ఒక మంచి ఉద్యోగి.. విధులను సమర్థంగా నిర్వహిస్తాడు. కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు అదనపు బాధ్యతలు తీసుకుంటాడు. కానీ, ఆ బాధ్యతల్లోనే నిరంతరం కొనసాగుతూ.. శ్రమ దోపిడీకి గురవుతుంటాడు. ఈ పరిస్థితినే కార్పొరేట్ నిపుణులు ‘క్వైట్ ప్రమోటింగ్’ అని పిలుస్తున్నారు. ఇది ప్రమోషన్ ఇవ్వకుండా, జీతం పెంచకుండా.. ‘క్వైట్’గా చాకిరి చేయించుకోవడమేనని అభివర్ణిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగి కెరీర్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ‘క్వైట్ ప్రమోటింగ్’ అనే మాట తరచుగా వినిపిస్తున్నది. సాధారణంగా ఒక ఉద్యోగికి పదోన్నతి లభించినప్పుడు.. బాధ్యతలతోపాటు హోదా, వేతనం కూడా పెరుగుతుంది. కానీ, క్వైట్ ప్రమోటింగ్లో సంస్థ యాజమాన్యం.. ఉద్యోగికి ఉన్నత స్థాయి పనులను అప్పగిస్తుంది. కానీ, ఆ పదవికి అందాల్సిన గౌరవం, ఆర్థిక ప్రయోజనాలను పక్కన పెట్టేస్తుంది. ఇలా.. కేవలం పని భారం మాత్రమే పెరగడంతో ఉద్యోగి వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
క్వైట్ ప్రమోటింగ్ అనేది ఉద్యోగికి తెలియకుండానే జరుగుతుంది. కొన్ని లక్షణాల ఆధారంగా ఈ విపరీత ధోరణిని గుర్తించవచ్చు.
క్వైట్ ప్రమోటింగ్కు ప్రధాన కారణం.. ఖర్చు తగ్గించుకోవడం. ఒక కొత్త ఉద్యోగిని నియమించాలన్నా, ప్రమోషన్ ఇవ్వాలన్నా కంపెనీకి అదనపు ఖర్చు అవుతుంది. అదే పనిని సమర్థుడైన పాత ఉద్యోగితోనే చేయిస్తే.. కంపెనీకి లాభం చేకూరుతుంది. కొన్నిసార్లు బడ్జెట్ లేకపోవడం, కంపెనీ పునర్నిర్మాణంలో ఉండటం వల్ల కూడా ఇలా చేస్తుంటారు.
క్వైట్ ప్రమోటింగ్ అనేది ఉద్యోగికి మొదట్లో ఒక మంచి గుర్తింపులానే అనిపిస్తుంది. కానీ, కాలక్రమేణా తీవ్రమైన ప్రతికూలతలకు దారితీస్తుంది.
ఏ ఉద్యోగి అయినా.. తాను క్వైట్ ప్రమోటింగ్కు గురవుతున్నానని అనిపిస్తే.. కొన్ని చర్యలు తీసుకోవడం మంచిది.