ఇస్లాం ఐదు మూలస్తంభాలలో హజ్ యాత్ర అత్యంత విశిష్టమైనది. ఇది కేవలం భౌతిక ప్రయాణం కాదు, అంతరంగ శోధన. శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా కాబా గృహాన్ని దర్శించాలని ఖురాన్ బోధిస్తుంది. ‘ఎవరైతే అక్కడి వరకు చేరుకోగలరో, వారు అల్లాహ్ కోసం ఆ గృహాన్ని సందర్శించడం విధి’ అన్న దైవవాణిని అనుసరిస్తూ ఏటా లక్షలాది మంది సౌదీ అరేబియా వైపు అడుగులు వేస్తారు. ప్రవక్త ముహమ్మద్ (స) సెలవిచ్చినట్లు, చిత్తశుద్ధితో చేసే హజ్ యాత్ర మనిషిని పాపాల నుంచి విముక్తుడిని చేస్తుంది. ఆ యాత్ర ముగించుకుని వచ్చే భక్తుడు, ఇప్పుడే తల్లి గర్భం నుంచి పుట్టిన పసిపాప అంత పవిత్రంగా మారుతాడన్న నమ్మకం ప్రతి గుండెలోనూ నూతన ఉత్తేజాన్ని నింపుతుంది.
హజ్ యాత్రికులు బయలుదేరే సమయంలో కనిపించే దృశ్యాలు హృదయాన్ని కదిలిస్తాయి. కొడుకుని హత్తుకుని దీవిస్తున్న తల్లి, తండ్రి తలపై చేయి వేసి కన్నీళ్లతో వీడ్కోలు పలుకుతున్న కుమార్తె, తన భర్తను దైవ రక్షణకు అప్పగిస్తూ మౌనంగా ప్రార్థిస్తున్న భార్య.. ఈ దృశ్యాలలో భక్తి ఉంది, తపన ఉంది. ప్రియమైన వారు దైవం పిలుపు అందుకొని వెళ్తున్నందుకు గర్వపడుతూనే, ఆ వియోగం కలిగించే బాధతో రాలే కన్నీళ్లు అక్కడి వాతావరణాన్ని పవిత్రంగా మారుస్తాయి.
హజ్ యాత్ర కేవలం ఆర్థిక వనరులపై ఆధారపడి ఉండదు. అది దైవ నిర్ణయం, ఒక ‘బులావా’ (పిలుపు). ఎంతో మంది ధనవంతులు హజ్‌కు వెళ్లలేకపోతుంటారు. మరికొందరికి ఊహించని విధంగా దారులు వాటంతట అవే తెరుచుకుంటాయి. యాత్రా బృందంలో చేరలేకపోయిన వారి మనసులో ఒకటే ఆవేదన.. ‘ఓ నా ప్రభువా! మాకు ఆ అదృష్టం ఎప్పుడు కలుగుతుంది?’ అన్న నిశ్శబ్ద రోదన ప్రతి విశ్వాసి గుండెలో వినిపిస్తుంది. హజ్ అంటే కేవలం బాహ్య ప్రయాణం కాదు.
ఈ ఏడాది వెళ్లలేకపోయిన వారు నిరాశ చెందాల్సిన పని లేదు. హృదయంలో ఆ ఆకాంక్షను సజీవంగా ఉంచుకోవడమే విశ్వాసానికి (ఈమాన్) గుర్తు. నేడు వెనుకబడిన వారు రేపటి బృందంలో చేరవచ్చు. ఆ కరుణామయుడు మనందరికీ తన గృహాన్ని దర్శించే భాగ్యాన్ని, నిష్కల్మషమైన ప్రేమతో ఆయన దర్బారులో హాజరయ్యే అదృష్టాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.
-ముహమ్మద్ ముజాహిద్, 96406 22076