం ధరించి అర్చనలు చేస్తుండటం విశేషం.
కాగా, జలలింగ రూపుడు అనేందుకు నిదర్శనంగా శ్రీ జంబుకేశ్వర స్వామి కొలువుదీరి ఉన్న పానవట్టం నుంచి స్వామివారి లింగం చుట్టూ నీరు ఊరుతూ ఉంటుంది. నీరు బొట్లు బొట్లుగా కారుతూ ఉంటుంది. పానవట్టం చుట్టూ వస్ర్తాన్ని కప్పుతారు. ఈ వస్త్రం పూర్తిగా నీటితో తడిసిపోతుంది. ఈ విధంగా నీరు ఊరడాన్ని భక్తులు ఎప్పుడూ దర్శించవచ్చు. శ్రీ జంబుకేశ్వర స్వామి వారిని భక్తులు జంబు నాథర్, అప్ప లింగేశ్వరార్, నీర్ తిరళ్ నాథర్, అనైక్క అన్నాల్, వెన్నావళీశ్వరార్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.