darpan ahluwalia | బాల్యం నుంచే సామాజిక స్పృహ అధికం. జీవితం పదిమందికీ ఉపయోగపడాలన్న సంకల్పం. అందుకు తగ్గట్టే.. ఓ ఎన్జీవోను స్థాపించారు. ఎంబీబీఎస్ చేసి డాక్టర్‌గా ఎంతోమందికి వైద్యం అందించారు. అయినా ఏదో వెలితి. సమాజ సేవలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదన్న అసంతృప్తి. ఆ ఆలోచనలే సివిల్స్ వైపు నడిపించాయి. రోగికి బదులుగా సమాజానికే చికిత్స చేసే అవకాశాన్ని దక్కించుకొన్న ఆ యువ ఐపీఎస్ అధికారి దర్పణ్ అహ్లువాలియా. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం నిర్వహించనున్న‘73వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్’లో కవాతు కమాండర్‌గా వ్యవహరించబోతున్నారామె. ఈ సందర్భంగా ‘జిందగీ’తో దర్పణ్ పంచుకున్న అనుభవాలు..
మాది పంజాబ్‌లోని మొహాలి. మా తాతనరేందర్సింగ్ అహ్లువాలియా పంజాబ్ పోలీస్ శాఖలో డీఎస్పీగా పనిచేశారు. ఆయన తర్వాత మా కుటుంబం నుంచి డిపార్ట్మెంట్లోకి వచ్చింది నేనే. సామాజిక సేవ అంటే నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టం. డాక్టర్‌గా రోగులకు సేవ చేసేందుకే ఎంబీబీఎస్ చదివాను. అంతకుముందే ‘పింక్ లింక్’ పేరుతో ఓ ఎన్జీవోను స్థాపించాను. రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి ముందస్తు అవగాహన కల్పించేవాళ్లం, పరీక్షలు చేసేవాళ్లం. అయినా, ఏదో అసంతృప్తి! ఒక వైద్యురాలిగా నా దగ్గరికి వచ్చే వారికి మాత్రమే చికిత్స చేయగలను. అదే ఒక ఐపీఎస్ అధికారి అయితే, సమాజంలోని ఎన్నో రకాల రుగ్మతలకు చికిత్స అందించవచ్చు. ఆ నమ్మకంతోనే సివిల్స్‌వైపు మళ్లాను. డాక్టర్‌గా పనిచేస్తూనే.. రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. నా ఉద్దేశంలో సివిల్ సర్వీసెస్ అనేది విస్తృత స్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఒక మంచి వేదిక. ఎవరైనా అడిగితే, నా ఎన్జీవోకు కొనసాగింపుగా మరింత సేవ చేసేందుకే ఐపీఎస్ అయ్యానని చెబుతాను. సమాజంలోని అన్ని అంశాలనూ స్పృశించే గొప్ప అవకాశం పోలీసులకు మాత్రమే ఉందని కచ్చితంగా చెప్పగలను.
మా అమ్మ పేరు నవనీత్ అహ్లు వాలియా. తను ఆర్థికవేత్త. ప్రస్తుతం, టీచర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచీ అమ్మే నాకు ప్రేరణ. అమ్మే నా బలం. ఏ విషయంలో అయినా నాకు వందశాతం మద్దతు ఇస్తుంది. బలమైన సంకల్పం ఉంటే అమ్మాయిలు దేన్నయినా సాధించగలరని తను నమ్ముతుంది. ఆ విశ్వాసానికి వాస్తవ రూపం.. నా విజయం. నేషనల్ పోలీస్ అకాడమీ శిక్షణకూడా నాకు అంతే స్ఫూర్తిని అందించింది.
ఐపీఎస్ శిక్షణ ఎంతో కఠినతరమైంది. ఇక్కడ అంతా సమానమే. మహిళలు, పురుషులు అన్న వివక్షకు తావులేదు. అందరూ, అన్నీ చేయాల్సిందే. మహిళలకు ఫిజికల్ ట్రైనింగ్ మాత్రం కొంత కష్టంగా అనిపిస్తుంది. అదీ మొదట్లోనే. ట్రైనర్ సాయంతో ఆ పరిమితినీ అధిగమిస్తాం. భవిష్యత్తులో, ఒక ఐపీఎస్ అధికారిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు తగ్గట్టుగానే మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు కావాల్సి ఉంటుంది. ఐపీఎస్ శిక్షణలో నేర్చుకునే ప్రతి అంశం మనల్ని మరింత బలంగా మారుస్తుంది. ప్రత్యేకించి ఫిజికల్ ట్రైనింగ్‌లో ఆయుధాలను ఎలా వాడాలో తెలుసుకుంటాం. ఏ ఆయుధాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వినియోగించాలో నేర్చుకుంటాం. రైఫిల్ షూటింగ్.. మనకు ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలన్నదీ పరోక్షంగా నేర్పుతుంది. మనసును మించిన ఆయుధం లేదన్న విషయాన్ని గుర్తుచేస్తుంది. కష్టాలతో, బాధలతో మన దగ్గరికి వచ్చే ప్రజలకు న్యాయం చేయగలగాలి. అప్పుడే మన కొలువుకు సార్థకత. క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉన్నప్పుడే అది సాధ్యం. ఆ నైపుణ్యాలనూ ఇక్కడ బోధిస్తారు.
సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం ఎంతో కష్టమైన వ్యవహారమనీ, ఆ విజయం వెనుక ఎన్నో ఫార్ములాలు ఉంటాయనీ చాలామంది అంటూ ఉంటారు. నా దృష్టిలో, సివిల్స్ విజయానికి ఎలాంటి ఫార్ములాలూ ఉండవు. రోజూ ఎన్ని గంటలు చదవాలన్నది పూర్తిగా మన ఆసక్తి, శక్తిసామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ఓ విద్యార్థిలా సమాజాన్ని అధ్యయనం చేయాలి. నిత్య పరిణా మాలను విశ్లేషించుకోవాలి. ఇష్టంతో, ఏకాగ్రతతో చదివితే.. కొద్ది గంటలైనా ఎంతో ప్రయోజనకరం. నేను రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివేదాన్ని. అయితే, ఈ ఎనిమిది గంటలు మాత్రం ఎంతో క్రమశిక్షణగా ఉండాలి. ఇలా, నేను రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. దివంగత ఐపీఎస్ అధికారి కె.ఎస్.వ్యాస్ పేరుమీద ఏర్పాటయిన ట్రోఫీని అందుకోవడమూ ఆనందంగా ఉంది.
నేషనల్ పోలీస్ అకాడమీలో అడుగుపెట్టిన రోజే ఎంతో గర్వంగా ఫీలయ్యాను. ఈ రోజు బెస్ట్ ప్రొబేష
నర్గా నన్ను నేను నిరూపించుకోవడం.. పరేడ్ కమాండర్‌గా కవాతును ముందుకు నడిపించడం.. మరింత సంతోషాన్ని ఇస్తున్నది. మనసు పెట్టి చేసే ఏ పనిలోనైనా విజయం వరిస్తుందని త్రికరణ శుద్ధిగా నమ్ముతాను నేను.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
pneumonia | పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
mahesh bigala | చదివిన బడిని మరువని ప్రవాసీ.. కోటి రూపాయలు పెట్టి మరీ అభివృద్ధి
jai bhim | చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఎవరు? ఆమెకు ఎలా అవకాశం వచ్చింది?
హైదరాబాదీలు ఇష్టంగా లాగించేస్తున్న ఈ కొత్తరకం స్వీట్ గురించి తెలుసా?
హద్దులు చెరిపి.. సరిహద్దుల వరకూ!