నమస్తే మేడం. నా వయసు 25 సంవత్సరాలు. నాకిప్పుడు మూడోనెల. కుంకుమ పువ్వు వేసుకుని పాలు తాగితే పిల్లలు మంచి రంగుతో పుడతారట కదా? అయితే ఇలా ఏ నెలలో తాగాలి. అలాగే పుట్టే బిడ్డ చక్కటి రంగుతో ఉండాలంటే ఇంకా నేను ఏం తినాలి? తెలుపగలరు.
మనం ఏ రంగులో ఉంటే అదే రంగులో పిల్లలు పుడతారు. మన జన్యుకణాలను బట్టే పిల్లల రంగు అన్నది ఏర్పడుతుంది. అయినా మనం ఉండే ఉష్ణ దేశాల్లో అంత రంగును ఆశించాల్సిన అవసరం ఏమీ లేదు. కుంకుమ పువ్వు తాగితే తెల్లగా పిల్లలు పుట్టడం అన్నది జరగదు. మీ భార్యాభర్తల రంగే కాదు, మీ కుటుంబంలో, మీ భర్త కుటుంబంలో ఉండే వాళ్ల రంగు మీద కూడా పుట్టే బిడ్డల శరీర వర్ణం ఏర్పడటం అన్నది ఆధారపడుతుంది. మీరిద్దరూ ఒక రంగులో ఉన్నా కూడా, ఇంట్లో వాళ్ల రంగుని బట్టి కూడా పాపాయి రంగు ఏర్పడవచ్చు. అయితే కుంకుమ పువ్వు పాలలో కలుపుకొని తాగితే నష్టం ఏమీ లేదు. అలాగని మీరు విన్నట్టు ప్రత్యేకమైన లాభం కూడా ఏమీ లేదు. కాబట్టి బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని కోరుకోండి. పండ్లు తినండి. ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోండి. సమతులాహారం తీసుకోండి. మసాలాలు, అధిక చక్కెరలు, జంక్ఫుడ్లకు దూరంగా ఉండండి. నీళ్లు బాగా తాగండి. ఆరోగ్యాన్ని మించిన అందం ఇంకేం ఉంటుంది చెప్పండి.
-డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్