గురుశిష్యులిద్దరు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి రైలులో ప్రయాణిస్తూ ఉన్నారు. ‘ఎవరినైనా బేరీజు వేయాలంటే ఎలా?’ అని అడిగాడు శిష్యుడు. ‘సమయం వచ్చినప్పుడు సమాధానమిస్తాన’ని చెప్పాడు గురువు. కొద్దిసేపయ్యాక శిష్యుడికి అదే రైలులో ప్రయాణిస్తున్న వారు పరిచయమయ్యారు. వారు తాము వెళ్తున్న ఊరు వారేనని చాలా సంతోషించాడు. మాటామాటా కలిసింది. వారు అభిమానంగా తమ దగ్గర ఉన్న పండ్లను, మంచి నీళ్లను, మిఠాయిలను శిష్యుడికి ఇచ్చారు. అతను చాలా సంతోషించాడు.
చిన్నగా గురువు దగ్గరికి వచ్చి ఆ ఊరి వారు చాలా మంచివారని, కొత్త వ్యక్తుల పట్ల విశేష ఆదరాభిమానాలను చూపుతారని పొగిడాడు. ‘అలాగా’ అని తల ఊపి ఊరుకున్నాడు గురువు. ఇంతలో వాళ్లంతా దిగాల్సిన స్టేషన్ రానే వచ్చింది. రైలు దిగుతూ ‘మీలాంటి పెద్దల సత్సంగం మాకెంతో ఆనందాన్నిచ్చింద’ని పదేపదే చెప్పి వెళ్లిపోయారు ఆ ఊరివాళ్లు. ఇక తమ సామానులన్నీ ప్లాట్‌ఫాంపైకి దించాడు శిష్యుడు. కార్యనిర్వాహకులు వచ్చి తమను తీసుకుని వెళ్తారని ఎదురుచూడ సాగాడు.
రైలు కదిలి వెళ్లిపోయింది. కాసేపటికి నిర్వాహకులు వచ్చి నమస్కరించి సామానులన్నీ తీసుకుని కారులో ఎక్కిస్తూ ఉండగా ఒక సంచి కనిపించలేదు. దొంగలెవరో ఎత్తుకు పోయినట్లు గుర్తించాడు శిష్యుడు. గురువును పక్కకు పిలిచి విషయం చెప్పిన శిష్యుడు బాధగా ‘ఈ ఊరి వాళ్లు దొంగలు’ అన్నాడు. గురువు చిరునవ్వు నవ్వి ‘రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఊరివాళ్లు ఎంతో మంచివాళ్లు, ఇంత మంచివారిని ఎక్కడా చూడలేదన్నట్లు చెప్పావు. ఇప్పుడేమో ఈ ఊరి వాళ్లంతా దొంగలంటున్నావు.
ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఒకటుంది. మనం ఒక సంఘటన చూసి, ఒక్క పార్శ్వాన్ని చూసి దేన్నీ, ఎవ్వరినీ బేరీజు వేయకూడదు. సంపూర్ణంగా చూడాలి. అప్పుడే వాస్తవం తెలుస్తుంది. పాక్షికంగా చూసినప్పుడు మనకు కనిపించిందే వాస్తవం అనుకుంటాం. మిగిలిన కోణాల్లో చూడలేదు కాబట్టి చూసిందే నమ్మి దాని ప్రకారమే ఎదుటి వారిపట్ల వ్యవహరిస్తాం’ అని వివరించాడు. ‘నిజమే… ఒక్క పార్శ్వాన్ని మాత్రమే చూస్తే మనకు గోచరించేది పాక్షిక సత్యమే కానీ, సంపూర్ణ సత్యం కాదు’ అని తెలుసుకుని గురువుతోపాటు కారు ఎక్కాడు శిష్యుడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు,
93936 62821