హీరోయిన్గా రాణించడం అంటే అంత సులువు కాదని అంటున్నది బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా. భావోద్వేగాల పరంగా, శారీరకంగానూ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నది. మిస్ ఆసియా పసిఫిక్ కిరీటాన్ని గెలుచుకొని.. బాలీవుడ్టో టాప్ హీరోయిన్గా ఎదిగింది ఈ హైదరాబాదీ. 2019లో వచ్చిన ‘కాఫిర్’ అనే వెబ్ సిరీస్ షూటింగ్ సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా మీడియాతో పంచుకున్నది.
“కాఫిర్ కోసం ఓ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఎంతో కష్టపడ్డాం. ఒక సమయంలో వాంతులు కూడా చేసుకున్నా!” అంటూ చెప్పుకొచ్చింది. “ఈ టీవీ వెబ్ సిరీస్‌లోని అత్యాచారం సన్నివేశం నాకింకా గుర్తుంది. అందులో నటించడం చాలా కష్టంగా అనిపించింది. ఆ సీన్ తర్వాత నా కాళ్లు, చేతులు విపరీతంగా వణికిపోయాయి. సీక్వెన్స్ షూట్ చేశాక వాంతులు కూడా చేసుకున్నా. అలాంటి సీన్లు చేయడం భావోద్వేగపరంగా, శారీరకంగా చాలా కష్టంగా ఉంటాయి” అంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నది.
‘కాఫిర్’లోని ‘కైనాజ్’ పాత్ర.. తాను ఒక వ్యక్తిగా ఎదగడానికి సహాయపడిందనీ, నిజ జీవితంలో తల్లిగా మారడానికి ముందే తనలో తల్లి భావాలను నింపిందని ఆ పాత్రను ఆకాశానికెత్తింది. షెహనాజ్ పర్వీన్ అనే పాకిస్థాన్ మహిళ ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా ‘కాఫిర్’ టీవీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. 2019లో ప్రసారమైన ఈ సిరీస్‌లో దియా మీర్జా, మోహిత్ రైనా ప్రధాన పాత్రలు పోషించారు. మొత్తం 8 ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్‌కు నాటి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఈ సిరీస్‌ను సినిమాగా మార్చి ఇటీవల ఓటీటీలో రిలీజ్ చేశారు.