ఫోన్లో ఏ ఫొటో క్లిక్ మనిపించినా.. గూగుల్ ఫొటోస్లోకి సింక్ అయిపోతాయ్. ఇలా ఈ ఏడాది మొత్తం ఎన్నో ఫొటోలు గూగుల్ గ్యాలరీలో చేరిపోయి ఉంటాయ్. వాటిల్లో ముఖ్యమైన సందర్భాల్ని ఒకసారి తిరిగి చూడాలనిపిస్తే!! ‘రీక్యాప్’ చేయడమే. అందుకోసం గూగుల్ ఫొటోస్ తన యాప్లో ‘రీక్యాప్’ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఏడాది మొత్తం ఫొటోలన్నీ తీసుకొని, వాటిని ఒక చక్కటి వీడియోగా మార్చేయొచ్చు.
అలా ఏడాదిలో మీరు గడిపిన ముఖ్యమైన క్షణాలను రీక్యాప్ చేసుకోవచ్చు. గూగుల్ ఏఐ టెక్నాలజీ ఈ రీక్యాప్ వీడియోను క్రియేట్ చేస్తుంది. AI మీ ఫొటోలను అన్నిటినీ విశ్లేషించి, అందులోని ముఖ్యమైనవాటిని గుర్తిస్తుంది. తర్వాత వాటన్నిటినీ కలిపి ఓ వీడియోగా తయారు చేస్తుంది. ఈ వీడియోలో మీ ఫొటోలకు సంబంధించి కొన్ని వివరాలు ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఎన్ని ఫొటోలు తీశారు.. ఎన్ని దేశాలు సందర్శించారు.. ఎన్ని సెల్ఫీలు దిగారు.. లాంటివి అన్నమాట. ఎందుకు ఆలస్యం.. గూగుల్ ఫొటోస్ యాప్లో రీక్యాప్ ఆప్షన్ ఎంచుకోండి! 2024 జ్ఞాపకాల వీడియోను చూసేయండి. మీ ప్రయాణాన్ని స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకోండి.