ప్రాణం నిలుపుతుందని తాగుతున్నారు. ప్రాణం తీస్తుందని కనిపెట్టలేదెవరూ. ఆ మోసం ఎంత ప్రమాదమో
మొదటగా గుర్తించింది. అధికారుల్ని హెచ్చరించింది. కోర్టుల్ని ఆశ్రయించింది. మొద్దు నిద్రలో ఉన్న వ్యవస్థల్ని నిద్రలేపి పిల్లల తల్లిదండ్రులకు నిద్రలేని రాత్రులు దూరం చేసింది. ఇప్పుడు ‘ఓఆర్ఎస్’ అని నమ్మించే పానీయాలు మార్కెట్లో ఉండవు. ఓఆర్ఎస్ అనుకునేలా ఏ ఉత్పత్తులూ విక్రయించకూడదని చట్టం సాధించింది డా. శివరంజని సంతోష్. పోరాడి గెలిచిన ప్రజల డాక్టర్.. జిందగీతో పంచుకున్న ఆరోగ్య ముచ్చట్లు.
మా నాన్న డాక్టర్. మా తాతగారూ డాక్టర్. వాళ్ల ప్రభావంతో వైద్య వృత్తిలోకి వచ్చాను. జిప్మర్లో మెడిసిన్ చదివాను. మా ప్రొఫెసర్లు క్రమశిక్షణ, నైతికత, నిజాయితీని కలగలిపిన వైద్య విజ్ఞానం బోధించారు. అందుకే ప్రతి శనివారం ప్రజల కోసం ఫస్ట్ ఎయిడ్ అవేర్నెస్ కార్యక్రమం చేపడతాను. రోగులకు జాగ్రత్తలు చెబితే ఎవరికీ హాస్పిటల్‌కి రావాల్సిన అవసరం ఉండదని మా వాళ్లు అంటారు.
ప్రతి పది అసహజ మరణాల్లో ఆరు మరణాలకు కారణం సరైన సమయంలో ప్రథమ చికిత్స అందకపోవడమే. సరైన వైద్య చికిత్స అందిస్తే ఆరు చావులను ఆపగలం. నా దాకా వచ్చిన వాళ్లనే నేను కాపాడగలను. ఏదైనా సమస్యతో బాధపడే పిల్లల్ని హాస్పిటల్ దాకా చేర్చే బాధ్యత తల్లిదండ్రులదే. ఆ సమయంలో ప్రథమ చికిత్స బాధ్యత కూడా వాళ్లదే. అందుకే పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులకు ప్రథమ చికిత్స గురించి కచ్చితంగా అవగాహన కల్పిస్తాను. ఊపిరి తీసుకోవడం, గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు సీపీఆర్ చేయడం నేర్పిస్తాను.
సీపీఆర్ ఎలా చేయాలో మ్యాన్ కిన్స్ మీద తల్లిదండ్రులతో ప్రాక్టీస్ చేయించాను. నా దాకా రాలేని పేద తల్లిదండ్రుల కోసం బస్తీలకు పోయి నేర్పించాను. ఏదైనా సమస్య వచ్చి బిడ్డ శ్వాస తీసుకోవడం ఆగిపోతే ఈ పద్ధతిలో పిల్లల్ని బతికించుకోవచ్చు. జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు, ఫిట్స్ , పాము కాటు, గొంతులో ఏదైనా అడ్డంపడటం, ముక్కులో వస్తువులు దూర్చుకుంటే, పిన్నీసులు, గుండీలు, బటన్ బ్యాటరీలు మింగితే ఏం చేయాలి? ఏం చేయకూడదో అవగాహన కల్పిస్తున్నాను.
పదేళ్ల క్రితం.. విరేచనాలతో బాధపడేవాళ్ల శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. వాళ్లు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) తాగాలి. ఓఆర్ఎస్ ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. కానీ, వాళ్ల ఆరోగ్యం ఇంకా క్షీణిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందో తేల్చాలని పిల్లలకు ఇచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు తెమ్మని తల్లిదండ్రులను అడిగాను. వాళ్లు యాపిల్బొమ్మ ఉన్న ఓఆర్ఎస్ బ్రాండ్ ప్యాకెట్‌ను తెచ్చి చూపించారు. మెడికల్ షాపుల్లో ఓఆర్ఎస్ఎల్ టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. విరేచనాలు అవుతున్న వారికి ‘ఓఆర్ఎస్’ను పోలినవి తాగిస్తున్నారు.
