అమెరికాలో ఏడాదికి 46వేల మందికి పైగా క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. అయితే దీన్ని అరికట్టాలంటే వారానికి కనీసం ఐదు గంటలైనా ఓ మోస్తరు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. మెడిసిన్ అండ్ సైన్స్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం 2013-16 మధ్యకాలంలో అమెరికాలోని క్యాన్సర్ రోగుల్లో 30-40 మధ్య వయసున్న వాళ్ల సంఖ్య కేవలం 3 శాతం మాత్రమే! అందులో పురుషుల కన్నా మహిళల సంఖ్యే ఎక్కువ. కానీ, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నడివయసు వారు ఎక్కువగా ఈ రోగం బారినపడుతున్నారని అధ్యయనం వెల్లడించింది. అయితే, వ్యాయామంతో క్యాన్సర్‌ను నిలువరించవచ్చని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెబుతున్నది. రొమ్ము, గర్భాశయ, పెద్దపేగు, ఉదర, మూత్రపిండాలు, అన్నవాహిక, మూత్రకోశ మొదలైన క్యాన్సర్ల నివారణలో వ్యాయామం ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపింది.