ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఏటా 20 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆరు లక్షలకుపైగా క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా.. మహిళల్లో రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లు అత్యంత ప్రబలంగా కనిపిస్తున్నాయి. చర్మ క్యాన్సర్లు కూడా ఆడవాళ్లను పట్టిపీడిస్తున్నాయి. అయితే, మహిళలు ఉపయోగించే అనేక సౌందర్య ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి కనుగొన్నది. అమెరికా లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించిన ఈ సర్వే వివరాలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఈ సర్వేలో భాగంగా అమెరికాకు చెందిన 64 మంది మహిళలను ఎంచుకున్నారు. వారు నిత్యం ఉపయోగించే సబ్బులు, లోషన్లు, షాంపూ, కండిషనర్, స్కిన్ లైట్నర్, ఐలైనర్, ఐలాష్ గ్లూ లాంటి దాదాపు 1,143 ఉత్పత్తులను పరిశీలించారు. అందులో 53 శాతం మంది ఫార్మాల్డిహైడ్ లాంటి క్యాన్సర్ కారకాలను విడుదల చేసే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించినట్టు కనుగొన్నారు. అనేక ఉత్పత్తుల్లో ‘ఫార్మాల్డిహైడ్’ను విరివిగా వాడుతున్నారనీ, ఇది క్యాన్సర్ కారకమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
దీన్నుంచి విడుదలయ్యే వాయువులు క్యాన్సర్‌ను కలగజేయడమే కాకుండా.. శరీరంపై దద్దుర్లు, జుట్టు, గోళ్లపైనా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. వీటిని అలాగే వాడితే దీర్ఘకాలంలో రొమ్ము క్యాన్సర్‌తోపాటు గర్భాశయం, అండాశయ క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ 2009లోనే ఫార్మాల్డిహైడ్‌ను కాస్మెటిక్ పదార్థంగా నిషేధించిందని పలువురు పరిశోధకులు గుర్తుచేశారు. అయినా అనేక సౌందర్య ఉత్పత్తుల సంస్థలు ఇష్టారాజ్యంగా వీటిని వాడుతున్నాయని చెబుతున్నారు.
అయితే ఆయా ఉత్పత్తుల లేబుల్స్‌పై ‘ఫార్మాల్డిహైడ్’ గురించిన వివరాలు ప్రత్యక్షంగా ఇవ్వడం లేదనీ, చాలావరకు దాని రసాయనిక పేర్లనే వాడుతున్నారని తెలిపారు. కాబట్టి, వినియోగదారులు సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో లేబుల్స్‌ను క్షుణ్నంగా చదవాలని సూచిస్తున్నారు. ఏ రకమైన ఉత్పత్తులు అనారోగ్యానికి గురిచేస్తాయో తెలుసుకోవడానికి రసాయన శాస్త్రవేత్తలే కావాల్సిన అవసరం లేదని, కాస్త అవగాహన ఉంటే చాలని అంటున్నారు. అందంగా ఉండాలని ఆరాటపడుతూ.. లేనిపోని రోగాలు కొని తెచ్చుకోవద్దని సలహా ఇస్తున్నారు.