వేల రూపాయల ఖరీదు పెట్టి పట్టు చీరలు కొనుక్కుంటాం. షాపు వాళ్లు చెప్పిన దాన్ని బట్టి ఓహో ఆహా అని మనమూ అనుకుంటాం. కానీ అది అసలైనదో కాదో తెలుసు కునేందుకు కొన్ని మార్గాలున్నాయి. దాన్ని బట్టి పట్టు సంగతి ఇట్టే పట్టేయొచ్చు!
పట్టుకుంటే పట్టులా ఉండటం అసలైన పట్టు లక్షణం. జోక్ కాదు. నిజంగానే ఇది ఓ పరీక్షే. చేతితో పట్టుకుంటే మెత్తగా, మృదువుగా జారిపోయేలా ఉండటం పట్టు చీరల స్వభావం. చేతి వేళ్ల మధ్య వస్ర్తాన్ని ఉంచి కొద్దిగా రుద్దితే వెచ్చదనం రావడం కూడా దీని సహజ గుణం. అలా వేడి రాకుండా ఉంటే అది ఫేక్ సిల్క్.
సిసలైన వస్ర్తాన్ని కాంతికి లేదా లైట్‌కి ఎదురుగా ఉంచినప్పుడు అది వేరే వర్ణాన్ని ప్రతిబింబిస్తుంది. మనం ఏ కోణంలో చూస్తున్నాం అన్నది లెక్కలేదు. తప్పకుండా సాధారణంగా చూసిన దానికన్నా రెండు వేరు వేరు రంగుల్లో అది కనిపిస్తుంది. అదే ఆర్టిఫీషియల్ పట్టుని చూస్తే ఉన్నది ఉన్నట్టు అదే రంగులో కనిపించడమో లేదా ఇంకా డల్ అవడమో జరుగుతుంది.
చేతితో నేసిన పట్టు చీరల జరీని చూసి కూడా అసలా నకిలీనా అన్నది గుర్తు పట్టొచ్చు. వెండి, లేదా బంగారు కోటింగ్ ఉన్న తీగలతో అంచు వస్తుంది. అంతేకాదు, ఆ నేతలో అక్కడక్కడా పోగులు లేవడం కొంచెం నేత మిస్ అవడంలాంటి తేడాలు కూడా ఉంటాయి. చేతితో నేయడం వల్ల అవి ఏర్పడతాయి. ఇక, జరీనేతల లోపలి వైపు వదులుగా దారాలు వేలాడవు. అలా నైలాన్ దారాలు వదులుగా వేలాడుతుంటే అది మంచి పట్టు కాదు.
సిల్క్ మార్క్ అన్నది కూడా అసలైన పట్టుచీరను కనుగొనేందుకు మంచి మార్గం. సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వారి సర్టిఫికెట్ ఉందంటే, ఇక ఆ చీరకు తిరుగు లేనట్టే లెక్క.
మన దగ్గర ఉన్న చీరలు నిజమైనవా కావా అన్నది కూడా పరీక్షించుకోవాలంటే, చీర అడుగు భాగం నుంచి చిన్న దారం పోగును తీసి కాల్చి చూస్తే జుట్టు కాలిన వాసన రావడం, బూడిద అవడం జరిగితే అది నిజమైనది. అదే ముద్దలా ముడుచుకుపోయి ప్లాస్టిక్ వాసన వస్తే ఫేకే. అలాగే కాస్త తడి చేసినా పట్టు చీర ఒకలాంటి సువాసన లేదా చెట్టు పుట్టల వాసన వస్తుంది. అదే ఆర్టిఫీషియల్ అయితే రసాయనాలు, ప్లాస్టిక్ వాసన వస్తుంది.