వాంతులు, విరేచనాలు అయ్యే పిల్లలకు అవి తాగించకూడదు. ఆ ప్యాకెట్ వెనుక డబ్ల్యూహెచ్‌వో సూచించిన దానికంటే పది రెట్లు అధికంగా చక్కెర ఉందని గమనించాను. చక్కెర ఎక్కువ ఉంటే విరేచనాలు ఇంకా ఎక్కువ అవుతాయి. అసలే డీహైడ్రేషన్ సమస్యతో ఉంటే.. మందుల షాపు వాళ్లు ఇచ్చిన ప్యాకెట్‌తో ఆ సమస్య ఇంకా పెరుగుతోంది. డీహైడ్రేషన్ ఎక్కువైతే బీపీ తగ్గి, అవయవాలకు రక్త సరఫరా తగ్గిపోతుంది. ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గే ప్రమాదముంది. అలాంటి సందర్భంలో ప్రాణాలు పోవచ్చు. వీటిని డాక్టర్లు కూడా తాగమని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు వాటిని ఓఆర్ఎస్ అనే భ్రమపడుతున్నారు. ‘ఓఆర్ఎస్’ను పోలినవి తాగితే విరేచనాలు పెరుగుతాయి. పై ప్రాణాలు కింది నుంచే పోయే ప్రమాదం ఉంది.
మార్కెట్లో ఉన్న ‘ఓఆర్ఎస్’ను పోలిన ప్యాకెట్ల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం మొదలు పెట్టాను. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)కు పిల్లల సమస్యలపై ఫిర్యాదు చేశాను. వాళ్లు ఈ విషయం ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఈ పానీయాలకు ఆ పేరు ఎలా అనుమతించారని, చాలామంది మిస్ లీడ్ అవుతున్నారని, పిల్లలు పడే ఇబ్బందులు వివరిస్తూ ఎఫ్ఎస్ఎస్ఏఐకి లేఖ రాశాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు పాటించని ఏ పానీయాలనూ ‘ఓఆర్ఎస్’ను పోలిన పేర్లతో విక్రయించరాదని ఆ సంస్థ ఆదేశాలిచ్చింది. కానీ కొద్ది కాలానికే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుని, ‘ఇది ఓఆర్ఎస్ కాదు’ అని ముద్రించి అమ్ముకునేందుకు అనుమతించింది. ఆ ప్రొడక్ట్‌ల మీద ఉన్న గమనిక (డిస్ైక్లెమర్)ని ప్రజలు చదవట్లేదని గుర్తించాను. ‘ఉమెన్ పీడియాట్రిషన్స్ ఫోరం’ మద్దతుతో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టాను. ప్రజల సమస్యను పట్టించుకోవాలని, పిల్లల ప్రాణాలు కాపాడాలని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను.
మన దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి వంద మందిలో 13 మరణాలకు విరేచనాలే కారణం. ‘ఓఆర్ఎస్’ అని భ్రమింపజేసే పేర్లతో పానీయాల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ భారత ప్రభుత్వానికీ, ఆరోగ్య శాఖకు లేఖలు రాశాను. ఒబేసిటీ, డయాబెటిస్ బాధితులు పెరుగుతున్న దేశంలో ఇలాంటి ఉత్పత్తులను ప్రజలపై వదలడం చాలా ప్రమాదమని వివరించాను. ఆ ప్రయత్నాలు, పోరాటాలు ఫలించాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు పాటించే ఉత్పత్తులు మాత్రమే ఓఆర్ఎస్ పదాన్ని ఉపయోగించాలని, దానిని బ్రాండ్ పేరుకి ఉపయోగించుకోరాదని, అలాగే ఓఆర్ఎస్ అక్షరాలకు ముందు గానీ, వెనుక గానీ మరో అక్షరాన్ని చేర్చిన ఉత్పత్తులకు అనుమతి నిరాకరిస్తూ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉత్తర్వులిచ్చింది. హైకోర్టులో కేసు నడుస్తుండగానే ఈ ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం డ్రగ్ రెగ్యులేషన్‌ను అమలు చేస్తూ మోసపూరితమైన పేర్లతో ఔషధాలు మార్కెట్లోకి రాకుండా అరికడితే పిల్లల ఆరోగ్యం, పెద్దల ఆనందాలకు పెద్ద భరోసా.
నా దాకా రాలేనివాళ్లు, సీపీఆర్, ప్రథమ చికిత్స నేర్చుకోవాలనుకునేవాళ్ల కోసం Dr Sivaranjani’s Easy Health పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. ఇన్‌స్టాగ్రామ్‌లో Dr Sivaranjani Santosh హ్యాండిల్ ద్వారా పిల్లల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నాను. మందులు రాయడం, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం వృత్తిలో భాగం చేసుకున్నాను.
-డాక్టర్ శివరంజనీ సంతోష్