వానకాలం వచ్చిందంటే కాస్త చెట్టూ చేమా ఉన్నచోటల్లా పుట్టగొడుగులు పుట్టుకొస్తుంటాయి. మన దగ్గరయితే గొడుగుల్లా ఉండేవీ, కోడి గుడ్డు ఆకృతిలో ఉండేవీ చూస్తుంటాం. తెలుపు, నలుపు, చాక్లెట్… ఇలా విభిన్న రంగుల్లో కనిపిస్తుంటాయివి. అయితే ఇక్కడ పగడపు రంగులో గుండ్రటి బంతిని పోలి కనిపిస్తున్నది ‘క్లాత్రస్ రూబర్’గా పిలిచే ఒక రకం పుట్టగొడుగులు. వీటి ఆకృతిని బట్టి ‘రెడ్ కేజ్ ఫంగస్(ఎరుపు రంగు పంజరం)’గానూ పిలుస్తారు.
ఇవి పుట్టినప్పుడు తెల్లగా గుండ్రంగా సాధారణ పుట్టగొడుగులా కనిపించినా కొద్ది రోజుల్లోనే పై పొర ఊడిపోయి ఈ ఆకృతి బయటికి వస్తుందట. ఎరుపు, గులాబీ, నారింజ రంగుల్లో ఇవి కనిపిస్తుంటాయి. ఇటలీలో తొలిసారిగా గుర్తించిన ఇవి ఐరోపా, పశ్చిమాసియా దేశాలతో పాటు మన దగ్గర తమిళనాడులోని నీలగిరి అడవుల్లోనూ పెరుగుతాయి. పడిపోయిన చెట్లు, గడ్డి పెరిగే ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. విపరీతమైన దుర్వాసన కలిగి ఉండటం వల్ల ఈ రకం పుట్టగొడుగులు తినేందుకు పనికిరావు.