స్మార్ట్ఫోన్ల తయారీలో సరికొత్త ఆవిష్కరణలకు చిరునామా గా నిలిచింది గూగుల్. ఎప్పటికప్పుడు పిక్సెల్‌లో టెక్నాలజీ మార్పుల్ని పీక్స్‌కి తీసుకెళ్తుంది. ఈ క్రమంలో కొత్తగా పిక్సెల్ 10 సిరీస్‌ను లాంచ్ చేసింది. వీటిల్లో గూగుల్ వినూత్నమైన ఏఐ ఫీచర్లను జోడించింది. వీటితో పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు ఏఐ కోచ్‌లా మారనున్నాయి. ఈ మొత్తం ప్రాసెస్‌కి జీవం పోసేది కొత్త టెన్సార్ చిప్సెట్. దీంతో ఫోన్ మెరుపు వేగంతో పనులు చేస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచుతుంది. పిక్సెల్స్ ఫీచర్స్‌లో ప్రధానమైనవి ఇవే..
ఇదో ఏఐ ఆధారిత పర్సనల్ అసిస్టెంట్. మీ రోజువారీ పనులు, వర్కవుట్లు, అపాయింట్మెంట్స్, క్యాలెండర్ ఈవెంట్లు, ైక్లెమేట్ అప్డేట్స్.. ఇలా అన్నిటినీ ఫోన్ స్క్రీన్‌పై చూపుతుంది. ఉదయం లేవగానే రాత్రి హాయిగా నిద్రపోయారో లేదో చెబుతుంది. ఆ రోజు చేయాల్సిన పనుల్ని లిస్ట్‌గా అందిస్తుంది. అంతేనా.. మీరు ఎక్కువగా చూడడానికి ఇష్టపడే యూట్యూబ్ వీడియోలు, ప్లేలిస్టులను కూడా సూచిస్తుంది.
ఇది జీమెయిల్, క్యాలెండర్ లాంటి అప్లికేషన్లను ట్రాక్ చేస్తుంది. అవసరాలకు తగ్గట్టుగా వ్యక్తిగత సలహాలను ఇస్తుంది. ఉదాహరణకు, మీరు ఎవరికైనా మెయిల్ పంపాలనుకుంటే, అందులో ఏమేం రాయాలో చెబుతుంది.
వచ్చీరాని భాషలో ఫోన్ మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉందని బాధపడే రోజులు పోయాయి. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఏఐతో పనిచేసే వాయిస్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌తో ఎవరితోనైనా.. ఏ భాషలోనైనా ఫోన్ మాట్లాడొచ్చు. మీరు కాల్ మాట్లాడుతుండగానే.. మీ మాటలు అవతలి వ్యక్తికి మీరు కోరుకున్న భాషలో తర్జుమా అయి వినిపిస్తాయి. అదీ మీ వాయిస్‌కు చాలా దగ్గరి గొంతుకతో వినిపిస్తుందన్నమాట!
వాయిస్ ట్రాన్స్‌లేట్‌తో పాటు మరో ఆసక్తికరమైన ఫీచర్‌ని కూడా జోడించింది గూగుల్. అదే టేక్ ఎ మెసేజ్. కొన్ని సందర్భాల్లో కాల్స్ లిఫ్ట్ చేయడానికి వీలు పడదు. అప్పుడేం చేస్తాం.. వాయిస్ మెయిల్‌ని ఎనేబుల్ చేస్తున్నాం. ఇకపై అలా కాకుండా.. మీరు కాల్ మిస్ చేసినా, అటెండ్ చేయలేకపోయినా… ఫోనే ఆటోమెటిక్‌గా లిఫ్ట్ చేస్తుంది. అవతలి వ్యక్తి చెప్పేది వింటూ.. మీకు లైవ్‌లోనే ట్రాన్స్క్రిప్షన్ చేస్తుంది. దాంతో ఆ కాల్ ఇంపార్టెంటా? కాదా? మీకు తెలిసిపోతుంది. వెంటనే మీరు రెస్పాండ్ అవ్వొచ్చు. అంతేకాదు.. ఏవైనా ముఖ్యమైన మిస్డ్ కాల్స్ ఉంటే.. కాల్ బ్యాక్ రిమైండర్స్ కూడా పెట్టేస్తుంది.
స్మార్ట్ఫోన్లలో జర్నలింగ్ అనేది ఒక కొత్త ట్రెండ్. మన ఆలోచనలు, జ్ఞాపకాల్ని డైరీలా రాసుకునే ఈ అలవాటును ప్రోత్సహించడానికి ఆపిల్ ఇప్పటికే జర్నల్ యాప్‌ను పరిచయం చేసింది. ఇదే తరహాలో గూగుల్ కూడా పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో కొత్త ‘పిక్సెల్ జర్నల్’ యాప్‌ను లాంచ్ చేసింది. ఏఐ సపోర్ట్‌తో గతంలో రాసిన ఎంట్రీలు, జ్ఞాపకాలు, పెట్టుకున్న లక్ష్యాల్ని రివ్యూ చేస్తుంది. మీరు మర్చిపోయినా.. ఏఐ నిత్యం ఆయా టార్గెట్స్‌పై అప్డేట్స్ అడుగుతుంది. జర్నల్ ఎంట్రీలతో పాటుగా ఫొటోలు, లొకేషన్లను జత చేయొచ్చు. రోజువారీ మూడ్స్‌ని రికార్డ్ చేసుకోవచ్చు. జర్నల్ లోని మెమొరీస్, ప్రైవేట్ థాట్స్‌కి రక్షణగా గూగుల్ లాక్ ఫీచర్‌ని యాడ్ చేసింది. దీంతో యాప్‌ని అనధికారికంగా ఎవరూ ఓపెన్ చేయలేరు.